Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి
నవతెలంగాణ, హైదరాబాద్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు అవమానం పరిపూర్ణం. ఎలైట్ గ్రూప్-బిలో ఏడు మ్యాచుల్లో ఏకంగా ఆరు పరాజయాలు మూటగట్టుకున్న హైదరాబాద్ అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. చివరి రౌండ్ మ్యాచ్లో ఢిల్లీ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైన హైదరాబాద్ ఆరో ఓటమితో పరిపూర్ణ అవమానికి గురైంది. ఎలైట్ గ్రూప్-బిలో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. రెండో ఇన్నింగ్స్లో 124 పరుగులకు కుప్పకూలిన హైదరాబాద్.. ఢిల్లీకి 47 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని ఓ వికెట్ కోల్పోయి 8.4 ఓవర్లలోనే ఛేదించింది ఢిల్లీ జట్టు. తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ మెరిసినా.. బౌలర్ల వైఫల్యంతో ఢిల్లీని కట్టడి చేయలేకపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఢిల్లీ బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ విలవిల్లాడింది. తొలి మ్యాచ్లో తమిళనాడు చేతిలో వెలుతురు లేమితో ఓటమి నుంచి గట్టెక్కిన హైదరాబాద్.. ఆ తర్వాత వరుసగా పరాజయాలు చవిచూసింది.