Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ నం.1 వన్డే జట్టుగా టీమ్ ఇండియా
విజయం పరిపూర్ణం. న్యూజిలాండ్‌ను వరుసగా మూడో వన్డేలో చిత్తు చేసిన భారత్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) శతకాల పండుగ చేయగా భారత్ తొలుత 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించటంతో ఛేదనలో న్యూజిలాండ్ 295 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఏడాదిలో భారత్ వరుసగా రెండో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయటం విశేషం.
- మూడో వన్డేలో భారత్ భారీ విజయం
- 3-0తో కివీస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్
నవతెలంగాణ-ఇండోర్
శుభ్‌మన్ గిల్ (112, 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ శర్మ (101, 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతక మోత మోగించటంతో మూడో వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 90 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. న్యూజిలాం డ్‌పై ఈ ఘనతను మూడోసారి సాధించింది. గిల్, రోహిత్‌లకు తోడు హార్దిక్ పాండ్య (54, 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 385 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే (138, 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకంతో మెరిసినా.. న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. పేసర్ శార్దుల్ ఠాకూర్ (3/52), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/62) మూడు వికెట్ల ప్రదర్శనతో కివీస్ పతనాన్ని శాసించారు. శార్దుల్ ఠాకూర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, శుభ్‌మన్ గిల్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ శుక్రవారం రాంచి తొలి టీ20లో ఆరంభం కానుంది.
ఓపెనర్ల శతక జోరు : టాస్ నెగ్గిన కివీస్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. హోల్కర్ స్టేడియంలో భారత ఓపెనర్లు పరుగుల సునామీతో దండెత్తారు. కెప్టెన్ రోహిత్ (101) పూర్వ వైభవం చాటాడు. ఆరంభంలో నెమ్మదిగా పరుగులు సాధించినా, క్రీజులో కుదురుకున్నాక బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో జాకబ్ డఫ్సీపై రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో చెలరేగిన రోహిత్ శర్మ.. అక్కడ్నుంచి దూకుడు తగ్గలేదు. మరో ఎండ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (112) మరో శతకం సాధించాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 41 బంతుల్లో అర్థ సెంచరీ కొట్టిన రోహిత్.. 9 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 బంతుల్లోనే వంద మార్క్ అందుకున్నాడు. 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన గిల్.. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 బంతుల్లోనే సిరీస్‌లో రెండో సెంచరీ సాధించాడు. ఓపెనర్లు 212 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయటంతో భారీ స్కోరుకు గట్టి పునాది పడింది. హార్దిక్ పాండ్య (54), విరాట్ కోహ్లి (36) విలువైన ఇన్నింగ్స్‌లతో భారత్ ధనాధన్ ముగింపు అందుకుంది. కివీస్ బౌలర్లలో జాకబ్, టిక్‌నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
శార్దుల్, కుల్దీప్ షో : 386 పరుగుల భారీ ఛేదనలో ఆరంభంలోనే ఓపనర్ ఫిన్ అలెన్ (0)ను కోల్పోయింది కివీస్. డెవాన్ కాన్వే (138), హెన్రీ నికోల్స్ (42) రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో న్యూజిలాండ్‌ను రేసులో నిలిపారు. పేసర్ శార్దుల్, స్పిన్నర్ కుల్దీప్ మ్యాజిక్‌తో న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 బంతుల్లోనే సెంచరీ బాదిన డెవాన్ కాన్వే ఛేదనపై ఆసక్తి నిలబెట్టాడు. కాన్వే నిష్క్రమణతో 230 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న న్యూజిలాండ్ ఓటమి అంచున నిలిచింది. బ్రాస్‌వెల్ (26), శాంట్నర్ (34) కాసేపు ఆశలు నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. 41.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ కుప్పకూలగా భారత్ 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (బి) బ్రాస్‌వెల్ 101, గిల్ (సి) కాన్వే (బి) టిక్‌నర్ 112, కోహ్లి (సి) అలెన్ (బి) జాకబ్ 36, కిషన్ (రనౌట్) 17, సూర్య (సి) కాన్వే (బి) జాకబ్ 14, పాండ్య (సి) కాన్వే (బి) జాకబ్ 54, వాషింగ్టన్ (సి) డార్లీ (బి) టిక్‌నర్ 9, ఠాకూర్ (సి) లేథమ్ (బి) టిక్‌నర్ 25, కుల్దీప్ (రనౌట్) 3, మాలిక్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు :12, మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 385.
వికెట్ల పతనం : 1-212, 2-230, 3-268, 4-284, 5-293, 6-313, 7-367, 8-379, 9-385.
బౌలింగ్ : జాకబ్ 10-0-100-3, ఫెర్గుసన్ 10-1-53-0, టిక్‌నర్ 10-0-76-3, శాంట్నర్ 10-0-58-0, డార్లీ 4-0-41-0, బ్రాస్‌వెల్ 6-0-51-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : అలెన్ (బి) పాండ్య 0, కాన్వే (సి) రోహిత్ (బి) మాలిక్ 138, నికోల్స్ (ఎల్బీ) కుల్దీప్ 42, డార్లీ (సి) కిషన్ (బి) ఠాకూర్ 24, లేథమ్ (సి) పాండ్య (బి) ఠాకూర్ 0, ఫిలిప్స్ (సి) కోహ్లి (బి) ఠాకూర్ 5, బ్రాస్‌వెల్ (స్టంప్డ్) కిషన్ (బి) కుల్దీప్ 26, శాంట్నర్ (సి) కోహ్లి (బి) చాహల్ 34, ఫెర్గుసన్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 7, జాకబ్ (ఎల్బీ) చాహల్ 0, టిక్‌నర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం : (41.2 ఓవర్లలో ఆలౌట్) 295.
వికెట్ల పతనం : 1-0, 2-106, 3-184, 4-184, 5-200, 6-230, 7-269, 8-279, 9-280, 10-295.
బౌలింగ్ : పాండ్య 6-0-36-1, వాషింగ్టన్ 6-0-49-0, ఠాకూర్ 6-0-45-3, మాలిక్ 7-0-52-1, కుల్దీప్ 9-0-62-3, చాహల్ 7.2-0-43-2.