Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడావిభాగం:ఇటీవల కాలంలో బాధ, నిరుత్సాహమే ప్రేరణగా విజయాలు సాధించిన ఆటగాడిగా నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మినహా మరొకరు లేరు. సరిగ్గా ఏడాది క్రితం, ఆస్ట్రేలియాలో నొవాక్ జకోవిచ్‌కు దారుణ భంగపాటు ఎదురైంది. మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టిన జకోవిచ్‌ను ఆసీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోలేదనే కారణంతో ప్రపంచ స్టార్ స్పోర్ట్స్‌మన్‌ను క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. రాకెట్ పట్టకుండానే నిరుడు ఆస్ట్రేలియాను విడిచివెళ్లిన నొవాక్ జకోవిచ్.. గత చేదు జ్ఞాపకాలు చెరిగిపోయేలా ఆదివారం అదరగొట్టే ప్రదర్శన చేశాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో గ్రీసు కుర్రాడు స్టెఫానోస్ సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఓడించాడు. రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను పదోసారి ముద్దాడాడు. ఓపెన్ శకంలో నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్ల ఘనత ఓ రికార్డు.
2022లో జకోవిచ్‌ను రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడనివ్వలేదు. నాలుగు ఏటీపీ మాస్టర్స్ టోర్నీల్లో బరిలోకి దిగనివ్వలేదు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ విజయం సాధించినా, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఆ పాయింట్లను జత చేయలేదు. అయినా, 2022 ఏడాదిని జకోవిచ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో నిలిచాడు. తొలుత ఆడిలైడ్‌లో, ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో ఎదురులేని విజయాలు నమోదు చేసిన సెర్బియా యోధుడు ప్రపంచ నం.1 ర్యాంక్ తిరిగి సొంతం చేసుకున్నాడు. 36 ఏండ్ల జకోవిచ్ వయసుకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నాడు. టెన్నిస్ కోర్టులో పాతికేళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ ఫిట్‌నెస్ పరంగా సైతం ఓటమికి గురి చేస్తున్నాడు. అటు ఆట పరంగా, ఇటు ఫిట్‌నెస్ పరంగా నొవాక్ జకోవిచ్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు.
టెన్నిస్ ఓపెన్ శకంలో ఆల్‌టైమ్ గ్రేట్ ఎవరనే చర్చ నిరంతరంగా సాగుతూనే ఉంది. ఈ చర్చ తెరపైకి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త అంశం జతకూడుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను రికార్డు స్థాయిలో 10వ సారి సొంతం చేసుకున్న జకోవిచ్.. గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యను 22కు పెంచాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో సమవుజ్జీగా నిలిచాడు. స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్ వీడ్కోలుతో టైటిళ్ల పరంగా అతడు రేసును ముగించాడు. కానీ గాయాలతో కెరీర్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడినా.. ఊహకందని రీతిలో కండ్లుచెదిరే ఫిట్‌నెస్‌తో దూసుకొచ్చారు రఫెల్ నాదల్, జకోవిచ్. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ విజయంతో జకోవిచ్ టైటిళ్ల పరంగా నాదల్ సరసన నిలిచాడు. ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ ముగిసేలోపు గ్రాండ్‌స్లామ్ రేసులో విజేత ఎవరనే సంగతి తేలిపోనుంది. పారిస్‌లో మట్టికోర్టును స్పెయిన్ బుల్‌కు వదిలేసినా.. వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో జకోవిచ్ దూకుడు ముందు నిలిచేదెవరు?!