Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడేజా ఐదు వికెట్ల ప్రదర్శన
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 177/10
- రోహిత్ అజేయ అర్థ సెంచరీ
- భారత్ తొలి ఇన్నింగ్స్ 77/1
జామ్తాలో టీమ్ ఇండియా జాతర. బంతితో రవీంద్ర జడేజా (5/47) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. బ్యాట్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ (56 బ్యాటింగ్) అజేయ అర్థ సెంచరీతో దండెత్తాడు. కీలక టాస్ ఓడినా.. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అదరగొట్టిన టీమ్ ఇండియా నాగ్‌పూర్‌లో తొలి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 77/1తో కొనసాగుతుంది.
నవతెలంగాణ-నాగ్‌పూర్
రవీంద్ర జడేజా (5/47) పునరాగమనంలో మాయ చేశాడు. లంచ్ తర్వాత ఆసీస్‌ను ఖతం చేసిన జడేజా..బోర్డర్-గవాస్కర్ తొలి టెస్టులో భారత్‌కు ఆరంభ ఆధిక్యత అందించాడు. జడేజాకు తోడు అశ్విన్ (3/42) మెరవటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 2/2 నుంచి 84/2తో కోలుకున్న ఆస్ట్రేలియా.. చివరి ఐదు వికెట్లను 15 పరుగులకే చేజార్చుకుంది. మార్నస్ లబుషేన్ (49, 123 బంతుల్లో 8 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (37, 107 బంతుల్లో 7 ఫోర్లు), అలెక్స్ కేరీ (36, 33 బంతుల్లో 7 ఫోర్లు), పీటర్ హ్యాండ్స్కాంబ్ (31, 84 బంతుల్లో 4 ఫోర్లు) ఆస్ట్రేలియాకు గౌరవప్రద స్కోరు అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (56 బ్యాటింగ్, 69 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కెఎల్ రాహుల్ (20, 71 బంతుల్లో 1 ఫోర్) రోహిత్‌తో కలిసి శుభారంభం అందించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అశ్విన్ (0 బ్యాటింగ్) జతగా రోహిత్ అజేయంగా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 100 పరుగుల వెనుకంజలో నిలిచింది.
సెషన్ 1 : షమి, సిరాజ్ దూకుడు
టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు పిచ్ నుంచి పరుగులు రాబట్టే ఆలోచనలో ఉన్న ఆస్ట్రేలియాకు పేసర్లు షాక్ ఇచ్చారు. మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ తొలి మూడు ఓవర్లలోనే ఆసీస్‌ను కంగారు పెట్టారు. డెవిడ్ వార్నర్ (1) వికెట్‌ను షమి గాల్లో ఎగరేయగా.. ఖవాజ (1)ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. 2/2తో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. మార్నస్ లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37) ఈ దశలో కంగారూలను నిలబెట్టారు. మూడో వికెట్‌కు 82 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించారు. ఆరంభంలోనే ఓపెనర్లను అవుట్ చేసిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత వికెట్ కోసం చెమటోడ్చింది. భారత బౌలర్లను స్మిత్, లబుషేన్ పరీక్షించారు. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 76/2 వద్ద నిలిచింది.
సెషన్ 2 : స్పిన్ మాయజాలం
ఉదయం సెషన్లో పేసర్ల దెబ్బ నుంచి కోలుకున్న ఆస్ట్రేలియాను.. లంచ్ తర్వాత స్పిన్నర్లు వేటాడారు. వరుస బంతుల్లో మార్నస్ లబుషేన్ (49), మాట్ రెన్షా (0)లను వెనక్కి పంపిన జడేజా.. భారత్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. జడేజా మాయజాలంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్ (37)ను సైతం తెలివిగా అవుట్ చేసిన జడేజా.. పీటర్ హ్యాండ్స్కాంబ్ (31), టాడ్ మర్ఫీ (0)లను సైతం సాగనంపి పునరాగమనంలో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అశ్విన్ సైతం వికెట్ల వేటలో జతకలవటంతో ఆస్ట్రేలియా 63.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ కేరీ (36) వికెట్‌తో టెస్టుల్లో అశ్విన్ 450 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. టీ విరామ సమయానికి 174/8తో నిలిచిన ఆస్ట్రేలియా.. మూడో సెషన్ ఆరంభంలోనే చివరి రెండు వికెట్లు చేజార్చుకుంది.
