Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. భారత్, ఆస్ట్రేలియా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే టెస్టు సమరం. గత రెండేండ్లలో వరుసగా ఆసీస్ గడ్డపై కంగారూ జట్టును ఓడించిన టీమ్ ఇండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఏడాది టెస్టుల్లో గొప్ప ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా అదే జోరులో భారత్‌పై విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని స్వదేశం తీసుకెళ్లాలని భావిస్తోంది. అందుకోసం, ఆస్ట్రేలియా జట్టు కఠోర తపస్సు చేస్తుంది.
- స్పిన్ పిచ్‌లపై ఆసీస్ సాధన
- మ్యాచ్ పరిస్థితుల్లో కఠోర శ్రమ
నవతెలంగాణ క్రీడావిభాగం
స్పిన్ పిచ్‌లపై ఆసీస్ సాధన
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కొంత కాలంగా భారత్ ఆధిపత్యం నడుస్తుంది. స్వదేశంలో సహజంగానే ఓటమెరుగని టీమ్ ఇండియా.. గత రెండేండ్లలో అద్వితీయ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాలో వరుస పర్యటనల్లో టెస్టు సిరీస్ విజయం సాధించింది. స్వదేశంలో భారత్ చేతిలో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌ను చేజార్చుకోవటం కంగారూ జట్టును కలవరానికి గురి చేసింది. ఆసీస్ అడ్డా గబ్బా (బ్రిస్బేన్) స్టేడియంలో సైతం భారత్ చారిత్రక విజయం సాధించి ఆస్ట్రేలియా అహం దెబ్బతినేలా చేసింది. భారత్‌కు ప్రతీకార బహుమతి అందించేందుకు ఆస్ట్రేలియా పకడ్బందిగా సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్లు వారం రోజుల పాటు సిడ్నీలో ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. నాగ్‌పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, ధర్మశాలలో ఎదురయ్యే పిచ్‌లను సిడ్నీలో సిద్ధం చేశారు. ఆ పిచ్‌లపై ఆసీస్ క్రికెటర్లు సాధన చేశారు. టెస్టు మ్యాచ్‌లో నాలుగు, ఐదో రోజు భారత్‌లో పిచ్ ఎలా ఉంటుందో సరిగ్గా అటువంటి పిచ్‌పై కంగారూ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పిచ్‌లపై సాధనతో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు చేరుకుంది.
వార్మప్ వద్దు
విదేశీ పర్యటనల్లో, ప్రత్యేకించి టెస్టు సిరీస్ ముంగిట స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు వార్మప్, టూర్ మ్యాచులు ఆడటం సంప్రదాయంగా వస్తుంది. అయితే, ఆస్ట్రేలియా ఈ సారి వార్మప్ మ్యాచ్ అవసరం లేదని చెప్పేసింది. గత పర్యటనలో వార్మప్ మ్యాచ్‌లో పచ్చిక పిచ్‌ను అందించారు. మ్యాచ్ పరిస్థితులకు ఆ పిచ్ పూర్తి భిన్నం. వార్మప్‌లో ఆ పిచ్‌పై నాలుగు రోజుల ఆట వృథా. దీంతో ఆస్ట్రేలియా ఈసారి పర్యటనలో వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉంది. అందుకు బదులుగా, బెంగళూర్‌లో నాలుగు రోజుల పాటు సెంటర్ పిచ్‌పై సాధన చేసేందుకు మొగ్గుచూపింది. బెంగళూర్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇక్కడ స్పిన్ ట్రాక్‌లపై సాధన చేయనున్నారు. ప్రధాన పిచ్‌పై మ్యాచ్ పరిస్థితులను తలపించేలా ఆసీస్ జట్టు సాధన చేయనుంది. ఫిబ్రవరి 9న తొలి టెస్టు కాగా.. ఓ రోజు ముందు నాగ్‌పూర్‌కు చేరుకోనుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం బెంగళూర్ చిన్నస్వామి స్టేడియం అన్ని ఏర్పాట్లు చేశారు.
స్పిన్ దాడి వ్యూహం
భారత్‌లో భారత్‌పై నెగ్గాలంటే స్పిన్‌పై బాగా ఆడితే చాలదు, స్పిన్‌తో భారత్‌ను సైతం దెబ్బకొట్టాలి. దీంతో ఆస్ట్రేలియా ఆ దిశగా తుది జట్టు రూపకల్పనకు ముందుగానే ప్రణాళికలు తయారు చేసింది. సీనియర్ స్పిన్నర్ నాథన్ లయాన్ (ఆఫ్ స్పిన్), మిచెల్ స్విప్సన్ (లెగ్ స్పిన్)లకు తోడు యువ స్పిన్నర్లను రంగంలోకి దింపింది. 22 ఏండ్ల టాడ్ మర్ఫీ (ఆఫ్ స్పిన్), అష్టన్ ఆగర్ (లెఫ్మార్మ్ స్పిన్)లకు సైతం జట్టులో చోటు కల్పించింది. ఇటీవల కాలంలో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారాలు స్పిన్ బౌలింగ్‌పై ఇబ్బందులు పడుతున్నారు. ఈ బలహీనతను వంద శాతం సద్వినియోగం చేసుకోవటంపై ఆసీస్ దృష్టి సారించింది. జీవం లేని పిచ్‌లపై స్పిన్నర్లతోనే వికెట్ల వేటకు రంగం సిద్ధం చేస్తుంది.
ఇదిలా ఉండగా, వీసా కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో పాటు భారత్‌కు రాలేకపోయిన ఉస్మాన్ ఖవాజా గురువారం బెంగళూర్‌కు బయల్దేరాడు. ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) వార్షిక అవార్డుల వేడుక నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు రెండు బృందాలుగా భారత్‌కు చేరుకున్నారు. వీసా ఆలస్యం కావటంతో ఉస్మాన్ ఖవాజా గురువారం అక్కడ్నుంచి బయల్దేరాడు. పాకిస్థాన్‌లో పుట్టిన ఉస్మాన్ ఖవాజా ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడు. గతంలో ఖవాజాకు భారత వీసా ఆలస్యమైన సంఘటనలు ఉన్నాయి.