Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడో టి20లో న్యూజిలాండ్‌పై 168పరుగుల తేడాతో రికార్డు గెలుపు
సిరీస్ 2-1తో కైవసం
అహ్మదాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, చివరి టి20లో టీమిండియా 168 పరుగుల తేడాతో గెలిచి రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్లో భారత్ ఇన్ని పరుగుల తేడాతో గెలుపొందడం ఇదే ప్రథమం. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 234పరుగుల భారీస్కోర్‌ను చేసింది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్(126నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 12.1 ఓవర్లలో కేవలం 66 పరుగులకే కుప్పకూలింది.
తొలుత టీమిండియా ఇన్నింగ్స్‌ను ఇషాన్ కిషన్, గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే కేవలం మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీగా పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత త్రిపాఠి-శుభ్‌మన్ కలిసి న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఓవైపు రాహుల్ త్రిపాఠి(44; 3సిక్సర్లు, 4ఫోర్లు) చెలరేగి ఆడగా.. మరో ఎండ్‌లో శుభ్‌మన్ బంతిని బౌండరీ లైన్‌కు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. శుభ్‌మన్ కేవలం 63 బంతుల్లో 12ఫోర్లు, 7సిక్సర్లతో 126పరుగులు చేశాడు. అలాగే టి20 కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(24; ఫోర్, 2సిక్సర్లు)కి తోడు హార్దిక్ పాండ్యా(30; సిక్సర్, 4ఫోర్లు) బ్యాటింగ్‌లో రాణించారు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, టిక్నర్, సోధి, మిచెల్ చెరో వికెట్ దక్కాయి.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 7పరుగులకే 4వికెట్లు కోల్పోయి తొలుతే ఓటమిని అంగీకరించింది. మిఛెల్(35), సాంట్నర్(13) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మిగతా బ్యాటర్స్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 12.1 ఓవర్లలో 66పరుగులకే కుప్పకూలింది. హార్దిక్‌కు నాలుగు, శివమ్ మావి, ఆర్ష్‌దీప్, ఉమ్రన్ మాలిక్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శుభ్‌మన్‌కు, సిరీస్ హార్దిక్ పాండ్యాకు లభించాయి. దీంతో మూడు టి20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో చేజిక్కించుకుంది.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (ఎల్బి)బ్రాస్‌వెల్ 1, శుభ్‌మన్ (నాటౌట్) 126, త్రిపాఠి (సి)ఫెర్గుసన్ (బి)ఇష్ సోథీ 44, సూర్యకుమార్ (సి)బ్రాస్‌వెల్ (బి)టిక్నెర్ 24, హార్దిక్ (సి)బ్రాస్‌వెల్ (బి)మిఛెల్ 30, దీపక్ హుడా (నాటౌట్) 2, అదనం 7. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 234పరుగులు. వికెట్ల పతనం: 1/7, 2/87, 3/125, 4/228 బౌలింగ్: లిస్టర్ 4-0-42-0, బ్రాస్‌వెల్ 1-0-8-1, ఫెర్గుసన్ 4-0-54-0, టిక్నెర్ 3-0-50-1, ఇష్ సోథీ 3-0-34-1, సాంట్నర్ 4-0-37-0, మిఛెల్ 1-0-6-1,
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి)సూర్యకుమార్ (బి)హార్దిక్ 3, కాన్వే (సి)హార్దిక్ (బి)ఆర్ష్‌దీప్ 1, ఛాప్మన్ (సి)ఇషాన్ (బి)ఆర్ష్‌దీప్ 0, ఫిలిప్స్ (సి)సూర్యకుమార్ (బి)హార్దిక్ 2, మిఛెల్ (సి)శివమ్ మావి (బి)ఉమ్రన్ మాలిక్ 35, బ్రాస్‌వెల్ (బి)ఉమ్రన్ మాలిక్ 8, సాంట్నర్ (సి)సూర్యకుమార్ (బి)శివమ్ మావి 13, ఇష్ సోథీ (సి)త్రిపాఠి (బి)శివమ్ మావి 0, ఫెర్గుసన్ (సి)ఉమ్రన్ మాలిక్ (బి)హార్దిక్ 0, టిక్నెర్ (సి)ఇషాన్ (బి)హార్దిక్ 1, లిస్టెర్ (నాటౌట్) 0, అదనం 3. (12.1 ఓవర్లలో ఆలౌట్) 66పరుగులు. వికెట్ల పతనం: 1/4, 2/4, 3/5, 4/7, 5/21, 6/53, 7/53, 8/54, 9/66 బౌలింగ్ : హార్దిక్ 4-0-16-4, ఆర్ష్‌దీప్ 3-0-16-2, ఉమ్రన్ మాలిక్ 2.1-0-9-2, కుల్దీప్ యాదవ్ 1-0-12-0, శివమ్ మావి 2-0-12-2.