Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటు ప్రక్రియలో సంప్రదించలేదు
- రెజ్లర్లు వినేశ్, సాక్షి, బజరంగ్ ట్వీట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ), బిజెపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలను విచారణ చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ పట్ల రెజ్లింగ్ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ నియంతృత్వ విధానాలతో దశాబ్దకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ క్రీడాకారులు, బిజెపీ ఎంపీపై చట్టపర చర్యలు తీసుకోవాలని మూడు రోజుల పాటు జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ ఆందోళనలో భారత్‌కు ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలు సాధించిన వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, అన్షు మాలిక్, బజరంగ్ పూనియా, దీపక్ పూనియాలు ఉన్నారు. రెజ్లర్ల ఆందోళనకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూఎఫ్‌ఐ బాధ్యతల నుంచి బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను తాత్కాలికంగా తప్పిస్తూ, విచారణ కమిటీ ఏర్పాటు అంగీకారం తెలిపింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీతో రెజ్లర్లు మూడు రోజుల ఆందోళనను విరమించారు.
సంప్రదించలేదు! : డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సహా ఆఫీస్ బేరర్లను బాధ్యతలకు దూరంగా ఉండమని ఆదేశిస్తూ క్రీడాశాఖ సర్క్యూలర్ జారీ చేసింది. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలను విచారణ చేసే కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో రెజ్లింగ్ క్రీడాకారులతో భాగం చేస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల విచారణ, పర్యవేక్షణ కమిటీని క్రీడాశాఖ సోమవారం ప్రకటించింది. మంత్రి హామీ మేరకు విచారణ కమిటీ ఏర్పాటు అంశంలో ఎటువంటి సంప్రదింపులు జరుపలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒలింపిక్ మెడలిస్ట్, దిగ్గజ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మిషన్ ఒలింపిక్ సభ్యురాలు, మాజీ షట్లర్ తృప్తి, సారు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమాన్, టాప్స్ మాజీ సీఈవో రాజేశ్ రాజగోపాలన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నాలుగు వారాల్లో ఈ కమిటీ విచారణ నివేదికను క్రీడాశాఖకు అందజేయాల్సి ఉంది. కమిటీ నివేదికపై క్రీడాశాఖ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీ డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను చూడనుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సైతం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీతో కలిసి ఐఓఏ కమిటీ సైతం సమాంతర విచారణ జరుపనుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ (ప్రభుత్వ ఉద్యోగి)ను సస్పెండ్ చేస్తూ క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట తప్పడంపై రెజ్లర్లు ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'డబ్ల్యూఎఫ్‌ఐపై విచారణ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ముందు మమ్మల్ని (రెజ్లర్లు) సంప్రదిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియలో ఎవరూ సంప్రదించే ప్రయత్నం చేయకపోవటం అత్యంత విచారకరం' అంటూ వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని నరెంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్‌లను ట్యాగ్ చేశారు.