Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్‌తో భారత్ మూడో వన్డే నేడు
- ఊరట విజయం వేటలో న్యూజిలాండ్
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
స్వదేశీ సీజన్లో టీమ్ ఇండియా వరుసగా రెండో క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. శ్రీలంకను 3-0తో చిత్తు చేసిన భారత్.. తాజాగా న్యూజిలాండ్‌పై 3-0 సిరీస్ విజయం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో గిల్ ద్వి శతక గర్జన, రారుపూర్‌లో షమి విజృంభణతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ నేడు ఇండోర్‌లో ఇరగదీసేందుకు సిద్ధమవుతోంది. కివీస్ ఊరట విజయం వేటలో ఉండగా, భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. భారత్, న్యూజిలాండ్ చివరి వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-ఇండోర్
సొంతగడ్డపై టీమ్ ఇండియా జైత్ర యాత్రలో మరో క్లీన్‌స్వీప్ ఎదురుచూస్తోంది. 2009 నుంచి స్వదేశంలో ద్వైపాక్షిక వన్డేల్లో టీమ్ ఇండియాకు తిరుగులేని రికార్డుంది. 27 సిరీస్‌ల్లో ఏకంగా 23 సిరీస్‌లను గెల్చుకున్న భారత్.. 72 ద్వైపాక్షిక వన్డేల్లో గెలుపొందింది, కేవలం 28 వన్డేల్లోనే ప్రత్యర్థికి తలొగ్గింది. ఇటీవల శ్రీలంకపై 3-0తో వన్డే సిరీస్ సాధించిన భారత్.. వరుసగా రెండో క్లీన్‌స్వీప్ కోసం ఉవ్విళ్లూరుతోంది. 2-0తో వన్డే సిరీస్ ఇప్పటికే భారత్ సొంత కాగా.. నామమాత్రపు చివరి వన్డేలో నేడు భారత్, న్యూజిలాండ్ మరో థ్రిల్లర్‌కు సిద్ధమయ్యాయి. భారత్ క్లీన్‌స్వీప్ చేస్తుందా? న్యూజిలాండ్ ఊరట విజయం సాధిస్తుందా? చూడాలి.
జోరుమీదున్న భారత్ : ఐసీసీ నం.1 వన్డే జట్టు న్యూజిలాండ్‌తో భారత్ ఉత్కంఠ మ్యాచ్‌లను అంచనా వేసింది. అందుకు తగినట్టుగానే హైదరాబాద్‌లో హోరాహోరీ కనిపించింది. కానీ రారుపూర్‌లో భారత్ ఏకపక్ష విజయం నమోదు చేసి కివీస్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టింది. హైదరాబాద్‌లో నిరాశపరిచిన బౌలర్లు.. రారుపూర్‌లో కండ్లుచెదిరే ప్రదర్శన చేశారు. కొంతకాలంగా పేలవంగా రాణిస్తున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమి.. రెండో వన్డేలో అసమానంగా మెరిశాడు. హార్దిక్ పాండ్య, శార్దుల్ ఠాకూర్లకు తోడు వాషింగ్టన్ సుందర్ సైతం రాణించాడు. పరిపూర్ణ బౌలింగ్ విజయం సాధించిన భారత్.. నామమాత్రపు మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుందా? ఆసక్తికరం. కె.ఎస్ భరత్, రజత్ పటీదార్ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్ ఏడాదిలో ప్రయోగాలకు వెళ్లకుండా ప్రథమ ప్రాధాన్య జట్టుతోనే ఆడేందుకు రోహిత్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. బౌలింగ్ విభాగంలో అంతా సర్దుకున్నప్పటికీ.. బ్యాట్‌తో భారత్ పూర్తి స్థాయిలో మెరవాల్సి ఉంది. విరాట్ కోహ్లి రెండు వన్డేల్లో నిరాశపరిచాడు. శ్రీలంకపై రెండు శతకాలు బాదిన కోహ్లి.. ఇండోర్‌లో మెగా ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. కెప్టెన్ రోహిత్ శర్మ రారుపూర్‌లో మెరిసినా వికెట్ కాపాడుకోలేదు. శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఆపేందుకు న్యూజిలాండ్ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నట్టు కనిపించటం లేదు. సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్లో తన మార్క్ చూపించాలని ఆరాటపడుతున్నాడు. ఇషాన్ కిషన్ ద్వి శతకం తర్వాత గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. నేడు ఇండోర్‌లో సూర్య, కిషన్, రోహిత్ మెరవాలని భారత్ ఆశిస్తోంది.
ఊరట వేట : అగ్రజట్టుగా భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్.. విలియమ్సన్, సౌథీ, బౌల్ట్ సేవలు కోల్పోయి అండర్‌డాగ్‌గానే సిరీస్‌ను ఆరంభించింది. కీలక ఆటగాళ్లు దూరం కావటం ఆ జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించింది. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో కివీస్‌కు నాయకత్వం వహించే ఆటగాళ్లు కరువయ్యారు. టాప్ ఆర్డర్ రెండు వన్డేల్లోనూ చేతులెత్తేయగా.. బౌలర్లు సైతం రెండు మ్యాచుల్లో అంచనాలను అందుకోలేదు. కెప్టెన్ టామ్ లేథమ్, బ్రాస్‌వెల్, శాంట్నర్ మినహా బ్యాట్‌తో మరోకరు రాణించలేదు. నేడు చివరి మ్యాచ్‌లోనైనా టాప్ ఆర్డర్ నుంచి పరుగులు వస్తాయా?. గతంలో భారత్ పేస్, స్పిన్‌తో ఇరకాటంలో పడేసిన న్యూజిలాండ్.. ఈ పర్యటనలో తేలిపోయింది. 2016, 2017 వన్డే సిరీస్‌లు నిర్ణయాత్మక మ్యాచ్‌కు వెళ్లగా.. ఈసారి భారత్ ఆధిపత్యంతో ఏకపక్షంగా సాగింది. టీ20 సిరీస్‌కు ముందు ఊరట విజయంతో విలువైన ఆత్మవిశ్వాసం సాధిస్తారేమో చూడాలి.
పిచ్, వాతావరణం : ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం భారత్‌కు కంచుకోట. ఇక్కడ జరిగిన 10 మ్యాచుల్లో (అన్ని ఫార్మాట్లు) భారత్ ఏకంగా 9 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక్కడ ఆడిన ఐదు వన్డేల్లో భారత్ ఓటమెరుగదు. లక్ష్యాన్ని ఛేదించినా, లక్ష్యాన్ని నిర్దేశించినా హోల్కర్ స్టేడియంలో భారత్‌కు తిరుగు లేదు. మంగళవారం వన్డేకు బ్యాట్‌కు, బంతికి సరసమైన పోటీ ఇచ్చే పిచ్‌ను సిద్ధం చేశారు. ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డార్లీ మిచెల్, టామ్ లేథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్, ఇశ్ సోధి, డౌగ్ బ్రాస్‌వెల్, లాకీ ఫెర్గుసన్.