Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెజ్లింగ్ సమాఖ్యపై విచారణ గడువు పొడగింపు
- డబ్ల్యూఎఫ్ఐ పర్యవేక్షణ బాధ్యతలు సైతం..
న్యూఢిల్లీ : దేశ క్రీడా రంగాన్ని ఓ కుదుపు కుదేపిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల అంశంలో విచారణ కమిటీ గడువును మరో రెండు వారాలు పొడగించారు. జాతీయ శిక్షణ శిబిరాల్లో జూనియర్, సీనియర్ మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహా జాతీయ కోచ్‌లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ.. భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, అన్షు మాలిక్, బజరంగ్ పూనియా, రవి దహియాలు మూడు రోజుల పాటు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. రెజ్లర్ల ఆందోళనకు దిగొచ్చిన కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సారథ్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ కాలంలో భారత రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ వ్యవహారాలను చూసుకునే బాధ్యతలను సైతం మేరీకోమ్ కమిటీని అప్పగించారు. జనవరి 23న ఏర్పాటైన విచారణ, పర్యవేక్షణ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాల్సి ఉంది. అయితే, విచారణ నివేదిక సమర్పించేందుకు మరో రెండు వారాల సమయం అవసరమని మేరీకోమ్ కోరింది. దీంతో మేరీకోమ్ కమిటీని మరో రెండు వారాలు పొడగిస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు వారాల సమయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య పర్యవేక్షణ బాధ్యతలను సైతం కమిటీ చూసుకోనుంది. రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్ తృప్తి, సారు మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యులు రాధికా శ్రీమాన్, సారు మాజీ అధికారి రాజేశ్ రాజగోపాలన్, రెజ్లర్ బబితా ఫోగట్‌లో విచారణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.