Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్రాలు అందజేసిన క్రీడా మంత్రి
నవతెలంగాణ, హైదరాబాద్
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ సూపర్‌స్టార్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. క్రీడాశాఖ మంత్రి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్‌కు ఈ మేరకు ఇంటి స్థలం పత్రాలను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ అందజేశారు. నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం జూబ్లిహిల్స్‌లో 600 గజాల స్థలం కేటాయించింది. ఇటీవల యువ షూటర్ ఇషా సింగ్‌కు సైతం 600 గజాల ఇంటి స్థలాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.
త్వరలోనే డిఎస్పీ ఉద్యోగం
'బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటింది. సిఎం కెసిఆర్ గతంలోనే రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే నిఖత్ జరీన్‌కు పోలీసు శాఖలో డిఎస్పీగా ఉద్యోగ నియామక పత్రం సైతం అందజేస్తాం. భవిష్యత్‌లోనూ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం కొనసాగుతుందని' రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర క్రీడా పాలసీకి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రతిభ, విజయాలను గుర్తించి నగదు బహుమతితో పాటు ఇంటి స్థలం కేటాయించినందుకు సంతోషంగా ఉందని మహ్మద్ జమీల్ అహ్మద్ అన్నారు.