Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్‌తో భారత్ రెండో వన్డే నేడు
- మ||1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
నవతెలంగాణ-రాయ్‌పూర్
2016, 2017 భారత్‌తో వన్డే సిరీస్‌లను నిర్ణయాత్మక మ్యాచ్‌లకు తీసుకెళ్లింది న్యూజిలాండ్. 2023 వన్డే సిరీస్ ఫలితం నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందే తేల్చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. తొలి వన్డే చివరి ఓవర్ థ్రిల్లర్‌లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యం నిలిచింది. రాయ్‌పూర్ వన్డేలోనూ నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు రోహిత్‌సేన సిద్ధమ వుతోంది. సిరీస్‌ను సమం చేసేందుకు న్యూజిలాండ్ సైతం ఎదురు చూస్తుండగా.. నేడు మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధం.
బౌలింగ్ మెరుగయ్యేనా?
శుభ్‌మన్ గిల్ ద్వి శతకంతో హైదరాబాద్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. కానీ ఇతర బ్యాటర్లలో ఎవరూ 35 పరుగుల మార్క్ దాటలేదు. అటు బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్ మినహా ఎవరూ మెప్పించలేదు. ఆరు వికెట్లను కూల్చి గెలుపు లాంఛనం చేసుకున్న తరుణంలో బౌలర్లు లోయర్ ఆర్డర్‌కు తలొగ్గారు. వన్డే వరల్డ్‌కప్ ముంగిట భారత్‌కు ఈ బలహీనత మంచిది కాదు. వాషింగ్టన్ సుందర్ బంతితో అంచనాలను అందుకోవాల్సి ఉంది. కుల్దీప్ చక్కగా మాయ చేస్తున్నాడు. షమి, శార్దుల్ మెరిస్తే పేస్ విభాగంలో సమస్య ఉండదు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెగా ఇన్నింగ్స్‌లపై కన్నేసి నేడు బరిలోకి దిగుతున్నారు.
సమం చేస్తారా?
ఓటమి ఖాయమైన మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకూ వెళ్లిన న్యూజిలాండ్.. నేడు రారుపూర్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. టాప్ ఆర్డర్లో కీలక బ్యాటర్లు అంచనాల మేరకు రాణిస్తే సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలుపుకోవచ్చు. కెప్టెన్ టామ్ లేథమ్, మైకల్ బ్రేస్‌వెల్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వేలు కివీస్‌కు కీలకం కానున్నారు. గాయం నుంచి కోలుకున్న ఇశ్ సోధి నేడు తుది జట్టులోకి రానున్నాడు.