Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగిన కుస్తీయోధుల ఆందోళన
- బ్రిజ్‌భూషణ్‌ను జైలుకు పంపించాలి
- రెజ్లింగ్ సమాఖ్యను ప్రక్షాళన చేయాలి
- వినేశ్, సాక్షి, భజరంగ్, రవి డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ పదవికి రాజీనామాతో పాటు చట్టపరంగా విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్లే వరకు రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళన కొనసాగుతుందని భారత స్టార్ రెజ్లర్లు తేల్చి చెప్పారు. లైంగిక వేధింపులు, చంపేస్తామని బెదిరింపులతో పాటు నియంతృత్వ విధానాలు, ఆటగాళ్లకు అన్యాం చేసే పద్దతుల పట్ల నిరసిస్తూ భారత స్టార్ రెజ్లింగ్ క్రీడాకారులు రెండు రోజులుగా న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి ఆగడాలను నిరసిస్తూ గురువారం మరికొంత మంది రెజ్లర్లు ధర్నాలో కూర్చున్నారు.
జైలుకు పంపాలి
రెజ్లర్ల జీవితాలతో ఆడుకున్న బ్రిజ్‌భూషణ్ పదవి నుంచి తప్పుకుంటే సరిపోదు. చట్టప్రకారం అతడిని జైల్లో ఉంచి శిక్షించాలని రెజ్లర్ వినేశ్ ఫోగట్ డిమాండ్ చేసింది. 'మేమంతా (రెజ్లర్లు) బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కోరటం లేదు. అతడిని చట్టప్రకారం శిక్షించాలి. పరిష్కారం కోసం ఎదురుచూస్తాం, లేదంటే శుక్రవారం బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించటంతో ఉత్తరప్రదేశ్‌లో రెజ్లింగ్ క్రీడ కనుమరుగయ్యేందుకు బ్రిజ్‌భూషణ్ కారణమయ్యాడు' అని వినేశ్ ఫోగట్ తెలిపింది. లైంగిక వేధింపుల పట్ల ఇప్పటివరకు ఐదారుగురు రెజ్లర్లు ఆధారాలతో ముందుకొచ్చారు. ఆత్మ గౌరవం అత్యంత ప్రధానం. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవటం ఎంత ఆలస్యమైతే లైంగిక వేధింపులపై ముందుకొచ్చే మహిళా రెజ్లర్లు సంఖ్య రెట్టింపు అవుతుంది. అది భారత క్రీడా రంగంలో ఓ చీకటి రోజుగా మిగిలిపోతుంది. మమ్మల్ని ఇలా మౌన రోదనకు వదిలేస్తే.. భారతదేశంలో ఎక్కడా మహిళలకు రక్షణ లేదని అనుకుంటాను. అసలు మన దేశంలో ఆడపిల్లలు జన్మించకూడదని భావిస్తానని' వినేశ్ ఫోగట్ భావోద్వేగానికి లోనైంది.
భవిత కోసమే పోరాటం
'బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి రాజీనామా సరిపోదు. రెజ్లింగ్ సమాఖ్య పాలకవర్గం మొత్తం రద్దు కావాలి. రెజ్లింగ్ సమాఖ్య ప్రక్షాళన జరగాలి. బ్రిజ్ భూషణ్ ఒక్కడే తప్పుకుంటే, అతడిని అనుచరులకు పద వులు కట్టబెడతాడు. అందు వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రెజ్లింగ్ ఫెడరేషన్ వ్యవస్థ మారాలి. ఇది మహిళా రెజ్లర్ల భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటం. ఇందులో ఎటువంటి రాజకీ యాలకు చోటు లేదని' మరో స్టార్ రెజ్లర్ బజరంగ్ పూని యా పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్ ఫెడరేషన్లో బ్రిజ్‌భూషణ్ నియంతృత్వ విధానాలపై ప్రధాని నరెంద్ర మోదికి బజరంగ్ పూనియా ఫిర్యాదు చేశారు. అయినా, పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదని పూనియా ఆవేదన వ్యక్తం చేశాడు.
తలుపులు తెరిచే ఉంచుతాడు!
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్ సందర్భంగా బ్రిజ్‌భూషణ్ వ్యవహార శైలిపై యువ రెజ్లర్ అన్షు మాలిక్ మండిపడింది. ' జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ పోటీల్లో జూనియర్ బాలికలు బస చేసిన ఫ్లోర్‌లోనే బ్రిజ్‌భూషణ్ గది ఎంచుకున్నాడు. అతడు గది తలుపులు తెరిచే ఉంచేవాడు, ప్రతి మహిళా రెజ్లర్ బ్రిజ్‌భూషణ్ ప్రవర్తనతో అసౌకర్యానికి గుర య్యారు. ప్రస్తుత రెజ్లింగ్ ఫెడరే షన్ను పూర్తిగా తొలగించాలి. రెజ్లింగ్ ఫెడరేషన్ వ్యవస్థలోనే సమూల మార్పులు అవసర మని' అన్షు మాలిక్ కోరింది.
