Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల్‌లో శుభ్‌మన్ ద్వి శతక గర్జన
- తొలి వన్డేలో కివీస్‌పై భారత్ గెలుపు
- ఛేదనలో బ్రాస్‌వెల్ శతక పోరాటం వృథా
ఉత్కంఠకు తెరతీసిన ఉప్పల్ వన్డే ధమాకాలో భారత్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 350 పరుగుల ఛేదనలో బ్రాస్‌వెల్ (140) శతక పోరాటం వృథా అయ్యింది. శుభ్‌మన్ గిల్ (208) ద్వి శతక విశ్వ రూపంతో తొలుత భారత్ 349 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్ వన్డే విజయంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే శనివారం రారుపూర్‌లో జరుగనుంది.
నవతెలంగాణ-హైదరాబాద్
శుభ్‌మన్ గిల్ (208, 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) ద్వి శతక గర్జనతో హైదరాబాద్ వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ మెరుపు విజయం సాధించింది. 350 పరుగుల రికార్డు ఛేదనలో బ్రాస్‌వెల్ (140, 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) శతక పోరాటం కివీస్‌ను ఓటమి నుంచి తప్పించలేదు. 131/6తో ఓటమి ఖాయమైన దశలో శాంట్నర్ (57)తో కలిసి ఏడో వికెట్‌కు 162 పరుగులు జోడించిన బ్రాస్‌వెల్ ఏకపక్ష మ్యాచ్‌ను ఉత్కంఠ స్థాయికి తీసుకెళ్లాడు. థ్రిల్లర్‌లో పైచేయి సాధించిన భారత్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. శుభ్‌మన్ గిల్ ద్వి శతకానికి తోడు రోహిత్ (34), సూర్య (31), పాండ్య (28) రాణించారు. లోకల్ హీరో మహ్మద్ సిరాజ్ (4/46) కెరీర్ ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డబుల్ సెంచరీ బాదిన గిల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
గిల్ గర్జన : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను శుభ్‌మన్ గిల్ (208) ముందుండి నడిపించాడు. పవర్‌ప్లేలో కెప్టెన్ రోహిత్ శర్మ (34)తో, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28) జతగా గిల్ గర్జించాడు. పిచ్ ఫ్లాట్‌గా లేదు, కాస్త టర్న్ లభించింది, ఆగుతూ బ్యాట్ పైకి వస్తుంది. అయినా, గిల్ ఒక్కడే భారత ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఫుల్ షాట్లతో విజృంభించిన గిల్ ఉప్పల్‌లో స్పెషల్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. భారత బ్యాటర్లలో ఎవరూ 35 పైచిలుకు పరుగులు చేయలేదు. అయినా, భారత్ 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ భారీ స్కోరు వెనుక ఉన్నది ఒకే ఒక్కడు. మైలురాళ్లు అందుకుంటూ సాగిన గిల్ విధ్వంసం ఆసాంతం కళాత్మకం. తొలి 50 పరుగులను 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 బంతుల్లో అందుకున్నాడు. మిడిల్ ఓవర్లలో వేగం పెంచిన గిల్ 87 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. మూడెంకల స్కోరు చేరుకున్నాక గిల్ దూకుడు ఆగలేదు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 100-150 పరుగుల మార్క్‌ను 35 బంతుల్లో అందుకున్న గిల్.. ద్వి శతకానికి మరో 23 బంతులే తీసుకున్నాడు. లాకీ ఫెర్గుసన్ ఓవర్లో కండ్లుచెదిరే హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. డెత్ ఓవర్లలో ఓ వైపు సహచర బ్యాటర్ల సహకారం కొరవడిన తరుణంలో గిల్ టాప్ గేర్‌లో బాదిన సిక్సర్లు అమోఘం. సహచర బ్యాటర్లు తడబడిన వేళ అద్వితీయ ఇన్నింగ్స్‌తో చెలరేగిన గిల్ ఒంటిచేత్తో భారత్‌కు భారీ స్కోరు అందించాడు. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12) నిరాశపరిచారు. సూర్యకుమార్ (31), హార్దిక్ పాండ్య (28)లు గిల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించారు.
