Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన మంత్రి, శాట్స్ చైర్మెన్
నవతెలంగాణ-హైదరాబాద్
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతలకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. మహిళల క్రికెట్ సర్క్యూట్‌లో భారత జట్టు ఓ ఐసీసీ ట్రోఫీని తొలిసారి సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయంలో తెలంగాణ నుంచి ముగ్గురు భాగస్వామ్యం పంచుకున్నారు. అహ్మదాబాద్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్ల నుంచి ఘన సత్కారం అందుకున్న అమ్మాయిలు గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. జి. త్రిష రెడ్డి, యశశ్రీ సహా ఫిట్‌నెస్ ట్రైనర్ శాలీనిలకు గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ ఈ. ఆంజనేయ గౌడ్ సహా రాష్ట్ర క్రీడాధికారులు, క్రీడాకారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ విఐపి లాంజ్‌లో త్రిష రెడ్డి, యశశ్రీ, శాలినీ సహా కోచ్‌లు, కుటుంబ సభ్యులను అభినందించిన మంత్రి, శాట్స్ చైర్మెన్ శాలువాల సన్మానించారు.
'చారిత్రక ప్రపంచకప్ విజయంలో భాగం కావటం గర్వంగా ఉంది. టైటిల్ పోరులో విన్నింగ్ షాట్ కొట్టాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. ప్రపంచ విజేతలమనే భావన ఎంతో గొప్పగా అనిపిస్తుందని' గొంగడి త్రిష ఆనందం వెలిబుచ్చింది. త్రిష, యశశ్రీలకు భవిష్యత్‌లో తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్ హామీ ఇచ్చారు.