Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాక్‌కు గురిచేసిన లక్నో పిచ్
- హార్దిక్, గంభీర్, నీషమ్ విమర్శలు
పొట్టి ఫార్మాట్ అనగానే ఫోర్లు, సిక్సర్ల జాతర. ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం అదే అంచనా వేసి, ఆశించి మైదానంలోకి అడుగుపెడతారు. కానీ లక్నో పిచ్ అటు క్రికెటర్లకు, ఇటు అభిమానులకు ఊహించని షాకింగ్ అనుభవం మిగిల్చింది. స్పిన్ స్వర్గధామం ది ఏక్నా స్టేడియంలో 40 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు. లక్నో పిచ్‌పై హార్దిక్ పాండ్య, గౌతం గంభీర్, జేమ్స్ నీషమ్ విమర్శలు గుప్పించారు!.
నవతెలంగాణ క్రీడావిభాగం
షాక్‌కు గురి చేసింది
'ఈ పిచ్ షాకింగ్‌కు గురిచేసింది'.. భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌కు వేదికైన 'ది ఎక్నా స్టేడియం' పిచ్‌పై టీమ్ ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందన ఇది. నిజాయితీగా చెబుతున్నా, ఈ పిచ్ ఎంతో షాక్‌కు గురిచేసింది. రెండు మ్యాచులు.. సవాల్‌తో కూడిన పిచ్‌లు ఎదురయ్యాయి. కఠినతర పిచ్‌లపై ఆడటాన్ని స్వాగతిస్తాను. కానీ, ఈ పిచ్‌లు టీ20 క్రికెట్ కోసం తయారు చేసినవి కావు. అది పక్కనపెడితే, భారత్ విజయం సాధించటంతో సంతోషంగా ఉన్నానని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు. రాంచి తొలి టీ20లో బ్యాట్‌కు, బంతికి సరసమైన పోటీ కనిపించింది. రాంచిలో సైతం బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన పిచ్‌నే సిద్ధం చేశారు. కానీ లక్నోలో ఇది ఎవరూ ఊహించలేదు. ఇక్కడ స్పిన్నర్లు రాజ్యమేలారు. మ్యాచ్‌లో 40 ఓవర్లలో ఏకంగా 30 ఓవర్లను స్పిన్నర్లు సంధించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు. ఇది మరో రికార్డు అని చెప్పాలి.
స్పిన్నర్ల కోసం వేట
భారత స్పిన్నర్లను కాచుకుని 99 పరుగులు చేసిన న్యూజిలాండ్.. హార్దిక్‌సేన 100 చేరుకోకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకుంది. కివీస్ కెప్టెన్, స్నిన్నర్ మిచెల్ శాంట్నర్ సహచరుల్లో స్పిన్నర్‌ను అన్వేషించాడు. పేసర్ లాకీ ఫెర్గుసన్‌ను సైతం స్పిన్ వేయగలవా? అని శాంట్నర్ అడుగటం పరిస్థితికి అద్దం పడుతుంది. వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్ ఏకంగా పార్ట్ టైమ్ స్పిన్నర్ అవతారం ఎత్తాడు. నాలుగు ఓవర్లు విజయవంతంగా సంధించాడు. 'లక్ష్యాన్ని కాపాడుకునేందుకు మా ప్రయత్నం మంచిగా అనిపించింది. ఇంకో 10-15 పరుగులు అధికంగా చేసివుంటే, ఫలితంలో వ్యత్యాసం కనిపించేది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తెలివైన బ్యాటింగ్ ఇరు జట్ల నడుమ వ్యత్యాసంగా నిలిచింది. నేను జట్టులో ప్రతి చోట స్పిన్నర్‌ను వెతికే పనిలో పడ్డాను. ఆఫ్ స్పిన్ వేయగలవా అని లాకీ ఫెర్గుసన్‌ను సైతం అడిగాను. మ్యాచ్‌లో 12 ఓవర్లకు మించి స్పిన్ వేయటం అరుదు. ఈ ఇన్నింగ్స్‌లో 16-17 ఓవర్లు స్పిన్ వేశాం. ఇది కచ్చితంగా భిన్నమైన అనుభవమని' మిచెల్ శాంట్నర్ అన్నాడు.