బ్రాస్‌వెల్ పోరాటం వృథా : 349 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ వేట చప్పగా మొదలైంది. భారత బౌలర్లు వరుస వికెట్లతో బ్రేక్ సాధించారు. కాన్వే (10), నికోల్స్ (18), డార్లీ (9), ఫిలిప్స్ (11), అలెన్ (40), లేథమ్ (24) పెవిలియన్‌కు త్వరగా చేరుకున్నారు. 131/6తో భారత్ గెలుపు లాంఛనంగా కనిపించింది. ఈ దశలో మొదలైంది బ్రాస్‌వెల్ (00), శాంట్నర్ (57) పోరాటం. ఎదురుదాడికి దిగిన జోడీ ఎడాపెడా బౌండరీలు బాదింది. బ్రాస్‌వెల్ 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 57 బంతుల్లోనే శతకం సాధించగా, శాంట్నర్ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. ఏడో వికెట్‌కు 162 పరుగులు జోడించి కివీస్‌ను రేసులోకి తీసుకొచ్చారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ వరుసగా శాంట్నర్, సిప్లే (0) వికెట్లతో కివీస్‌ను దెబ్బకొట్డాడు. కానీ ఓ ఎండ్‌లో బ్రాస్‌వెల్ దూకుడు ఆగలేదు. 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో పాండ్య ఆరు బంతుల్లో 4 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. 6 బంతుల్లో 20 పరుగులు అవసరం కాగా తొలి బంతిని సిక్సర్‌గా మలిచి బ్రాస్‌వెల్ ఉత్కంఠకు తెరతీశాడు. కానీ యార్కర్‌తో బ్రాస్వెల్త్ను బోల్తాకొట్టించిన ఠాకూర్.. భారత్‌కు 12 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (సి) డార్లీ (బి) టిక్నర్ 34, గిల్ (సి) ఫిలిప్స్ (బి) సిప్లే 208, కోహ్లి (బి) శాంట్నర్ 8, కిషన్ (సి) లేథమ్ (బి) ఫెర్గుసన్ 5, సూర్య (సి) శాంట్నర్ (బి) డార్లీ 31, పాండ్య (బి) డార్లీ 28, వాషింగ్టన్ (ఎల్బీ) సిప్లే 12, ఠాకూర్ (రనౌట్) 3, కుల్దీప్ నాటౌట్ 5, షమి నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 349.
వికెట్ల పతనం : 1-60, 2-88, 3-110, 4-175, 5-249, 6-292, 7-302, 8-345.
బౌలింగ్ : సిప్లే 9-0-74-2, ఫెర్గుసన్ 10-0-77-1, టిక్నర్ 10-0-69-1, శాంట్నర్ 10-0-56-1, బ్రాస్‌వెల్ 6-0-43-0, డార్లీ మిచెల్ 5-0-30-2.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : అలెన్ (సి) షాబాజ్ (బి) ఠాకూర్ 40, కాన్వే (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 10, నికోల్స్ (బి) కుల్దీప్ 18, డార్లీ (ఎల్బీ) కుల్దీప్ 9, లేథమ్ (సి) సుందర్ (బి) సిరాజ్ 24, ఫిలిప్స్ (బి) షమి 11, బ్రాస్‌వెల్ (ఎల్బీ) ఠాకూర్ 140, శాంట్నర్ (సి) సూర్య (బి) సిరాజ్ 57, సిప్లే (బి) సిరాజ్ 0, ఫెర్గుసన్ (సి) గిల్ (బి) పాండ్య 8, టిక్నర్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం : (49.2 ఓవర్లలో ఆలౌట్) 337.
వికెట్ల పతనం : 1-28, 2-70, 3-78, 4-89, 5-110, 6-131, 7-293, 8-294, 9-328, 10-337.
బౌలింగ్ : షమి 10-1-69-1, సిరాజ్ 10-0-46-4, పాండ్య 7-0-70-1, కుల్దీప్ 8-1-43-2, ఠాకూర్ 7.2-0-54-2, సుందర్ 7-0-50-0.