ఉరివేసుకుంటా! :
రెజ్లింగ్ క్రీడాకారులను ఆరోపణలను బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తోసిపుచ్చాడు. 'రెజ్లర్ల ఆరోపణల్లో నిజం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలితే ఉరి వేసుకుంటా. ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండేది. వాళ్లు ఏకంగా నాపైనే ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడు నేను ఏం చేయగలను. రెజ్లర్లతో మాట్లాడేందుకు సిద్ధంగానే ఉన్నాను. కానీ రెజ్లర్లు మాకు అందుబాటులో ఉండటం లేదు' అని బ్రిజ్‌భూషణ్ వ్యాఖ్యానించాడు.
క్రీడాశాఖ నోటీసు
రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌కు నోటీసులు పంపించింది. లైంగిక వేధింపులు, చంపేస్తామని బెదిరింపులు అత్యంత సీరియస్ ఆరోపణలు. ప్రస్తుత స్థితికి దారితీసిన పరిస్థితులపై 72 గంటల్లోగా పూర్తి నివేదిక అందజేయాలి. లేదంటే, 2011 నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆందోళన చేపట్టిన రెజ్లింగ్ క్రీడాకారులతో క్రీడా మంత్రిత్వ శాఖ, శారు అధికారులు చర్చలు జరిపారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు స్పష్టమైన కార్యాచరణ లేకుండా హామీలతోనే సరిపెట్టడంతో రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బృందాకారత్ సంఘీభావం
'మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఏ మహిళ అన్యాయానికి గురైనా అండగా ఉండి పోరాడుతాం. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో ప్రభుత్వం బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ గర్వపడేలా పతకాలు సాధించిన రెజ్లర్లు ఆందోళనకు దిగటం బాధాకరం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని' సీపీఐ (ఎం) పోలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్ల వద్దకు వెళ్లి ఆమె సంఘీభావం ప్రకటించారు.
గూండా చేతిలో అధికారం
- బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ చరిత్ర నేరపూరితం
- దావూద్‌తో దోస్తీ, దోపిడీ, అల్లర్లు నేపథ్యం
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ చరిత్ర పూర్తిగా నేరపూరితం. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరఫున లోక్‌సభకు ఎన్నికైన బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్‌పై పట్టు సాధించాడు. దశాబ్దకాలానికి పైగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా నియంత పాలన సాగిస్తున్నాడు. శారు అధికారులు, టాప్ పథకం గైడ్‌లైన్స్, ప్రయివేటు స్పాన్సర్లు.. ఇలా ఎవరైనా అతడు గీసిన గీత దాటేందుకు వీల్లేదు. నియంతృత్వ విధానాల పట్ల ఎవరైనా గళం విప్పితే రెజ్లింగ్ క్రీడలో ఇక వారి పాత్ర చరిత్ర లోనే ఉండిపోతుంది. జాతీయ చాంపియన్‌షిప్స్ సందర్భంగా ప్రశ్నించిన ఓ యువ రెజ్లర్‌ను వేదికపై నుంచే చెంప చెళ్లుమనిపించాడు బ్రిజ్‌భూషణ్. మాట వినకపోతే.. ఒలింపిక్స్‌లో, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పత కం సాధించే రెజ్లర్‌పై నిషేధం విధించేందుకు వెనుకాడడు. అందుకు వినేశ్ ఫోగట్ సంఘట ననే నిలువెత్తు నిదర్శనం.
దావూద్‌తో దోస్తీ
బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ గతంలో ఉగ్రవాదులతో సంబం ధాలు కలిగిన ఉన్నందున టాడా చట్ట ప్రకారం అభియోగాలు ఎదుర్కొన్నాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం కల్పించటం, తన ఫోన్ నుంచి దావూద్‌తో అతడి అనుచరులు సంభాషించేందుకు ఏర్పాటు చేసిన ఆరోపణలు బ్రిజ్‌భూషణ్ ఎదుర్కొన్నాడు. అయోధ్యలో రామ మందిర ఉద్యమం నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన బ్రిజ్‌భూషణ్.. బాబ్రి మసీదు కూల్చివేత కేసు 40 మంది నిందితుల్లో ఉన్నాడు. 2020లో బాబ్రి కేసును న్యాయ స్థానం కొట్టివేయటంతో నిర్దో షిగా బయటపడ్డాడు. బ్రిజ్ భూషణ్‌పై దోపీడి, హత్యా యత్నం, అల్లర్లు సృష్టించటం వంటి నేరాల కింద అభియో గాలు నమోదయ్యాయి. నేర చరిత్ర కలిగిన బ్రిజ్‌భూషణ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌ను గూండాగిరీ తోనే నడిపించాడు. పదేండ్లకు పైగా బ్రిజ్‌భూషణ్ ఆగడాలను భరించిన క్రీడాకారులు.. ఇప్పుడు గళం వినిపిస్తున్నారు.
ఇవీ ఆరోపణలు
- శిక్షణ శిబిరంలో మహిళా రెజ్లర్లపై అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్, జాతీయ కోచ్‌ల లైంగిక వేధింపులు. ఇందులో జూనియర్ బాలికలు సైతం ఉన్నారు.
- నియంతృత్వ విధానాలతో రెజ్లింగ్ సమాఖ్యను నడిపించటం
- రెజ్లర్లకు ప్రయివేటు స్పాన్సర్షిప్లను దూరం చేయటం
- నాణ్యత ప్రమాణాలు లేని శిక్షణ వ్యవస్థ
- రెజ్లర్లను ఇబ్బందిపెట్టేలా షెడ్యూలింగ్
- రెజ్లింగ్ ఫెడరేషన్లో అధ్వాన పాలన