Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోర్ టెస్టులో ఆసీస్‌కు ఆశలు
నవతెలంగాణ-ఇండోర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 0-2తో ఇప్పటికే వెనుకంజలో నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో పరాజయాలతో సిరీస్‌ను గెల్చుకునే అవకాశం కోల్పోయింది. ఇక మిగిలింది సిరీస్‌లో వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించుకుని, నేరుగా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించటం. స్పిన్ స్వర్గధామ పిచ్‌లపై కంగారూ బ్యాటర్లు మూడు రోజుల్లోనే చేతులెత్తేస్తున్నారు. నాగ్‌పూర్, న్యూఢిల్లీలో నాణ్యమైన స్పిన్ ఆడటంలో ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. తాజాగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో సైతం స్పిన్ పిచ్ సిద్ధమవుతోంది. పిచ్‌కు ఇరు వైపుల క్రీజు దగ్గర పచ్చికను పూర్తిగా తొలగించిన క్యూరేటర్.. పిచ్ మధ్యలో మాత్రం పచ్చికను అలాగే ఉంచాడు. బహుశా, నేడు సాయంత్రం పిచ్ మధ్యలో ఉంచిన పచ్చికను సైతం తొలగించే అవకాశం ఉంది.
స్మిత్, లబుషేన్పైనే ఆశలు : ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా స్టీవ్ స్మిత్ కితాబు అందుకున్నాడు. రానున్న కాలంలో ఎలైట్ బ్యాటర్ల క్లబ్లో మార్నస్ లబుషేన్‌కు సైతం చోటు ఖాయం. ఐదు రోజుల ఆటలో స్మిత్, లబుషేన్ బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం. నాగ్‌పూర్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులే లబుషేన్‌కు రెండు టెస్టుల్లో అత్యధికం కాగా..స్మిత్ తొలి టెస్టులో 37, 25 నాటౌట్ ఇన్నింగ్స్‌లే సిరీస్‌లో అత్యుత్తమం. న్యూఢిల్లీలో 0, 9 పరుగులే నిష్క్రమించగా.. లబుషేన్ 18, 35 పరుగులు చేశాడు. రెండు టెస్టుల్లో ఏడుసార్లు ఈ ఇద్దరు బ్యాటర్లు వికెట్ కోల్పోయారు. ప్రతిసారీ అసహనంతోనే క్రీజు విడిచి వెళ్లారు. ట్రావిశ్ హెడ్, ఉస్మాన్ ఖవాజకు తోడు హ్యాండ్స్కాంబ్లు బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం పరుగులు సాధిస్తే కనీసం ఇండోర్లైనా భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. పాట్ కమిన్స్ గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టనున్న స్టీవ్ స్మిత్ నాయకత్వ ఉత్సాహంలో సరికొత్తగా రాణిస్తాడేమో చూడాలి. ఇక స్పిన్ పిచ్‌లపై ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం ఆస్ట్రేలియాకు కలిసి రాలేదు. దీంతో ఇండోర్‌లో ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగనుంది. గాయం నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్ తుది జట్టులో నిలువనున్నాడు. హోల్కర్ పిచ్‌పై రివర్స్ స్వింగ్‌తో టీమ్ ఇండియాను దెబ్బకొట్టేందుకు నెట్స్‌లో స్టార్క్ చెమటోడ్చాడు. స్పిన్నర్లు లయాన్, టాడ్ మర్ఫీలకు తోడు మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ (ఫిట్నెస్ సాధిస్తే) అంచనాలను అందుకుంటే ఇండోర్‌లో ఆస్ట్రేలియా కథ మారవచ్చని కంగారూ శిబిరం బలంగా విశ్వసిస్తోంది.