Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో హాజెల్‌వుడ్ అవుట్
- ఆసీస్ శిబిరంలో అనిశ్చితి
న్యూఢిల్లీ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో 0-2తో నైరాశ్యంలో కూరుకున్న ఆస్ట్రేలియా శిబిరంలో అశిన్చితి వాతావరణం ఏర్పడింది. కెప్టెన్ పాట్ కమిన్స్ కుటుంబ కారణాలతో అత్యవసరంగా స్వదేశానికి బయల్దేరగా.. పేసర్ జోశ్ హాజెల్‌వుడ్ గాయంతో చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో హాజెల్‌వుడ్ ఆస్ట్రేలియాకు తిరుగు పయనం అయ్యాడు. ఓపెనర్ డెవిడ్ వార్నర్ రెండో టెస్టులో కంకషన్తో బాధపడుతుండగా.. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ సైతం గాయం బారిన పడ్డాడు. దీంతో ప్రస్తుతం కంగారూల శిబిరంలో కంగారు కాస్త ఎక్కువైంది.
కెప్టెన్ పాట్ కమిన్స్ కుటుంబ సభ్యులలో ఒకరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు పాట్ కమిన్స్ అత్యవసరంగా ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. ఈ అంశంలో క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి సవివరణ ప్రకటన రావాల్సి ఉంది. న్యూఢిల్లీ టెస్టుకు ఇండోర్ టెస్టు మ్యాచ్‌కు 9 రోజుల విరామం వచ్చింది. దీంతో పాట్ కమిన్స్ మార్చి 1కి ముందే తిరిగి భారత్‌లో కంగారూ శిబిరంలో చేరతాడనే అంచనా ఉంది. పాట్ కమిన్స్ మూడో టెస్టు సమయానికి రాలేకపోతే..మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓపెనర్ డెవిడ్ వార్నర్ పరిస్థితిపై ఇంకా తేలాల్సి ఉంది. అతడు ఫిట్నెస్ సాధించకపోతే ట్రావిశ్ హెడ్ ఇండోర్ టెస్టులో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. పాట్ కమిన్స్, జోశ్ హాజెల్‌వుడ్ ప్రభావం జట్టుపై పెద్దగా ఉండే అవకాశం లేదు. జోశ్ హాజెల్‌వుడ్ జట్టుతో పాటు ఉన్నప్పటికీ ఫిట్నెస్ సమస్యతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. నాగ్‌పూర్‌లో స్కాట్ బొలాండ్ తుది జట్టులో నిలువగా.. న్యూఢిల్లీలో మూడో స్పిన్నర్‌కు చోటు కల్పించారు. నాల్గో టెస్టుకు కామెరూన్ గ్రీన్ తుది జట్టులో చోటు సాధించేందుకు వీలుంది. పాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు వెళ్లినా.. జట్టుతో టచ్‌లోనే ఉంటాడని, నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతాడని ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు.