Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్‌పై భారత్ ఘన విజయం
- ఛేదనలో జెమీమా, రిచా ధనాధన్
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా) : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ. దాయాది జట్టుపై ధనాధన్ మోత మోగించిన టీమ్ ఇండియా అమ్మాయిలు అదిరే విజయం సాధించారు. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఊదేసిన భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం నమోదు చేసింది. జెమీమా రొడ్రిగస్ (53 నాటౌట్, 38 బంతుల్లో 8 ఫోర్లు), రిచా ఘోష్ (31 నాటౌట్, 20 బంతుల్లో 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళలు 20 ఓవర్లలో 149/4 పరుగులు చేశారు. జెమీమా రొడ్రిగస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. గ్రూప్-2 తర్వాతి మ్యాచ్‌లో ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది.
ఊదేశారు : 150 పరుగుల ఛేదనలో భారత్ అదరగొట్టింది. యస్టికా భాటియా (17), షెఫాలీ వర్మ (33, 25 బంతుల్లో 4 ఫోర్లు) శుభారంభం అందించారు. ఓపెనర్లు సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (16) నిష్క్రమణతో భారత శిబిరంలో ఒత్తిడి మొదలైంది. కానీ జెమీమా, రిచా ఘోష్ అద్వితీయంగా ఆడారు. నాల్గో వికెట్‌కు అజేయంగా 5.3 ఓవర్లలోనే 58 పరుగులు పిండుకున్నారు. డెత్ ఓవర్లలో బౌండరీల మోత మోగించారు. విన్నింగ్ షాట్‌తో అర్థ సెంచరీ పూర్తి చేసిన జెమీమా ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురులేని బోణీ అందించింది. రిచా ఘోష్ హ్యాట్రిక్ బౌండరీలతో మ్యాచ్‌ను భారత్ వశం చేసింది. పాకిస్థాన్ ఫీల్డింగ్ తప్పిదాలను భారత్ సద్వినియోగం చేసుకుంది.
మరూఫ్ మెరిసినా : తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. పది ఓవర్లలో ఆ జట్టు 58/3తో నిలిచింది. పాక్ 120 పరుగులు చేసినా గొప్పే అనిపించింది. కానీ కెప్టెన్ బిస్మా మరూఫ్ (68 నాటౌట్, 55 బంతుల్లో 7 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఏడు ఫోర్లతో చెలరేగిన మరూఫ్ వేగంగా పరుగులు పిండుకుంది. అయేషా నసీం (43 నాటౌట్, 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం రాణించింది. ఈ ఇద్దరు మెరువటంతో చివరి పది ఓవర్లలో పాకిస్థాన్ 91 పరుగులు సాధించింది. భారత బౌలర్ల రాధ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టింది. స్కోరు వివరాలు :
పాకిస్థాన్ మహిళలు : 149/4 (మరూఫ్ 68, అయేషా 43, రాధ 2/21)
భారత్ మహిళలు : 151/3 (జెమీమా 51, రిచా 31, సంధు 2/15)