Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు రూ.30 లక్షల నగదు బహుమతి ప్రదానం
హైదరాబాద్: నాలుగురోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ముఖేశ్ గౌడ్ స్మారక 'మల్లయుద్ధ' రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్‌గా 17 కేటగిరీలు పోటీలు నిర్వహించారు. మహిళల ఓపెన్ విభాగంలో రోహిణి సత్య శివాని పసిడి పతకం సాధించగా.. నేహా, రుహినా భాను రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బాలకేసరి విభాగంలో షేక్ అజీం బంగారు పతకం గెల్చుకోగా.. పర్వేజ్, పవన్‌లు ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో భగీరత్ సింగ్ (38 కేజీలు), రవి భారత్ (42 కేజీలు), కె.ఎస్ కిషన్ (48 కేజీలు), మహ్మద్ అబ్దుల్ (52 కేజీలు), లవకుశ గౌడ్ (53 కేజీలు), డి. వినోద్ (57 కేజీలు), అరవింద్ కుమార్ (61 కేజీలు), సయ్యద్ అబ్దుల్లా (65 కేజీలు), మహేంద్ర కుమార్ (70 కేజీలు)లు తమ కేటగిరిల్లో బంగారు పతకాలు సాధించారు. ప్రతి విభాగంలో బంగారు పతకం సాధించిన రెజ్లర్‌కు రూ.1 లక్ష, రజత పతకానికి రూ.50 వేలు, కాంస్య పతకానికి రూ.25 వేల నగదు బహుమతులు అందజేశారు. మహిళల ఓపెన్ విభాగం ఫైనల్స్, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. శ్రేష్ఠ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్రమ్ గౌడ్‌తో కలిసి విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు.