Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైట్‌బాల్ ఫార్మాట్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. తిరువనంతపురంలో శ్రీలంకపై పరుగుల పరంగా రికార్డు విజయం సాధించిన భారత్.. తాజాగా రారుపూర్‌లో బంతుల పరంగా న్యూజిలాండ్‌పై మరో రికార్డు విజయం నమోదు చేసింది. పేసర్లు, స్పిన్నర్లు కలిసికట్టుగా చెలరేగిన వేళ తొలుత న్యూజిలాండ్ 108 పరుగులకు కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 29.5 ఓవర్లు ఉండగానే ఊదిపడేసింది.
- చెలరేగిన పేసర్లు, స్పిన్నర్లు
- రెండో వన్డేలో న్యూజిలాండ్ చిత్తు
- 2-0తో సిరీస్ భారత్ వశం
నవతెలంగాణ-రాయ్‌పూర్
టీమ్ ఇండియా ఖాతాలో మరో సిరీస్ పడింది. బౌలర్లు కండ్లుచెదిరే ప్రదర్శన చేసిన వేళ రారుపూర్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పేసర్లు మహ్మద్ షమి (3/18), హార్దిక్ పాండ్య (2/16), స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (2/7) మెరిసిన వేళ తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (36, 52 బంతుల్లో 5 ఫోర్లు), మైకల్ బ్రాస్‌వెల్ (22, 30 బంతుల్లో 4 ఫోర్లు), మిచెల్ శాంట్నర్ (27, 39 బంతుల్లో 3 ఫోర్లు) న్యూజిలాండ్‌కు వంద పరుగుల స్కోరు అందించారు. 109 పరుగుల ఛేదనలో భారత్ చెమట పట్టకుండా గెలుపు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (51, 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించగా, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (40 నాటౌట్, 53 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఓపెనర్ల ధనాధన్‌తో భారత్ 20.1 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. పేసర్ మహ్మద్ షమి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సాధించాడు. మరో 179 బంతులు ఉండగానే గెలుపొందిన భారత్.. బంతుల పరంగా న్యూజిలాండ్‌పై అతిపెద్ద వన్డే విజయం నమోదు చేసింది. హైదరాబాద్, రారుపూర్ వన్డేల్లో గెలుపొందిన టీమ్ ఇండియా 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే మంగళవారం ఇండోర్ వేదికగా జరుగనుంది.
సూపర్ షమి : హైదరాబాద్ థ్రిల్లర్‌లో భారత్ నెగ్గినా.. బౌలర్లు తేలిపోయారు. మహ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ అంచనాల మేరకు రాణించలేదు. బౌలింగ్ విభాగంలో మెరుగుదలే లక్ష్యంగా రారుపూర్‌లో భారత్ టాస్ నెగ్గినా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సవాల్‌ను బౌలర్లు నిలబెట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే వికెట్ల వేటకు శ్రీకారం చుట్టారు. ఇన్నింగ్స్ ఐదో బంతికే ఫిన్ అలెన్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు షమి. వికెట్ల వేటలో సిరాజ్ సైతం జతకలిశాడు. హెన్రీ నికోల్స్ (2)ను వెనక్కి పంపించాడు. షమి, ఠాకూర్, పాండ్యలు వరుసగా కివీస్ టాప్ ఆర్డర్‌ను వేటాడారు. డెవాన్ కాన్వే (7), డార్లీ మిచెల్ (1), టామ్ లేథమ్ (1)లు భారత పేసర్లకు దాసోహం అయ్యారు. 10.3 ఓవర్లలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్ 50 పరుగులు చేసినా అద్భుతమే అనిపించింది. కానీ లోయర్ ఆర్డర్ మరోసారి కివీస్‌ను ఆదుకుంది. గ్లెన్ ఫిలిప్స్ (36), బ్రాస్‌వెల్ (22), శాంట్నర్ (27) విలువైన ఇన్నింగ్స్‌లతో న్యూజిలాండ్ స్కోరును 100 పరుగుల మార్క్‌కు తీసుకొచ్చారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ సైతం వికెట్ల వేటలో మాయజాలం చేశారు. దీంతో 34.3 ఓవర్లలో న్యూజిలాండ్ 108 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో అందరూ వికెట్ పడగొట్టడం విశేషం.
ఓపెనర్ల ధనాధన్ : 109 పరుగుల ఛేదనలో భారత్ అలవోక విజయం నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (51), శుభ్‌మన్ గిల్ (40) గెలుపును సులువు చేశారు. ఆరంభంలో వికెట్లతో భారత్‌పై ఒత్తిడి పెంచాలని చూసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. తొలి వికెట్‌కు 14.2 ఓవర్లలో 72 పరుగులు జోడించిన ఓపెనర్లు విజయాన్ని లాంఛనం చేశారు. అర్థ సెంచరీ అనంతరం రోహిత్, ఆ వెంటనే విరాట్ కోహ్లి (11) నిష్క్రమించారు. అయినా, ఎటువంటి కంగారూ లేకుండా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (8 నాటౌట్) పని పూర్తి చేశారు. 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న భారత్ మరో 179 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. బంతుల పరంగా న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇది అతిపెద్ద విజయం కావటం విశేషం.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : అలెన్ (బి) షమి 0, కాన్వే (సి,బి) పాండ్య 7, నికోల్స్ (సి) గిల్ (బి) సిరాజ్ 2, డార్లీ మిచెల్ (సి,బి) షమి 1, లేథమ్ (సి) గిల్ (బి) ఠాకూర్ 1, ఫిలిప్స్ (సి) సూర్య (బి) సుందర్ 36, బ్రాస్‌వెల్ (సి) కిషన్ (బి) షమి 22, శాంట్నర్ (బి) పాండ్య 27, సిప్లే నాటౌట్ 2, ఫెర్గుసన్ (సి) సూర్య (బి) సుందర్ 1, టిక్నర్ (ఎల్బీ) కుల్దీప్ 2, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (34.3 ఓవర్లలో ఆలౌట్) 108.
వికెట్ల పతనం : 1-0, 2-8, 3-9, 4-15, 5-15, 6-56, 7-103, 8-103, 9-105, 10-108.
బౌలింగ్ : మహ్మద్ షమి 6-1-18-3, మహ్మద్ సిరాజ్ 6-1-10-1, శార్దుల్ ఠాకూర్ 6-1-26-1, హార్దిక్ పాండ్య 6-3-16-2, కుల్దీప్ యాదవ్ 7.3-0-29-1, వాషింగ్టన్ సుందర్ 3-1-7-2.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (ఎల్బీ) సిప్లే 51, శుభ్‌మన్ గిల్ 40 నాటౌట్, విరాట్ కోహ్లి (స్టంప్డ్) లేథమ్ (బి) శాంట్నర్ 11, ఇషాన్ కిషన్ 8 నాటౌట్, ఎక్స్‌ట్రాలు :01, మొత్తం : (20.1 ఓవర్లలో 2 వికెట్లకు) 111.
వికెట్ల పతనం : 1-72, 2-98.
బౌలింగ్ : లాకీ ఫెర్గుసన్ 5-0-21-0, హెన్రీ సిప్లే 5-0-29-1, బ్లెయిర్ టిక్నర్ 4-0-19-0, మిచెల్ శాంట్నర్ 4.1-0-28-1, మైకల్ బ్రాస్‌వెల్ 2-0-13-0.