Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ గ్రాండ్ ప్రీ సూపర్‌హిట్
- జీన్ ఎరిక్ వేన్కు గ్రాండ్ ప్రీ టైటిల్
- దుమ్మురేపిన ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్
భారత మోటార్‌స్పోర్ట్స్‌లో నూతన అధ్యాయం. ఎఫ్ఐఏ ఫార్ములా1 స్థాయి రేసింగ్ ఈవెంట్‌కు హైదరాబాద్ అద్భుత ఆతిథ్యం ఇచ్చింది. ఏబీబీ ఎఫ్ఐఏ ఈ రేసు భారత్‌లో తొలి అంకం పూర్తి చేసుకుంది. 25 వేల మంది అభిమానుల నడుమ, హుస్సేన్‌సాగర్ తీరంలో 2.835 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్‌పై ఎలక్రిక్ రేసింగ్ దిగ్గజ కార్లు దూసుకుపోయాయి. సుమారు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన కార్లు ఆద్యంతం మోటార్‌స్పోర్ట్స్ అభిమానులను అలరించాయి. సూపర్‌హిట్‌గా నిలిచిన హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసు టైటిల్‌ను జీన్ ఎరిక్ వేన్ అందుకున్నాడు.
నవతెలంగాణ-హైదరాబాద్
ఎఫ్ఐఏ రేసింగ్ చిత్రపటంలో హైదరాబాద్ చోటు సాధించింది. అరంగేట్ర సీజన్లో అద్వితీయ రీతిలో ఫార్ములా-ఈ రేసు నిర్వహణతో మోటార్‌స్పోర్ట్స్ ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంది. తక్కువ సమయం, 18 మలుపులు, రెండు స్లో కార్నర్లు, ఓ హెయిర్‌పిన్ బెండ్తో కూడిన కఠిన ట్రాక్‌పై ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ కార్లు పూర్తి స్థాయిలో దూసుకెళ్లగలవా? అనే సందేహాలు శనివారం ప్రధాన రేసుతో పటాపంచలయ్యాయి. 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు టాప్ స్పీడ్‌లో ట్రాక్‌పై అదరగొట్టారు. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచకప్ చాంపియన్‌షిప్ నాల్గో రేసు హైదరాబాద్‌లో ఘనంగా ముగిసింది. హైదరాబాద్ గ్రాండ్ ప్రీ విజేతగా జీన్ ఎరిక్ వేన్ (డిఎస్ పెన్స్కే) విజేతగా నిలిచాడు. టిసిఎస్ జాగ్వార్ జట్టు, ఎవాన్స్ పోల్ పోజిషన్‌తో సరిపెట్టుకున్నారు.
జీన్ ఎరిక్ వేన్ జోరు
ఫ్రెంచ్ రేసర్ జీన్ ఎరిక్ వేన్ (డిఎస్ పెన్స్కే)హైదరాబాద్ స్ట్రీట్సర్క్యూట్ చాంపియన్‌గా నిలిచాడు. పోల్ పొజిషన్ కోసం జరిగిన అర్హత రౌండ్, క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్ (డ్యూయెల్స్) సహా ఫైనల్స్‌లోనూ సత్తా చాటిన ఫ్రెంచ్ డ్రైవర్.. ప్రధాన రేసులోనూ అదే జోరు కనబరిచాడు. ఫార్ములా-ఈ సీజన్ 7 చాంపియన్‌గా నిలిచిన జీన్ ఎరిక్ వేన్.. ఆ తర్వాత తొలిసారి ఓ రేసులో విజేతగా నిలిచాడు. హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసుకు నం.2 పొజిషన్‌తో ట్రాక్‌పైకి వచ్చిన జీన్ ఎరిక్ వేన్.. నిజానికి టైటిల్ సాధిస్తాడనే అంచనాలు తక్కువగా ఉన్నాయి. జాగ్వార్ డ్రైవర్ మిచ్ ఎవాన్స్ (న్యూజిలాండ్) పొడియం పొజిషన్ జోరుతో రేసులో ఆరంభం నుంచీ ముందంజలో నిలిచాడు. కానీ 15వ ల్యాప్‌లో ముందుకు దూసుకొచ్చిన జీన్ ఎరిక్ వేన్ అక్కడ్నుంచి వెనక్కి తగ్గలేదు. ఎన్విషన్ రేసింగ్ డ్రైవర్ నిక్ కాసిడి (న్యూజిలాండ్) రెండో స్థానంలో నిలిచి జీన్ ఎరిక్‌ను వెంబడించాడు. ఓ దశలో జీన్ ఎరిక్ వేన్ బ్యాటరీ సామర్థ్యం సున్నాకు చేరువైంది. ఆ సమయంలో నిక్ కాసిడి మరో 4 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో జీన్ ఎరిక్ వేన్ రేసును ముగించటం అసాధ్యమే అనిపించింది. కానీ అనుభవంతో అసమాన నైపుణ్యం ప్రదర్శించిన జీన్ ఎరిక్ వేన్.. ఫార్ములా-ఈ చరిత్రలోనే చిరస్మరణీయ ముగింపు సాధించాడు. రేసును వేగంగా ముగించాలనే తొందరపాటులో అదనపు బ్యాటరీ సామర్థ్యం వినియోగించకుండా, అదే సమయంలో రేసులో ఏమాత్రం వెనుకంజలో నిలువకుండా జాగ్రత్త వహించాడు. అందుబాటులో ఉన్న బ్యాటరీ సామర్థ్యంతో చాకచక్యంగా రేసును ముగించి మోటార్‌స్పోర్ట్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎన్విషన్ రేసింగ్ డ్రైవర్ సెబాస్టియన్ బుయేమి తొలుత మూడో స్థానంలో నిలిచాడు. కానీ అతడు బ్యాటరీ నిబంధనలు అతిక్రమించటంతో ఎఫ్ఐఏ అధికారులు అతడిపై 17 సెకండ్ల పెనాల్టీ విధించారు. దీంతో మూడో స్థానంలో నిలిచిన సెబాస్టియన్ ఏకంగా 15వ స్థానానికి పడిపోయాడు.
