Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత రెజ్లింగ్ సమాఖ్య పర్యవేక్షణ బాధ్యతలు సైతం
న్యూఢిల్లీ : భారత క్రీడా రంగంలో పెను సంచలనం సృష్టించిన రెజ్లర్ల ఆందోళన వ్యవహారంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై విచారణ కమిటీకి భారత బాక్సింగ్ దిగ్గజం, మాజీ ఎంపీ ఎంసీ మేరీకోమ్ సారథ్యం వహించనున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య పనితీరు, అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలను ఈ కమిటీ విచారణ చేయనుంది. విచారణ సందర్భంగా రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు సహా ఆఫీస్ బేరర్లు అందరూ తాత్కాలికంగా పదవి నుంచి తప్పించబడ్డారు. ఈ కమిటీ విచారణ నివేదికను నాలుగు వారాల్లో క్రీడామంత్రిత్వ శాఖకు అందజేయనుంది. విచారణ, పర్యవేక్షణ కమిటీకి ఎంసీ మేరీకోమ్ చైర్‌పర్సన్‌గా ఉండనుండగా, ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్, మిషన్ ఒలింపిక్ సెల్ కమిటీ సభ్యులు త్రప్తి ముర్గుందె, టాప్స్ మాజీ సీఈవో రాజగోపాలన్, సారు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమాన్ విచారణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
లైంగిక వేధింపులు, ఆర్థిక అవకతవకలు సహా పలు అంశాలపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చట్టపర చర్యలు తీసుకోవాంటూ భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగల్, సాక్షి మాలిక్, అన్షు మాలిక్, రవి దహియా, బజరంగ్ పూనియా, దీపక్ పూనియా సహా రెజ్లింగ్ క్రీడాకారులు మూడు రోజుల పాటు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
రెజ్లర్ల మూడు రోజు ఆందోళనకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను డబ్ల్యూఎఫ్ఐ బాధ్యతల నుంచి తప్పించి ఆరోపణలపై విచారణకు ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసింది. డబ్ల్యూఎఫ్ఐ విచారణకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సైతం విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.