Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గార్డ్నర్కు, నటాలీ సీవర్‌కు రూ.3.2 కోట్లు
- దీప్తి శర్మ, జెమీమా, షెఫాలీలకు రికార్డు ధర
- మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెటర్ల వేలం
మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం. ఐపీఎల్ ఆరంభ సీజన్ ఆటగాళ్ల వేలానికి 15 వసంతాలు నిండగా.. మహిళల ప్రీమియర్ లీగ్ చారిత్రక క్రికెటర్ల వేలం ముగించుకుంది. మహిళల క్రికెట్ స్టార్ క్రికెటర్ల కోసం వేలంలో ఐదు ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన వేలంలో రూ.3.4 కోట్ల రికార్డు దక్కించుకుంది. విదేశీ క్రికెటర్లు ఆష్లె గార్డ్నర్, నటాలీ సీవర్‌లు రూ.3.2 కోట్ల చొప్పున కైవసం చేసుకున్నారు. దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగస్, షెఫాలీ వర్మలు సైతం రికార్డు ధర దక్కించుకున్నారు.
నవతెలంగాణ-ముంబయి
మహిళల క్రికెట్లో కోట్ల వర్షం కురిసింది. ఎన్నాండ్లుగానే ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆరంభ క్రికెటర్ల వేలంలో ఊహించినట్టుగా భారత స్టార్ క్రికెటర్ స్మతీ మంధాన రికార్డు ధర దక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు మంధాన కోసం మూడో వంతు డబ్బు ఖర్చు చేసింది. రూ.3.4 కోట్ల రికార్డు ధరకు మంధానను కొనుగోలు చేసింది. వేలంలో భారత, విదేశీ స్టార్ క్రికెటర్ల కోసం గట్టి పోటీ కనిపించింది. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ సోమవారం జరిగిన వేలంలో 409 మంది క్రికెటర్లు నిలువగా.. 87 మందిని ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అందులో 57 మంది భారత క్రికెటర్లు కాగా, 30 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అసోసియేట్ దేశానికి చెందిన తారా నోరిస్ (అమెరికా) తొలి డబ్ల్యూపీఎల్‌లో ఆడనుంది.
మంధానపై కోట్ల వర్షం : స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రికార్డు ధర వెచ్చించింది. రూ.50 లక్షల కనీస ధరకు వేలంలోకి వచ్చిన మంధాన కోసం ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పోటీపడ్డాయి. చివరకు రూ.3.4 కోట్లకు బెంగళూర్ తీసుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ముంబయి ఇండియన్స్ తీసుకుంది. ఢిల్లీ, బెంగళూర్ నుంచి పోటీ ఎదురైనా రూ.1.8 కోట్లకు ముంబయి సొంతం చేసుకుంది. సోఫీ డెవిన్‌ను రూ.50 లక్షల కనీస ధరకు తీసుకున్న బెంగళూర్.. ఆసీస్ క్రికెటర్ ఎలిసీ పెర్రీ కోసం రూ.1.7 కోట్లను పెట్టింది. ఆసీస్ స్టార్ ఆష్లె గార్డ్నర్ విదేశీ క్రికెటర్లలో అత్యధిక ధర అందుకుంది. ముంబయి, వారియర్స్ పోటీపడినా.. గుజరాత్ జెయింట్స్ రూ.3.2 కోట్ల ధరకు గార్డ్నర్ను ఎగరేసుకుపోయింది. ఇంగ్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ సోఫీ ఎకల్‌స్టోన్ రూ.1.8 కోట్ల ధరకు యూపీ వారియర్స్‌కు వెళ్లిపోయింది. వేలంలో తొలి సెట్ క్రికెటర్లలో ఏకంగా ముగ్గురిని బెంగళూరే కొనుగోలు చేసింది.