ఎవాన్స్‌కు పోల్ పొజిషన్
ఇక ఉదయం సెషన్లో పోల్ పోజిషన్ కోసం జరిగిన రేసులో జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. జాగ్వార్ టీసీఎస్ డ్రైవర్ మిచ్ ఎవాన్స్ ఓ ల్యాప్‌ను 01.13.228 సెకండ్లలో ముగించి పోల్ పోజిషన్ సాధించాడు. పోల్ పొజిషన్‌తో మిచ్ ఎవాన్స్ మూడు పాయింట్లు దక్కించుకున్నాడు. ఫైనల్లో జీన్ ఎరిక్ వేన్ (ఫ్రాన్స్) సెకన్లో 0.21 వంతు తేడాతో ఎవాన్స్‌కు పోల్ పొజిషన్ కోల్పోయాడు. అర్హత రౌండ్ గ్రూప్-ఏలో మిచ్ ఎవాన్స్, సచా (నిసాన్), బుయేమి (ఎన్విషన్), మాక్సిమిలన్ (మసరేటి)లు డ్యుయెల్స్కు చేరుకున్నారు. గ్రూప్-బిలో రెనె రాస్ట్ (మెక్లారెన్), జీన్ ఎరిక్ వేన్, శామ్ బర్డ్ (జాగ్వార్), మోర్టారా (మసరేటి)లు డ్యుయెల్స్కు అర్హత సాధించారు. ఆతిథ్య మహీంద్రా రేసింగ్ జట్టు ఎవరూ డ్యుయెల్స్కు అర్హత సాధించలేదు.
జాగ్వార్‌కు గట్టి దెబ్బ
హైదరాబాద్ గ్రాండ్ ప్రీ అర్హత రౌండ్ అనంతరం జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ జట్టు ఫేవరేట్‌గా కనిపించింది. ప్రధాన రేసును ఆ జట్టు డ్రైవర్లు మిచ్ ఎవాన్స్ (నం.1), శామ్ బర్డ్ (నం.6) పొజిషన్లలో మొదలెట్టారు. హైదరాబాద్ ట్రాక్‌పై మిచ్ ఎవాన్స్ ఎదురులేని జోరుతో కనిపించాడు. 15వ ల్యాప్ సమయంలో మిచ్ ఎవాన్స్ కారును సహచర జాగ్వార్ డ్రైవర్ శామ్ బర్డ్ ఢకొీట్టాడు. అమరవీరుల మ్యూజియం వద్ద మలుపు దగ్గర (టర్న్ నం.4) రెట్టించిన వేగంతో దూసుకెళ్లే ప్రయత్నం చేసిన శామ్ బర్డ్ ఆ క్రమంలో ముందున్న మిచ్ ఎవాన్స్ కారును టాప్ స్పీడ్‌తో ఢకొీట్టాడు. దీంతో రేసులో నిలిచిన రెండు జాగ్వార్ కార్లు పక్కనకు తప్పుకున్నాయి. ఈ ఘటనతో మసరేటి, నిసాన్ రేసింగ్ జట్ల కార్లు సైతం అక్కడే నిలిపోయాయి. మిచ్ ఎవాన్స్, శామ్ బర్డ్స్ సహా ఫెనెస్ట్రాజ్, స్టోఫెల్ వాండోర్నెలు మళ్లీ రేసు బరిలోకి దిగలేదు. జాగ్వార్ కార్లు ఢకొీట్టిన సమయంలో మిచ్ ఎవాన్స్ రేసులో మూడో స్థానంలో కొనసాగు తున్నాడు. పోడియం ఫినిషింగ్ ఖాయం అనుకున్న తరుణంలో జాగ్వార్ స్వీయ తప్పిదంతో దారుణంగా దెబ్బతింది. ఎవాన్స్‌ను ఢకొీట్టిన అనంతరం 'నన్ను క్షమించండి' అని శామ్ బర్డ్ బాధపడ్డాడు.
46 నిమిషాల్లో 90.72కిలోమీటర్లు
హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. 2.835 కిలోమీటర్ల స్ట్రీట్సర్క్యూట్ ట్రాక్‌పై 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు 32 రౌండ్లు (ల్యాప్‌లు) దూసుకెళ్లారు. 18 మలుపులతో కూడిన ట్రాక్‌పై అవాంతరాలు సైతం అదేరీతిలో ఎదురయ్యాయి. కొన్నిసార్లు సేఫ్టీ కారు సైతం ట్రాక్‌పైకి వచ్చింది. దీంతో పలు రౌండ్లలో కార్లు వేగం తగ్గించుకున్నాయి. గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచిన జీన్ ఎరిక్ వేన్ (న్యూజిలాండ్) 46.01.099 సెకండ్లలో రేసును పూర్తి చేశాడు. ఎన్విషన్ రేసింగ్ డ్రైవర్ నిక్ కాసిడి (న్యూజిలాండ్) 46.01.499 సెకండ్లతో రెండో స్థానంలో నిలువగా.. ఆంటోనియో ఫెలిక్స్ (డిఏ కొలిస్టా) 46.02.958 సెకండ్లతో మూడో స్థానం సాధించాడు. మహీంద్రా రేసింగ్ డ్రైవర్లు ఒలివర్ రోలాండ్ 46.08.237 సెకండ్లతో ఆరో స్థానంలో నిలువగా.. లుకాస్ డి గ్రాసీ (బ్రెజిల్) 14వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్‌ను సాధించలేకపోయాడు.
పోటెత్తిన అభిమానులు
హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసుకు అభిమానులు పోటెత్తారు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నిర్వహణ అనుభవంతో ఫార్ములా-ఈ రేసుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ట్రాక్ పొడవునా అభిమా నులకు స్టాండ్స్ ఏర్పాటు చేశారు. 25 వేల మంది అభిమానులు చూస్తుండగా హైదరాబాద్ గ్రాండ్ ప్రీ గ్రాండ్ సక్సెస్ సాధించింది.
సచిన్, చరణ్ సందడి
ఫార్ములా-ఈ హైదరాబాద్ గ్రాండ్ ప్రీకి ప్రముఖులు తరలివచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సినీ నటుడు రామ్‌చరణ్‌లు రేసులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. క్రికెటర్లు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, యుజ్వెంద్ర చాహల్‌లు రేసు తిలకించారు. అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్‌లు, సిద్ధు జొన్నలగడ్డ, శృతి హాసన్ వీవీఐపీ లాంజ్ నుంచి ఫార్ములా-ఈ రేసును వీక్షించారు.
మన ట్రాక్..యమ స్పీడ్!
ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది తొమ్మిదో సీజన్. ఈ ఏడాది సీజన్లో హైదరా బాద్ గ్రాండ్ ప్రీ నాల్గో రేసు. మెక్సికో తొలి రేసు జరుగగా.. సౌదీ అరేబియా (దిరియా)లో 2, 3 రేసులు నిర్వహిం చారు. తొలి మూడు రేసులతో పోల్చితే హైదరాబాద్ ట్రాక్‌పైనే డ్రైవర్లు టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లారు. మెక్సికో ట్రాక్ 2.63 కిలోమీటర్లు ఉండగా, 19 టర్న్‌లు ఉన్నాయి. 2.49 కిలోమీటర్ల దిరియా ట్రాక్‌పై 21 టర్న్‌లు ఉన్నాయి. మెక్సికో రేసు విజేత 32 ల్యాప్‌లను 58.25.974 సెకండ్లలో పూర్తి చేయగా.. దిరియా రేసులు వరుసగా 47.45.911,50.40.304 సెకండ్లలో ముగిశాయి. హైదరాబాద్ ట్రాక్ 2.835 కిలోమీటర్ల పొడవు. ఇందులో 18 టర్న్‌లతో పాటు రెండు స్లో కార్నర్లు, ఓ హెయిర్‌పిన్ బెండ్ ఉన్నాయి. ఈ ట్రాక్‌పై ప్రధాన రేసు 46.01.099 సెకండ్లలోనే ముగిసింది. దీంతో ఫార్ములా-ఈ సీజన్లో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ యమ స్పీడ్ ట్రాక్‌గా నిలిచింది.