Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు వారాలు, రెండు వైట్‌బాల్ సిరీస్‌లు, ఆరు మ్యాచులు. ఆరు మ్యాచుల కోసం భారత్, న్యూజిలాండ్ దేశాన్ని చుట్టేశాయి. రెండు జట్లు సబర్మతి తీరంలో నేడు చివరి మజిలీకి సిద్ధమయ్యాయి. భారత గడ్డపై చారిత్రక తొలి సిరీస్ విజయం వేటలో న్యూజిలాండ్ దూకుడు చూపిస్తుండగా.. స్వదేశంలో సిరీస్‌ను పట్టేందుకు టీమ్ ఇండియా రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. చిట్టి సిరీస్ వేటలో భారత్, న్యూజిలాండ్ నిర్ణయాత్మక ధనాధన్ నేడు.
- అరుదైన విజయంపై కివీస్ గురి
- సత్తా చూపేందుకు పాండ్యసేన సిద్ధం
- భారత్, కివీస్ మూడో టీ20 నేడు రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-అహ్మదాబాద్
2012లో ఏకైక టీ20 మ్యాచ్‌తో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్.. నిజానికి భారత గడ్డపై ఏ ఫార్మాట్‌లోనూ సిరీస్ విజయం సాధించలేదు. గతంలో వరుసగా రెండు సార్లు వన్డే సిరీస్‌లను నిర్ణయాత్మక మ్యాచ్ వరకు తీసుకెళ్లిన కివీస్.. ఆఖరు అడుగులో తడబడింది. తాజాగా, మూడు మ్యాచుల సిరీస్ నిర్ణయాత్మక పోరుకు చేరుకుంది. భారత గడ్డపై సిరీస్ విజయం సాధించే సువర్ణావకాశం మరోసారి న్యూజిలాండ్ ముంగిట నిలిచింది. తెలివైన నాయకుడు మిచెల్ శాంట్నర్ సారథ్యంలో న్యూజిలాండ్ చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతోంది. మరోవైపు హార్దిక్ పాండ్య నాయకత్వంలో భారత్ మరో సిరీస్‌పై గురిపెట్టింది. గత పదేండ్లలో స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్ విజయాల్లో టీమ్ ఇండియాది ఓ ప్రత్యేక చరిత్ర. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మినహా మరో జట్టు భారత్‌లో భారత్‌పై విజయం సాధించలేదు. సిరీస్ వేటలో ఇరు జట్లు దూకుడు చూపించేందుకు సై అంటున్నాయి. భారత్, న్యూజిలాండ్ నిర్ణయాత్మక టీ20 పోరు నేడు.
టాప్ మెరవాలి
బంగ్లాదేశ్‌పై వన్డేలో ఇషాన్ కిషన్ 210 పరుగుల ద్వి శతకం సాధించాడు. ఆ తర్వాత అతడు ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లో ద్వి శతక మెరుపులో సగం పరుగులైనా సాధించలేదు. యువ ఓపెనర్‌కు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు జట్టు మేనేజ్‌మెంట్ సిద్ధంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, వికెట్ కీపర్‌గా అదనపు బాధ్యతలు ఇషాన్ కిషన్‌ను తుది జట్టులో నిలుపుతాయి. కానీ బ్యాట్‌తో నిలకడగా రాణించకపోతే కిషన్ మరోసారి బెంచ్‌కు పరిమితం కాకతప్పదు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ నుంచి జట్టు మేనేజ్‌మెంట్ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వన్డే ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. రెండు టీ20ల్లోనూ నిరాశపరిచాడు. ఐపీఎల్ సొంత గడ్డ అహ్మదాబాద్‌లో గిల్ మెప్పిస్తాడేమో చూడాలి. రాహుల్ త్రిపాఠి సత్తా ఉన్న బ్యాటర్. కానీ నిలకడ అత్యంత కీలకం. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఫామ్‌లో ఉన్నారు. టాప్ ఆర్డర్‌లో కిషన్, గిల్, త్రిపాఠి తొలి పది ఓవర్లలో తడఖా చూపిస్తే.. చివరి పది ఓవర్ల కథ సూర్య, పాండ్య నడిపించగలరు. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్‌లో మణికట్టు మాయగాడు చాహల్ స్థానంలో స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చే వీలుంది. వికెట్ల పరంగా ఫర్వాలేదనుకున్నా, ఎకానమీ పరంగా మాలిక్ నిరూపించుకోవాల్సి ఉంది. శివం మావి, అర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు చూసుకోనున్నారు. కుల్దీప్, వాషింగ్టన్‌తో పాటు దీపక్ హుడా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
చరిత్ర సృష్టిస్తారా?
కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ.. ఈ ముగ్గురు లేని న్యూజిలాండ్ జట్టును ఊహించలేం. కానీ కీలక ఆటగాళ్లు లేకుండానే భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ పాలైనా.. టీ20 సిరీస్‌లో చరిత్రకు చేరువగా వచ్చింది. మిచెల్ శాంట్నర్ విలక్షణ ఆలోచన, నాయకత్వం కివీస్‌కు కలిసొచ్చింది. ధనాధన్ ఫార్మాట్‌లో బ్యాటర్లు, బౌలర్లు అంచనాల మేరకు రాణిస్తున్నారు. టాప్ ఆర్డర్‌లో డెవాన్ కాన్వే కివీస్‌కు అత్యంత కీలకం. సగటు, స్ట్రయిక్‌రేట్ పరంగా డెవాన్ కాన్వే అత్యంత విలువైన ఆటగాడు. ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్ నుంచి సహకారం లభిస్తే కివీస్ టాప్ ఆర్డర్ విశ్వరూపం చూపించగలదు. మిడిల్ ఆర్డర్‌లో డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రాస్‌వెల్ జోరుమీదున్నారు. స్పిన్నర్లు ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్ బారత్‌ను మాయ చేస్తున్నారు. ఇశ్ సోధి గత రెండేండ్లలో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. రానున్న వన్డే వరల్డ్‌కప్ ముంగిట పరిస్థితులపై అవగాహన, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవటమే లక్ష్యంగా బరిలో నిలిచిన న్యూజిలాండ్‌కు ఓటమి భయం లేదు. చరిత్ర ముంగిట భయమెరుగని క్రికెట్‌తో న్యూజిలాండ్ రికార్డులు బద్దలు కొడుతుందేమో చూడాలి.
పిచ్, వాతావరణం
అహ్మదాబాద్ నరెంద్ర మోడి స్టేడియం సహజంగానే భారీ స్కోర్ల పిచ్. పొట్టి ఫార్మాట్‌లో ఇక్కడ పరుగుల వరద పారుతుంది. ఇక్కడ జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో ఏకంగా మూడు మ్యాచుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 160 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. చివరి టీ20 మ్యాచ్‌కు వాతావరణం అను కూలించనుంది. బుధ వారం ఇక్కడ ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, మిచెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఇశ్ సోధి, లాకీ ఫెర్గుసన్, జాకబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్‌నర్.
అండర్-19 విజేతలకు సత్కారం
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ నేడు ఘనంగా సత్కరించనుంది. భారత్, కివీస్ మూడో టీ20కి ముందు అహ్మదాబాద్ స్టేడియంలో అండర్-19 అమ్మాయిలను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్లు సన్మానించనున్నారు. భారత మహిళల జట్టు ఓ ఐసీసీ ట్రోఫీ సాధించటం ఇదే కావటంతో భారత మహిళా క్రికెట్‌లో అండర్-19 టీ20 ప్రపంచకప్ ఓ చరిత్రగా నిలిచిపోనుంది. విశ్వవిజేతలు షెఫాలీ వర్మసేనకు రూ. 5 కోట్ల నగదు బహుమానం సైతం నేడు అందజేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.