Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేసు
- సిద్ధమైన హైదరాబాద్ స్ట్రీట్సర్క్యూట్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రతిష్టాత్మక ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ రేసుకు రంగం సిద్ధమైంది. సుమారు దశాబ్దకాలం అనంతరం భారత్ ఓ ఎఫ్ఐఏ ఫార్ములా రేసుకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్‌లో జరుగనున్న తొలి ఫార్ములా-ఈ రేసు కావటంతో మోటార్‌స్పోర్ట్స్ వర్గాల్లో విపరీత ఆసక్తి కనిపిస్తోంది. 11 జట్లు, 22 మంది డ్రైవర్లు నేటి నుంచి హైదరాబాద్ స్ట్రీట్సర్క్యూట్పై రయ్రయ్ అనిపించనున్నారు. ఫార్ములా-ఈ రేసులో భారత్‌కు చెందిన మహీంద్రా జట్టుకు హైదరాబాద్ గ్రాండ్ ప్రీ ఆతిథ్య రేసుగా నిలువనుంది. ఫార్ములా-ఈ రేసుతో మోటార్‌స్పోర్ట్స్‌కు సరికొత్త జోష్‌తో పాటు ఎలక్రిక్ వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
నేడు ప్రాక్టీస్ రేసు
ఫార్ములా-ఈ రేసు కోసం 2.835 కిలోమీటర్ల హైదరాబాద్ స్ట్రీట్సర్క్యూట్ సిద్ధమైంది. ఇప్పటికే 11 జట్ల జెన్ 3 రేసింగ్ కార్లు గ్యారేజ్‌లకు చేరుకున్నాయి. నేడు సాయంత్రం 4.25-5.15వరకు వరకు తొలి ప్రాక్టీస్ రేసు జరుగనుంది. ప్రధాన రేసులో పాల్గొనే రేసర్లు సహా ప్రతి జట్టులోని యువ రేసర్లు సైతం ప్రాక్టీస్ రేసులోకి దిగే అవకాశం ఉంది. 50 నిమిషాల జరిగే ప్రాక్టీస్ సెషన్లో రెండు గ్రూపులు 25 నిమిషాల చొప్పున ట్రాక్‌పై దూసుకెళ్లనున్నాయి.
ఉచిత ప్రవేశం : ఫార్ములా-ఈ ఈవెంట్‌కు రూ.1000 నుంచి రూ.1,25,000 వరకు టికెట్లను వివిధ విభాగాల్లో అందుబాటులో ఉంచారు. టికెట్లు కొనుగోలు చేయని అభిమానులు ఫార్ములా-ఈ మజా ఆస్వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పించింది. నేడు ప్రాక్టీస్ రేసును టికెట్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం ఇచ్చింది.