ఇదీ ఓ అవమానమే!?
రెండు నాణ్యమైన జట్లు తలపడుతున్నాయి. చూసేందుకు విశేష సంఖ్యలో అభిమానులు వచ్చారు. క్రికెట్ మ్యాచ్‌తో వినోదం ఆశించారు. కానీ పిచ్ కారణంగా అది లభించలేదు. ఇదీ ఓ విధమైన అవమానమేనని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ అభిప్రాయపడ్డాడు. భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌తో కలిసి స్టార్‌స్పోర్స్‌లో నీషమ్ లక్నో పిచ్‌పై అభిప్రాయం పంచుకున్నాడు. ' పిచ్ నుంచి కివీస్ బ్యాటర్లు ఆశించినది అందుకున్నారని అనుకోను. గౌతం గంభీర్ చెప్పినట్టు.. ఇది నాసిరకం పిచ్. రెండు వైపులా ఎవరూ మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. రెండు జట్ల నుంచి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. గణనీయ సంఖ్యలో మ్యాచ్‌ను చూసి వినోదించేందుకు అభిమానులు స్టేడియానికి వచ్చినప్పుడు ఇలా జరిగితే.. అది కాస్త అవమానంగానే భావించాలి. కానీ ఇది స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌గా మారటం కాస్త ఊరట కలిగించింది' అని జేమ్స్ నీషమ్ అన్నాడు.
అతడినే అడగాలి
లక్నో పిచ్‌పై ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడిన భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రె.. పిచ్ ఎందుకు అలా స్పందించిందనే అంశాన్ని క్యూరేటర్‌నే అడిగి తెలుసుకోవాలని అన్నాడు. ' తొలుత పిచ్‌ను చూడగానే ఏమాత్రం తడి లేకుండా కనిపించింది. పిచ్ నడుమ కాస్త పచ్చిక ఉండగా, వికెట్‌కు రెండు వైపులా ఏమాత్రం పచ్చిక లేదు. బంతి తిరుగుతూ, బ్యాటర్లకు సవాల్ విసురుతుందని భావించాం. పిచ్ మరీ అలా ఎలా స్పందించింది అనే విషయం తెలియాలంటే.. కచ్చితంగా పిచ్ క్యూరే టర్‌నే అడగాలి. ఈ పిచ్‌పై భారత్ 100 పరుగులు ఛేదించి గెలుపొందటం సంతోషం. కివీస్ 120-130 పరుగులు చేసివుంటే.. ఛేదనలో భారత్ మరింత కష్టాలు ఎదుర్కొనేది. భారత స్పిన్నర్లు కివీస్‌ను 99 పరుగులకు కట్టడి చేయటం మంచిదైంది' అని పరాస్ తెలిపాడు.
కొత్తదనం లోపిప్తే ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అలాగని, ఆ కొత్తదనం వెగటు పుట్టించేలా ఉండకూడదు. భారత్, కివీస్ టీ20 మ్యాచ్‌కు లక్నో పిచ్ ఆ కోవలోకే వస్తుంది. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్లు అభిమానులను అలరిస్తాయి. భారీ స్కోర్లు చూసిన అభిమానులు.. బ్యాటర్లకు బౌలర్లు చుక్కలు చూపించడాన్ని సైతం ఆస్వాదిస్తారు. కానీ, లక్నో పిచ్‌లో బౌలర్లు మెరిసినా అది వినోదభరితంగా లేదు. టెస్టు మ్యాచ్ ఆఖరు రోజు చివరి సెషన్ తరహాలో సాగిన టీ20 ఇన్నింగ్స్ ఎవరు ఆస్వాదిస్తారు?!.