Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత క్రీడారంగంలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. ఆటతో పాటు సమాజం ఛట్రాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచిన చరిత్ర ఆమెది. మేరీకోమ్, సైనా నెహ్వాల్, పి.వి సింధు కంటే ముందే భారత క్రీడారంగ ముఖచిత్రంగా నిలిచిన సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను గ్రాండ్‌గా ముగించింది. 36 ఏండ్ల సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించింది.
- ముగిసిన గ్రాండ్‌స్లామ్ కెరీర్
- భారత టెన్నిస్ ముఖచిత్రం
నవతెలంగాణ క్రీడావిభాగం
'నేను ఇప్పుడు కంటతడి పెడితే అవి ఆనందభాష్పాలే, బాధ నుంచి వచ్చినవి కావు' 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్ అనంతరం సానియా మీర్జా వ్యాఖ్యలు ఇవి. ఎక్కడైతే గ్రాండ్‌స్లామ్ కెరీర్ మొదలుపెట్టిందో, అక్కడే గ్రాండ్‌గా గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించింది సానియా మీర్జా. 36 ఏండ్ల సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీతో వీడ్కోలు పలికింది. టెన్నిస్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలకు వేదికగా నిలిచిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఐకానిక్ కోర్టు భారత క్రీడా దిగ్గజం సానియా మీర్జా వీడ్కోలుకు వేదికైంది.
ఆమె దారి రహదారి
భారత్‌లో మహిళలు క్రీడల్లో రాణించాలంటే, తొలుత కుటుంబం, ఆ తర్వాత సమాజం.. ఆ తర్వాతే ప్రత్యర్థులతో పోటీ పడాలి. క్లిష్టమైన సవాళ్ల నడుమ ఆ పని చేసింది సానియా మీర్జా. మధ్యతరగతి ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన సానియా మీర్జా ప్రస్థానం పూల బాట కాదు. టెన్నిస్ కోర్టులో రాకెట్ పట్టడానికి ముందే ఓ యుద్ధం చేసిన సానియా మీర్జా.. సుదీర్ఘ కెరీర్లో ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఎంసీ మేరీకోమ్, సైనా నెహ్వాల్, పి.వి సింధుల కంటే ముందుగానే భారత క్రీడా రంగ ముఖచిత్రంగా, ప్రత్యేకించి మహిళా అథ్లెట్లకు సూపర్‌స్టార్‌గా నిలిచింది సానియా మీర్జా. సంప్రదాయాలు, కట్టుబాట్లను దాటుకుంటూ సరికొత్త పంథాలో నడిచిన సానియా మీర్జా.. భారత క్రీడా రంగంలో మహిళా అథ్లెట్లకు దారి చూపిన బాటసారి. భారత్‌కు అసమాన విజయాలు సాధించినా, ఆమె దేశభక్తి ప్రశ్నార్థకమైంది. పాకిస్థాన్ క్రికెటర్‌తో వివాహంతో వ్యక్తిగత జీవితంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా, సానియా మీర్జా అధైర్యపడలేదు. ఎంచుకున్న మార్గంలో విజయవం తమైన సానియా మీర్జా.. తనెంటో సాధించిన ఘనతలు, రికార్డులతోనే విమర్శలకు సరైన సమాధానం ఇచ్చింది. షోయబ్ మాలిక్‌తో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా.. ఎవరూ ఊహించని విధంగా టెన్నిస్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. తనయుడితోనే నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో పోటీపడిన సానియా మీర్జా.. ఈ ఏడాది కుమారుడు కండ్ల ముందు గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరులో తలపడింది. ఆ భావోద్వేగం సానియా మీర్జాలో స్పష్టంగా కనిపించింది.
టెన్నిస్ ముఖచిత్రం
భారత టెన్నిస్ ముఖచిత్రం సానియా మీర్జా. కెరీర్ తొలినాళ్లలోనే సంచలన విజయాలు సాధించిన సానియా మీర్జా.. అటు సింగిల్స్, ఇటు డబుల్స్ విభా గాల్లో తనదైన ముద్ర వేసింది. సొంతగడ్డ హైదరా బాద్‌లో తొలిసారి (2005) డబ్ల్యూటీఏ టైటిల్ సాధించిన సానియా మీర్జా.. అదే ఏడాది యుఎస్ ఓపెన్‌లో నాల్గో రౌండ్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. రమేశ్ కృష్ణన్ (1987) తర్వాత మరో భారత టెన్నిస్ ప్లేయర్ న్యూయార్క్‌లో రెండో వారం రాకెట్ పట్టలేదు. గ్రాండ్‌స్లామ్ నాల్గో రౌండ్‌కు చేరిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా సానియా నిలిచింది. 2005 మెల్బోర్న్లో ప్రపంచ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌తో ముఖాముఖి పోరు సానియా మీర్జా కెరీర్లో హైలైట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్ అనంతరం సానియా ఈ విషయం వెల్లడించింది. 'నా వరకు మెల్బోర్న్లో 18 ఏండ్ల వయసులో సెరెనా విలియమ్స్‌తో ఆడిన మ్యాచ్ అత్యంత ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో నేను 1-6, 4-6తో ఓటమి చెందినా.. నాలో దృడమైన ఆత్మవిశ్వాసం నింపిన సమరం అది. ఓ సాధారణ భారతీయ అమ్మాయిగా నాపై నాకు విశ్వాసం కలిగించిన మ్యాచ్ అది' అని సానియా తెలిపింది.
అసమాన విజయాలు
భారత టెన్నిస్‌లో సానియా మీర్జా ఇప్పటికీ టాప్ క్రీడాకారిణి. డబ్య్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో (2017) నం.27గా నిలిచింది సానియా. సింగిల్స్‌కు దూరమైన పదేండ్లలో సైతం సానియా రికార్డు చెక్కుచెదరలేదు. ఇక మహిళల డబుల్స్ సర్క్యూట్లో సానియా మీర్జా ప్రపంచంలోనే మేటీ అథ్లెట్లలో ఒకరుగా నిలిచింది. ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన సానియా మీర్జా.. డబుల్స్ విభాగంలో 43 టూర్ టైటిళ్లు సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ నం.1 ఏకధాటిగా 91 వారాల పాటు కొనసాగింది. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, పరిస్థితులను పట్టించుకోకుండా ఎంచుకున్న మార్గంలో నడిచిన సానియా మీర్జా.. కెరీర్‌ను ముగించటంలోనూ అదే స్టయిల్ చూపించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ రన్నరప్ టైటిల్‌తో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ఘనంగా ముగించింది. వచ్చే నెల దుబారులో డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌తో సానియా మీర్జా అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకనుంది.
రన్నరప్ సానియా జోడీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్బోర్న్ : భారత టెన్నిస్ దిగ్గజం, మహిళల డబుల్స్ మాజీ వరల్డ్ నం.1 సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది. భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న జంటగా మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌పై కన్నేసిన సానియా మీర్జా.. శుక్రవారం ఉదయం జరిగిన ఫైనల్లో వరుస సెట్లలో పోరాడి ఓడింది. బ్రెజిల్ జంట స్టెఫాని, రఫేల్ మాటోస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 6-7(2-7), 2-6తో సానియా, బోపన్నలు ఫైనల్లో పోరాడి ఓడారు. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన సానియా, బోపన్నలు రెండో సెట్లో అంచనాలను అందుకోలేదు. 4 ఏస్‌లు, 2 బ్రేక్ పాయింట్లు సాధించిన సానియా, బోపన్నలు టైటిల్ ముంగిట నిరాశపరిచారు.