భారత క్రికెటర్లలో స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రికార్డు ధర సొంతం చేసుకుంది. క్యాపిటల్స్, జెయింట్స్, ముంబయి పోటీపడినా.. యూపీ వారియర్స్ రూ.2.6 కోట్ల ధరకు దీప్తిని కొనుగోలు చేసింది. పేసర్ రేణుక సింగ్‌ను రూ.1.5 కోట్ల ధరకు బెంగళూర్ తీసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ సీవర్ బ్రంట్ కోసం ముంబయి ఏకంగా రూ.3.2 కోట్ల రికార్డు ధరను పెట్టింది. యూపీ, ఢిల్లీలు నటాలీ కోసం గట్టిగా ప్రయత్నించాయి. ఆసీస్ ఆల్‌రౌండర్ తహ్లియ మెక్‌గ్రాత్ రూ.1.4 కోట్ల ధరకు యూపీ వారియర్స్ గూటికి చేరుకుంది. పరుగుల యంత్రం బెత్ మూనీ రూ. 2 కోట్ల ధరకు గుజరాత్ జెయింట్స్‌కు దక్కగా.. రూ.2 కోట్ల ధరకు షెఫాలీ వర్మ, రూ. 2.2 కోట్ల ధరకు జెమీమా రొడ్రిగస్‌లు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో పడ్డారు. పూజ వస్ట్రాకర్ రూ.1.9 కోట్లు (ముంబయి), రిచా ఘోష్ రూ.1.9 కోట్లు (బెంగళూర్)లు భారీ ధర దక్కించుకున్నారు.
ఇక తెలుగు క్రికెటర్లలో అరుంధతి రెడ్డి, సబ్బినేని మేఘన, అంజలి, యశశ్రీలు వేలంలో ప్రాంఛైజీలను ఆకర్షించారు. రూ. 30 లక్షలకు అరుంధతి రెడ్డిని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోగా.. రూ.55 లక్షలకు అంజలి శ్రావణిని యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. సొప్పదండి యశశ్రీ రూ. 10 లక్షల కనీస ధరకు యూపీ వారియర్స్‌కు దక్కగా.. సబ్బినేని మేఘన రూ.30 లక్షల ధరకు గుజరాత్ టైటాన్స్ సొంతమైంది.
మహిళల ప్రీమియర్ లీగ్ జట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : స్మృతీ మంధా న, సోఫీ డివైన్, ఎలిసీ పెర్రీ, రేణుక సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కశాట్, ఇంద్రాని రారు, శ్రేయాంక పాటిల్, కణిక అహుజ, ఆశా శోభన, హీథర్ నైట్, డేన్ వాన్ నికెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖేమ్నర్, కోమల్, మేఘన్ స్కాట్, సహన పవార్.
ముంబయి ఇండియన్స్ : హర్మన్‌ప్రీత్ కౌర్, నట్ సీవర్ బ్రంట్, ఆమేలి ఖేర్, పూజ వస్ట్రాకర్, యస్టికా భాటియ, హీథర్ గ్రాహం, ఇస్సీ వాంగ్, ఆమన్జోత్ కౌర్, గుజ్జర్, షైక, మాథ్యూస్, చోలె, హుమైరా, ప్రియాంక, సోనమ్, జింటిమని, నీలం బిస్త్.
గుజరాత్ జెయింట్స్ : ఆష్లె గార్డ్నర్, బెత్ మూనీ, సోఫీ డంక్లె, అనాబెల్ సుథర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేV్‌ా రానా, సబ్బినేని మేఘన, జార్జియా, మన్షీ జోషి, హేమలత, తనుజ కన్వార్, మోనిక పటేల్, సుష్మ వర్మ, హర్లీ, అశ్వని కుమారి, సిసోడియ, షబ్నమ్.
యూపీ వారియర్స్ : సోఫీ ఎకల్‌స్టోన్, దీప్తి శర్మ, తహ్లియ మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అలీసా హీలే, అంజలి శ్రావణి, రాజేశ్వరి గైక్వాడ్, పర్వశి చోప్రా, శ్వేత షెరావత్, యశశ్రీ, కిరణ్ నవ్గిరె, గ్రేస్ హారిస్, దేవిక, లారెన్ బెల్, లక్ష్మి యాదవ్, సిమ్రన్ షేక్.
ఢిల్లీ క్యాపిటల్స్ : జెమీమా రొడ్రిగస్, మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, రాధ యాదవ్, శిఖా పాండే, మరిజానె కాప్, టిటాస్ సదు, అలైస్ కాప్సే, తారా నోరిస్, జెసియ, మిన్ను మణి, తానియ భాటియా, జెస్ జొనాసెన్, స్నేV్‌ా దీప్తి, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, అపర్ణ మండల్.