సెషన్ 3 : రోహిత్ శర్మ అర్థ సెంచరీ
ఆస్ట్రేలియా బ్యాటర్లు తంటాలు పడిన పిచ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ (56 నాటౌట్) అజేయ అర్థ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాట్ కమిన్స్‌పై మూడు బౌండరీలు బాదిన రోహిత్ శర్మ ధనాధన్ ఆరంభాన్ని అందించాడు. సుమారు ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ జామ్తా పిచ్‌పై కదం తొక్కాడు. వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ (20)తో కలిసి తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. తొలి రోజు మరో ఏడు బంతుల్లో ముగియనుండగా కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయాడు. అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ (1/13) ఆసీస్‌కు బ్రేక్ సాధించాడు. నైట్‌వాచ్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ (0 నాటౌట్) తోడుగా రోహిత్ శర్మ అజేయంగా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 77/1 పరుగులతో కొనసాగుతుంది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (బి) షమి 1, ఉస్మాన్ ఖవాజ (ఎల్బీ) సిరాజ్ 1, మార్నస్ లబుషేన్ (స్టంప్డ్) భరత్ (బి) జడేజా 49, స్టీవ్ స్మిత్ (బి) జడేజా 37, మాట్ రెన్షా (ఎల్బీ) జడేజా 0, పీటర్ హ్యాండ్‌కాంబ్ (ఎల్బీ) జడేజా 31, అలెక్స్ కేరీ (బి) అశ్విన్ 36, పాట్ కమిన్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 6, టాడ్ మర్ఫీ (ఎల్బీ) జడేజా 0, నాథన్ లయాన్ నాటౌట్ 0, స్కాట్ బొలాండ్ (బి) అశ్విన్ 1, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (63.5 ఓవర్లలో ఆలౌట్) 177.
వికెట్ల పతనం : 1-2, 2-2, 3-84, 4-84, 5-109, 6-162, 7-172, 8-173, 9-176, 10-177.
బౌలింగ్ : మహ్మద్ షమి 9-4-18-1, మహ్మద్ సిరాజ్ 7-3-30-1, రవీంద్ర జడేజా 22-8-47-5, అక్షర్ పటేల్ 10-3-28-0, రవిచంద్రన్ అశ్విన్ 15.5-2-42-3.
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ నాటౌట్ 56, కెఎల్ రాహుల్ (సి,బి) టాడ్ మర్ఫీ 20, రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (24 ఓవర్లలో ఓ వికెట్) 77.
వికెట్ల పతనం : 1-76.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 4-1-27-0, స్కాట్ బొలాండ్ 3-1-4-0, నాథన్ లయాన్ 10-3-33-0, టాడ్ మర్ఫీ 7-0-13-1.
నేడు కీలకం!
భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టులో రెండో రోజు కీలకం కానుంది. జామ్తా స్పిన్ స్వర్గధామం. తొలి రోజు మధ్యాహ్నాం నుంచే బంతి గింగిరాలు తిరుగుతోంది. జడేజా, అశ్విన్‌లు చివరి 8 వికెట్లు పంచుకున్నారు. ఆస్ట్రేలియా 200 పరుగులైనా చేయకుండానే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అమోఘంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు సైతం మెప్పించే దిశగా సాగుతున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. తొలి రోజు మూడో సెషన్లో 24 ఓవర్లలోనే బారత్ 77 పరుగులు చేసి మంచి స్థితిలో కొనసాగుతుంది.
అయితే, తొలి టెస్టులో రెండో రోజు ఆట ఫలితాన్ని శాసించనుంది. ఈ పిచ్‌పై పరుగులు చేయటం అంత సులువు కాదు. ఆ విషయం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌తోనే అర్థమైంది. ఆసీస్ సైతం ఓ దశలో 84/2తో నిలిచినా.. వరుస వికెట్లతో చతికిల పడింది. ప్రస్తుతం భారత్ మంచి స్థితిలోనే నిలిచినా.. తొలి ఇన్నింగ్స్‌లో 250-300 పరుగులు చేయటం అత్యవసరం. రెండో ఇన్నింగ్స్‌లో 150 పైచిలుకు టార్గెట్‌ను ఛేదించటం సైతం జామ్తా పిచ్‌పై శక్తికి మించిన పని అవుతుంది. ఈ సంగతి భారత డ్రెస్సింగ్‌రూమ్‌కు బాగా తెలుసు. తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగుల లోటు అధిగమించి.. మరో 150 పరుగుల ఆధిక్యమైనా సొంతం చేసుకోవాలి. అప్పుడే నాగ్‌పూర్ టెస్టును గుప్పిట నిలుపుకోవచ్చు. విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా స్పిన్ ఆడటంలో ఇబ్బందులు పడటం భారత్‌కు ఆందోళనకరం. రిషబ్ పంత్ తరహాలో ధనాధన్ దంచుడు బాధ్యత సూర్యకుమార్ యాదవ్ తీసుకునే అవకాశం ఉంది. కె.ఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సైతం పూర్తి స్థాయి బ్యాటర్ బాధ్యతలు పోషించగలరు. ఇది భారత్‌కు ప్రధాన బలం. నేడు వీలైనంత ఆధిక్యం సాధిస్తేనే రెండో ఇన్నింగ్స్‌లో కఠిన పిచ్‌పై లక్ష్యాన్ని సులువుగా ఛేదించేందుకు వీలుంటుంది. రోహిత్ అండ్ కో నేడు ఏం చేస్తుందో చూడాలి.