Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుది జట్టు ఎంపిక ఎప్పుడైనా తలనొప్పి వ్యవహారమే. ఇద్దరు ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు తుది జట్టులోకి ఒకరినే తీసుకోవాల్సిన సమయంలో జట్టు మేనేజ్మెంట్కు, అభిమానులకు అది తీయని తలనొప్పి. అదే ఓ ఆటగాడు చెత్తగా ఆడుతుండగా, మరో ఆటగాడు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడూ తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారితే.. అది అటు జట్టు మేనేజ్మెంట్కు, ఇటు అభిమానులకు ఇరకాటమే. కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ విషయంలో ప్రస్తుతం భారత క్రికెట్ ఈ తలనొప్పిని అనుభవిస్తోంది!.
- రాహుల్, గిల్‌లలో ఎవరు?
- భారత్‌కు తుది జట్టు ఎంపిక తలనొప్పి
నవతెలంగాణ క్రీడావిభాగం
రాహుల్‌కు ఇంకెన్ని అవకాశాలు?!
కెఎల్ రాహుల్ అంశంలో భారత క్రికెట్ రెండుగా చీలింది!. 47 టెస్టుల అనంతరం 33.44 సగటు కలిగిన బ్యాటర్‌ను జట్టులో కొనసాగించటంపై వెంకటేశ్ ప్రసాద్ తీవ్రంగా తప్పుబట్టాడు. ప్రతిభావంతుడైన రాహుల్‌కు అవకాశం ఇవ్వటం సబబేనని ఆకాశ్ చోప్రా వాదించాడు. సోషల్ మీడియా వేదికగా మాజీ క్రికెటర్లు రాహుల్‌కు జట్టులో స్థానంపై వాగ్వివాదానికి దిగారు. అభిమానులు సైతం రెండు వర్గాలుగా చీలి ఎవరి వాదనను వారు సమర్థించుకున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లో రాహుల్ చెత్తగా ఆడాడు. ఫలితంగా చివరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. విదేశీ గడ్డపై, స్వదేశీ గడ్డపై అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్న రాహుల్‌కు సెలక్టర్లు నిలకడగా అవకాశాలు కల్పించటం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారత క్రికెట్లో ప్రతిభావంతులకు కొదవ లేదు. సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలు దేశవాళీలో పరుగుల వరద పారించి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ బెంచ్‌పై కూర్చున్నాడు. ప్రతిభ పేరుతో ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? ఇంకెన్ని మ్యాచుల్లో రాహుల్ వైఫల్యాన్ని సమర్థిస్తారు? అనే వాదన బలంగా వినిపిస్తోంది.
శుభ్‌మన్‌కు చోటివ్వరా?
కెఎల్ రాహుల్ వైఫల్యం కంటే శుభ్‌మన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవటం భారత్‌కు చేటు చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు రోజుల ఆటలో అరంగ్రేటం చేసిన గిల్.. 13 మ్యాచుల్లో 25 ఇన్నింగ్స్‌ల్లో 32 సగటుతో 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల వైట్‌బాల్ ఫార్మాట్లో శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. వన్డేలు, టీ20ల్లో శతకాల మోత మోగించాడు. భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని.. రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకోవటం అభిమానులకు ఏమాత్రం గిట్టలేదు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు అయినా శుభ్‌మన్ గిల్‌ను తుది జట్టులోకి ఎంచుకోవాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్న శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్లో విరాట్ కోహ్లి వారసుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
పక్కపక్కనే జోరుగా ప్రాక్టీస్
భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో ఆరంభం కానుంది. టెస్టు సమరానికి రెండు రోజుల ముందు నుంచే ఇరు జట్లు హోల్కర్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో నిమగం అయ్యాయి. సోమవారం నాడు భారత క్రికెటర్ల ప్రాక్టీస్ సెషన్ ఆసక్తికరంగా సాగింది. తుది జట్టు ఎంపికలో మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో పక్క పక్కనే సాధన చేయటం విశేషం. త్రో డైన్ స్పెషలిస్ట్ శుభ్‌మన్ గిల్‌కు మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కొనేలా బంతులు సంధించాడు. పక్కనే కెఎల్ రాహుల్ సైతం అంతే ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సైతం ఒకే సమయంలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ అధిక సమయం నెట్స్‌లో చెమటోడ్చాడు. రాహుల్, గిల్ నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు దగ్గరుండి పర్యవేక్షించటం గమనార్హం.
తుది జట్టు సమీకరణాలు, ప్రశ్నలకు ప్రాక్టీస్ సెషన్లో సమాధానం లభిస్తుందని అంటారు. కానీ భారత క్రికెట్ జట్టు తుది జట్టు ఎంపికపై ప్రాక్టీస్ సెషన్లో చాలా అరుదుగానే సంకేతాలు అందించింది. గిల్ ఎక్కువసేపు సాధన చేసినా, రాహుల్ బ్యాటింగ్‌తో పాటు స్లిప్స్‌లో క్యాచింగ్ ప్రాక్టీస్ చేసినా.. జట్టు మేనేజ్మెంట్ ఎవరి వైపు మొగ్గు చూపిందనే విషయం చెప్పటం కష్టమే. ప్రతిభ పేరుతో వైఫల్య ఆటగాడిని ఎక్కువ కాలం తుది జట్టులో ఉంచలేరు, ప్రతిభ కలిగిన క్రికెటర్‌ను ఎక్కువకాలం బెంచ్‌కు పరిమితం చేయలేరు. మరి, ఇండోర్ టెస్టుకు టీమ్ ఇండియా తుది జట్టు ఫార్ములా ఎలా ఉంటుందో చూడాలి.