Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడేజా, అక్షర్ అజేయ అర్థ సెంచరీలు
- 144 పరుగుల ముందంజలో భారత్
- ఆసీస్‌తో తొలి టెస్టు రెండో రోజు
- జామ్తా టెస్టుపై టీమ్ ఇండియా పట్టు
ఆధునిక క్రికెట్ తరహా ఎదురుదాడి లేదు. పరుగుల ప్రవాహం కోసం అనవసర దండయాత్ర అసలే లేదు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను సంప్రదాయ పద్దతుల్లోనే ఆడుతూ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా తిరుగులేని స్థితిలో నిలిచింది. క్రీజులో ఓపిగ్గా నిలబడి, చెత్త బంతి కోసం ఎదురుచూసి, ఒక్కో పరుగే జోడిస్తూ సాగిన భారత ఇన్నింగ్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. నాయకుడు రోహిత్ శర్మ (120) శతక గర్జనకు రవీంద్ర జడేజా (66 నాటౌట్), అక్షర్ పటేల్ (52 నాటౌట్) అజేయ అర్థ సెంచరీ మెరుపులు తోడవటంతో నాగ్‌పూర్ టెస్టు భారత్ గుప్పిట్లోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల భారీ ముందంజలో కొనసాగుతున్న భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 321/7తో నిలిచింది.
నవతెలంగాణ - నాగ్‌పూర్
జామ్తా పిచ్‌పై తొలి రోజు బౌలర్లు వికెట్ల జాతర చేయగా.. రెండో రోజు భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ (120, 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్సీ శతకంతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (66 బ్యాటింగ్, 170 బంతుల్లో 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (52 బ్యాటింగ్, 102 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీలతో భారత్‌ను తిరుగులేని ఆధిక్యం దిశగా నడిపిస్తున్నారు. 81 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జడేజా, అక్షర్‌లు భారత్‌ను తిరుగులేని స్థితిలో నిలబెట్టారు!. ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ (5/82) ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 321/7తో కొనసాగుతోంది. జడేజా, అక్షర్ పటేల్ అజేయంగా నిలిచారు. రెండో రోజు ఆటలో ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ 244 పరుగులు సాధించింది.
సెషన్ 1 : నిలకడగా రోహిత్ జోరు
రెండో రోజు ఆట ఉదయం సెషన్లో ఆస్ట్రేలియా రెండు వికెట్లు పడగొట్టింది. అయినా, తొలి సెషన్లో భారత్‌దే పైచేయి. నైట్‌వాచ్‌మన్ అశ్విన్ (23, 71 బంతుల్లో 1 ఫోర్) చక్కటి సహకారం అందించాడు. రోహిత్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నిర్మిం చాడు. అరంగేట్ర మాయ చేసిన మర్ఫీ.. స్వల్ప విరామంలో అశ్విన్, చతేశ్వర్ పుజార (7)లను అవుట్ చేశాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడినా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకాగ్రత చెదరలేదు. సహనంతో ఆడిన రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ నమోదు చేశాడు. తొలి సెషన్లో భారత్ 74 పరుగులు పిండుకుంది. విరాట్ కోహ్లి తోడుగా రోహిత్ శర్మ లంచ్ విరామ సమయానికి అజేయంగా నిలిచాడు. భారత్ 151/3 వద్ద నిలిచింది.
సెషన్ 2 : రోహిత్ శతక నాదం
లంచ్ అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీ శతకం నమోదు చేశాడు. రెండేండ్ల విరామం అనంతరం టెస్టుల్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. నాయకుడిగా ఈ ఫార్మాట్లో తొలి వంద పరుగులు బాదాడు. 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 171 బంతుల్లో రోహిత్ శర్మ మూడంకెల స్కోరు అందుకున్నాడు. జామ్తాలో స్పెషల్ శతకం సాధించినా రోహిత్ శర్మ పెద్దగా సంబురం చేసుకోలేదు. ఇక లంచ్ అనంతరం సెషన్లోనూ ఆస్ట్రేలియా రెండు వికెట్లు పడగొట్టింది. స్పిన్ ఎదుర్కొవటంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లి (12) మర్ఫీ మాయలో చిక్కుకున్నాడు. అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (8) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. నాథన్ లయాన్ వలలో చిక్కి నిష్క్రమించాడు. రోహిత్ శర్మ శతక విన్యాసంతో రెండో సెషన్లో భారత్ పైచేయి సాధించింది. ఈ సెషన్లో టీమ్ ఇండియా 75 పరుగులు నమోదు చేసింది.
సెషన్ 3 : ఆల్‌రౌండర్ల అద్భుతం
టీ విరామం తర్వాత ఆల్‌రౌండర్లు అదరగొట్టారు. రవీంద్ర జడేజా (66 నాటౌట్), అక్షర్ పటేల్ (52) ధనాధన్ షో చూపించారు. కొత్త బంతితో పాట్ కమిన్స్ నిప్పులు చెరుగగా.. రోహిత్ శర్మ (120) అమోఘ ఇన్నింగ్స్‌కు తెరపడింది. తెలుగు తేజం కె.ఎస్ భరత్ (8) నిరాశపరిచాడు. సెషన్ ఆరంభంలోనే రెండు వికెట్లు చేజార్చు కున్న భారత్.. ఆలౌట్ ప్రమాదంలో పడింది. కానీ జడేజా, అక్షర్ ప్రణాళికలు మరోలా ఉన్నాయి. 30.5 ఓవర్లలో 2.62 రన్‌రేట్‌తో 8వ వికెట్‌కు అజేయంగా 81 పరుగులు జోడించారు. ఏడు ఫోర్లతో 114 బంతుల్లో జడేజా అర్థ సెంచరీ బాదగా.. అక్షర్ పటేల్ కాస్త దూకుడు చూపించాడు. ఎనిమిది ఫోర్లతో 94 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఆల్‌రౌండర్లు ఇద్దరూ అద్వితీయ ఆటతో అదరగొట్టారు. ఈ సెషన్లో భారత్ ఏకంగా 95 పరుగులు పిండుకుంది. రెండో రోజు చివరి ఓవర్లో జడేజా క్యాచ్‌ను స్మిత్ వదిలేయటంతో ఆస్ట్రేలియా శిబిరం మరింత నైరాశ్యంలో పడింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల విలువైన ఆధిక్యంలో నిలిచింది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 177/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (బి) కమిన్స్ 120, రాహుల్ (సి,బి) మర్ఫీ 20, అశ్విన్ (ఎల్బీ) మర్ఫీ 23, పుజార (సి) బొలాండ్ (బి) మర్ఫీ 7, కోహ్లి (సి) అలెక్స్ (బి) మర్ఫీ 12, సూర్య కుమార్ (బి) లయాన్ 8, రవీంద్ర జడేజా బ్యాటింగ్ 66, శ్రీకర్ భరత్ (ఎల్బీ) మర్ఫీ 8, అక్షర్ పటేల్ బ్యాటింగ్ 52, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (114 ఓవర్లలో 7 వికెట్లకు) 321.
వికెట్ల పతనం : 1-76, 2-118, 3-135, 4-151, 5-168, 6-229, 7-240.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 18-2-74-1, స్కాట్ బొలాండ్ 17-4-34-0, నాథన్ లయాన్ 37-10-98-1, టాడ్ మర్ఫీ 36-9-82-5, మార్నస్ లబుషేన్ 5-0-24-0, మాట్ రెన్షా 1-0-7-0.