Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య
అహ్మదాబాద్ : స్వదేశంలో వరుసగా 25 ద్వైపాక్షిక సిరీస్‌లు (టెస్టు, వన్డే, టీ20) సాధించిన ఏకైక జట్టుగా టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్ 168 పరుగుల రికార్డు విజయంతో సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్‌లో 50వ విజయం సైతం భారత్ ఖాతాలో వేసుకుంది. రికార్డులు బ్రేక్ చేసిన విజయానంతరం భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా హార్దిక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' నేను అనుకుంటే మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా సిక్సర్ కొట్టగలను' ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ఆరేండ్ల కిందట హార్దిక్ పాండ్య మాట ఇది. నాయకుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత హార్దిక్ పాండ్య కాస్త దూకుడు తగ్గాడు. జట్టు కోసం ఓ అడుగు వెనక్కి వేసేందుకు సిద్ధమేనని ప్రకటించాడు. స్ట్రయిక్‌రొటేట్ చేస్తూ ఎం.ఎస్ ధోని తరహాలో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు.
అది ఇష్టమైనా..!
'నిజాయితీగా చెబుతున్నాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం. కానీ నేను ఎదగాల్సి ఉంది, అదే జీవితం. భాగస్వామ్యాలు నిర్మించటంలో భాగస్వామ్యం కావాలి. జట్టు సభ్యులకు, ఆవల ఎండ్‌లో ఉన్న ఆటగాడికి కాసింత ప్రశాంతత, దీమా అందించాలని అనుకుంటున్నాను. టీ20 ఫార్మాట్‌లో నాకు మంచి అనుభవం ఉంది. ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలి, ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంలో ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉన్నాను. ఈ క్రమంలో నా స్ట్రయిక్‌రేట్‌ను తగ్గించుకోవాల్సి ఉంది. సరికొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు తీసుకోవాలి. జట్టుకు ఎం.ఎస్ ధోని పోషించిన పాత్రను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నిజానికి, ఆ లక్షణం నాకు సహజసిద్ధంగా వచ్చింది. మహి ఉండగా నేను కుర్ర క్రికెటర్‌ను. మైదానం నలుమూలలా బౌండరీలు బాదేవాడిని. కానీ మహి నిష్క్ర మణతో ఆ బాధ్యత నాకు వచ్చింది. అందుకు నాకు ఇబ్బంది లేదు. మేం అనుకున్న ఫలితాలు సాధిస్తున్నామని' హార్దిక్ పాండ్య అన్నాడు.
సరైన సమయంలో..
2019లో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్ పాండ్య ఆ తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్‌లో కనిపించలేదు. చివరగా 2018 సౌతాంప్టన్ టెస్టులో ఆడాడు. రంజీ ట్రోఫీలో సైతం 2018లోనే చివరగా మెరిశాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం వైట్‌బాల్ క్రికెట్‌కే పరిమితయ్యాడు. సరైన సమయంలో రెడ్ బాల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇస్తానని పాండ్య అన్నాడు. ' సరైన సమయం అనిపించినప్పుడు టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాను. ప్రస్తుతం నా ఫోకస్ వైట్‌బాల్ ఫార్మాట్‌పైనే ఉంది. సరైన సమయం వచ్చి, శరీరం సహకరిస్తే టెస్టు క్రికెట్‌లో మళ్లీ ఓ ప్రయత్నం చేస్తానను' అని పాండ్య తెలిపాడు. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 ప్రపంచకప్ దిశగా హార్దిక్ పాండ్య ప్రణాళికలు ఉన్నాయని చెప్పవచ్చు.