Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వదేశీ వైట్‌బాల్ ధమాకాలో మరో అంకానికి తెరలేచింది. న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా పొట్టి ఫార్మాట్లో ధనాధన్‌కు సిద్ధమవుతోంది. హార్దిక్ పాండ్య ముచ్చటగా మూడో సిరీస్‌లో భారత్‌కు సారథ్యం వహించనుండగా యువ ఆటగాళ్లతో కూడిన భారత్‌పై పర్యటనలో తొలి విజయం సాధించేందుకు న్యూజిలాండ్ తహతహలాడుతోంది. ధోని ఇలాకా రాంచీలో భారత్,న్యూజిలాండ్ ధనాధన్ నేడు.
- భారత్, కివీస్ తొలి టీ20 నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-రాంచి
సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు లేకుండానే టీమ్ ఇండియా వరుసగా మూడో టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం చేసుకుంది. వైట్‌బాల్ ఫార్మాట్లో ద్వంద్వ కెప్టెన్సీ విధానం అమలు చేస్తున్నారా? రెగ్యులర్ సారథికి విశ్రాంతి ఇచ్చారా? యువ జట్టుతోనే పొట్టి ఫార్మాట్లో కొనసాగుతారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే భారత క్రికెట్‌ను బీసీసీఐ ముందుకు నడిపిస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోని అడ్డా రాంచీలో ఆతిథ్య జట్టుకు తిరుగులేని రికార్డుంది. ఇక్కడ ఆడిన మూడు టీ20 మ్యాచుల్లో టీమ్ ఇండియా విజయాలు సాధించింది. భారత పర్యటనలో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న న్యూజిలాండ్ ఓవైపు, పాండ్య సారథ్యంలోని యువ భారత్ ఓవైపు నేడు రాంచీ షోకు సిద్ధం.
సత్తా చాటుతారా?
2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనంతరం భారత టీ20 జట్టులో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. అధికారికంగా బోర్డు ఎటువంటి ప్రకటన చేయకపోయినా.. పొట్టి ఫార్మాట్లో యువ క్రికెటర్లతోనే ముందుకెళ్లే ప్రణాళిక అమలు జరుగుతోంది. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచానికి సత్తా చాటాడు. కానీ టాప్ ఆర్డర్లో మిగతా బ్యాటర్లు ఆ స్థాయి అందుకోవాల్సి ఉంది. రుతురాజ్‌కు గాయంతో గిల్, కిషన్, పృథ్వీ షా రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. పృథ్వీ షా భయమెరుగని క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్. ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడటంలో దిట్ట. గిల్ కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గిల్ తోడుగా కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. అయితే, ఈ ఫార్మాట్లో ఈ ఇద్దరూ పరిస్థితులకు అనుగుణంగా, జట్టు ప్రణాళికల ప్రకారం ఎదురుదాడి పరీక్షలో నెగ్గాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్, శివం మావిలు తుది జట్టులో కొనసాగనున్నారు. అరంగేట్ర సిరీస్‌లో శివం మావి మెప్పించాడు. వికెట్లు, పరుగుల పొదుపుతో కెప్టెన్ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఉమ్రాన్ మాలిక్ వికెట్ల పరంగా ఫర్వాలేదనిపించినా, పరుగుల పొదుపులో మెరుగుపడాల్సి ఉంది. ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు కూల్చిన మాలిక్.. 10.90 ఎకానమీతో ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఎకానమీ అంశంలో ఉమ్రాన్ మాలిక్ లోపాలు దిద్దుకుంటేనే తుది జట్టులో నిలువగలడు. స్పిన్ విభాగంలో చైనామన్ కుల్దీప్ యాదవ్, మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్ ఒకే స్థానం కోసం పోటీపడుతున్నారు. తాజా ఫామ్‌తో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
పుంజుకుంటారా?
కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ. న్యూజిలాండ్‌కు బ్యాట్‌తో, బంతితో ఇద్దరు అగ్ర ఆటగాళ్లు. ఈ ఇద్దరు లేకుండానే కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. మూడు వన్డేల్లో చేతులెత్తేయగా.. ఇక టీ20ల్లోనైనా పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ పగ్గాలు మిచెల్ శాంట్నర్ అందుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో న్యూజిలాండ్‌కు ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నారు. కానీ అనుభవం పరంగా కివీస్ అత్యంత బలహీనం. పొట్టి ఫార్మాట్లో గణాంకాలు, సమీకరణాలకు పెద్దగా చోటుండదు. అందుకే ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్‌లు భారత్‌కు సవాల్ విసరనున్నారు. వన్డే సిరీస్‌లో మెరిసిన మైకల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ అదే జోరు కొనసాగించేందుకు చూస్తున్నారు. బంతితో లాకీ ఫెర్గుసన్ ఒక్కడే అనుభవజ్ఞుడు. ఇశ్ సోధి ఫిట్నెస్ సాధించటం కివీస్‌కు అతి పెద్ద ఊరట. బ్లెయిర్ టిక్నర్, బెన్ లిస్టర్లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
పిచ్, వాతావరణం
రాంచీ పిచ్ తొలుత బౌలింగ్ చేసిన జట్టుకు అనుకూలం. ఇక్కడ 25 టీ20 మ్యాచుల్లో 16 మ్యాచుల్లో ఛేదించిన జట్టును విజయం వరించింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం గణనీయంగా కనిపించనుంది. టాస్ నెగ్గిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు ఏమాత్రం ఆలోచన చేయరు. శుక్రవారం రాంచీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. చల్లని సాయంత్రం పొట్టి పోరు ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుంది. ఎటువంటి వర్షం సూచనలు లేవని సమాచారం.
తుది జట్లు (అంచనా)
భారత్ : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/యుజ్వెంద్ర చాహల్.
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, మైకల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), బ్లెయిర్ టిక్నర్, ఇశ్ సోధి, బెన్ లిస్టర్, లాకీ ఫెర్గుసన్.