Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోపణలపై విచారణకు కమిటీ
- రెజ్లింగ్ సమాఖ్యను నడపనున్న కమిటీ
- ఆందోళన విరమించిన రెజ్లింగ్ క్రీడాకారులు
కుస్తీ యోధుల మూడు రోజుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. లైంగిక వేధింపులు, ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు తాత్కాలికంగా పదవి నుంచి తప్పుకున్నాడు. రెజ్లింగ్ సమాఖ్య ఆఫీస్ బేరర్లపై విచారణకు, రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ పర్యవేక్షణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ పదవి నుంచి తప్పుకున్నాడు. భారత స్టార్ కుస్తీ యోధులు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, అన్షు మాలిక్, బజరంగ్ పూనియా, రవి దహియా, దీపక్ పూనియాలు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఆగడాలను నిరసిస్తూ న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మూడు రోజులుగా నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆందోళన రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌తో మాట్లాడిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. పదవి నుంచి వైదొలిగేలా ఎంపీని ఒప్పించారు. శుక్రవారం అర్థరాత్రి రెజ్లింగ్ క్రీడాకారులతో కలిసి కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
విచారణ కమిటీ ఏర్పాటు
రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేసిన మూడో రోజు ఆందోళన కీలక పరిణామాలతో ముగిసింది. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని రెజ్లర్లు తొలుత భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ను కోరారు. అత్యవసరంగా సమావేశమైన ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీ నియమించింది. ఐఓఏ కమిటీలో బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, ఆర్చర్ డోలా బెనర్జీలు సైతం ఉన్నారు. ఇక పరిస్థితులు చేయిదాటుతున్న క్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. శుక్రవారం రాత్రి రెజ్లింగ్ క్రీడాకారులతో తన నివాసంలో సమావేశమైన ఠాకూర్.. అన్ని అంశాలపై చర్చించారు. రెజ్లర్ల డిమాండ్ మేరకు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తక్షణమే పదవి నుంచి తప్పుకునేలా మంత్రి మధ్యవర్తిత్వం వహించారు. రెజ్లర్ల ఆరోపణలపై విచారణకు క్రీడామంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది. కమిటీ సభ్యుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. విచారణ కమిటీ నాలుగు వారాల్లో నివేదికను అందజేయనుంది. ఈ నాలుగు వారాల సమయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ వ్యవహారాలను సైతం ఈ కమిటీ పర్యవేక్షించనుంది. జూనియర్, సీనియర్ రెజ్లర్లను సహా డబ్ల్యూఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు, యంత్రాంగంతో విచారణ కమిటీ సమావేశం కానుంది. ' భారత రెజ్లింగ్ సమాఖ్యపై రెజ్లర్ల ఆరోపణలపై క్రీడామంత్రిత్వ శాఖ ఇండిపెండెంట్ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. కమిటీ నాలుగు వారాల్లో నివేదికను అందజేస్తుంది. ఈ సమయంలో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌భూషణ్ తప్పుకుంటారు. రెజ్లింగ్ ఫెడరేషన్ రోజువారీ వ్యవహారాలను కమిటీ చూసుకుంటుందని' క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నాడు.
ముగిసిన ఆందోళన
రెజ్లింగ్ క్రీడాకారుల డిమాండ్లకు అంగీకరిస్తూ క్రీడాశాఖ కీలక నిర్ణయం తీసుకోవటంతో రెజ్లర్లు తమ నిరసన విరమించారు. ' రెజ్లర్లకు న్యాయం జరుగుతుందని క్రీడాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఇంతటితో ఈ ఆందోళనను విరమిస్తున్నాం. రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అని బజరంగ్ పూనియా తెలిపాడు.
డబ్ల్యూఎఫ్ఐపై ఆరోపణలు
- శిక్షణ శిబిరంలో బ్రిజ్‌భూషణ్, జాతీయ కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేశారు. బాధితుల్లో జూనియర్ రెజ్లింగ్ బాలికలు సైతం ఉన్నారు.
- నియంతృత్వ విధానాలతో రెజ్లింగ్ సమాఖ్యను నడిపిస్తున్నారు
- రెజ్లర్లను ప్రయివేటు స్పాన్సర్షిప్లకు దూరం చేస్తున్నారు
- ఫెడరేషన్ నిధులను సొంతానికి వాడుకుంటున్నారు
- నాణ్యత ప్రమాణాలు లేని శిక్షణ వ్యవస్థ
- రెజ్లర్లను ఇబ్బందులకు గురిచేసేలా షెడ్యూలింగ్
- రెజ్లింగ్ ఫెడరేషన్లో అధ్వాన పరిపాలన