Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో విజయంపై భారత్ గురి
- ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నేటి నుంచి
- ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియాలు ఆశలు ఆవిరయ్యాయి. చివరి రెండు టెస్టుల్లో నెగ్గినా.. కంగారూలకు టెస్టు సిరీస్ ట్రోఫీ దక్కదు. కానీ, చివరి రెండు టెస్టుల్లో ఓడితే ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇదే సమయంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. కానీ చివరి రెండు టెస్టుల్లో ఫలితం ప్రతికూలంగా వస్తే.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా చివరి రెండు టెస్టుల్లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా సైతం అదే తరహాలో సమరానికి సై అంటుంది. భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు ఇండోర్‌లో నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-ఇండోర్
భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు సిద్దమయ్యాయి. తొలి రెండు టెస్టులను మూడు రోజుల్లోనే ముగించిన టీమ్ ఇండియా 2-0తో సిరీస్‌పై తిరుగులేని పట్టు సాధించింది. స్పిన్ మంత్రతో కంగారూలకు చెక్ పెడుతున్న రోహిత్‌సేన.. నేడు ఇండోర్‌లో సైతం టర్నింగ్ పిచ్‌తోనే సిరీస్‌లో 3-0 ఆధిక్యంపై కన్నేసింది. మరోవైపు నాగ్‌పూర్, న్యూఢిల్లీలో తేలిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, ఓపెనర్ డెవిడ్ వార్నర్, పేసర్ జోశ్ హాజెల్‌వుడ్ సేవలు కోల్పోయింది. మాజీ సారథి స్టీవ్ స్మిత్ సారథ్య పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఇండోర్‌లో ఆస్ట్రేలియా పుంజుకునేందుకు ప్రయత్నిస్తుందా? భారత్ ముచ్చటగా మూడో టెస్టును మూడు రోజుల్లోనే ముగిస్తుందా? ఆసక్తికరం.
శుభ్‌మన్‌కు చోటిస్తారా?
టీమ్ ఇండియా ఓపెనర్, మాజీ వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. చివరి రెండు టెస్టులకు జట్టులో నిలిచినా.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కకపోవచ్చు. రెండు టెస్టుల్లో 38 పరుగులే చేసిన కెఎల్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇండోర్ టెస్టులో రాహుల్‌ను తప్పించి.. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. ప్రాక్టీస్ సెషన్లో శుభ్‌మన్ గిల్ ఎక్కువ సేపు నెట్స్‌లో ఉండగా.. మంగళవారం చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా గిల్‌కు బంతులు విసిరాడు. దీంతో శుభ్‌మన్‌కు తుది జట్టులో చోటు ఖాయమనే భావన ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. నం.3 చతేశ్వర్ పుజార, నం.4 విరాట్ కోహ్లి అంచనాలను అందుకోవాల్సి ఉంది. కోట్ల టెస్టులో విరాట్ కోహ్లి భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతున్నట్టే కనిపించాడు. ఇండోర్‌లోనైనా విరాట్ కోహ్లి మెప్పిస్తాడేమో చూడాలి. స్పిన్‌ను అద్భుతంగా ఆడే శ్రేయస్ అయ్యర్ రెండో టెస్టులో నిరాశపరిచాడు. క్రీజులో సౌకర్యవంతంగా కనిపించినా.. రెండు సార్లు వికెట్ చేజార్చుకున్నాడు. ఇండోర్‌లో అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాడు. ఇక సిరీస్‌లో భారత్‌ను అటు బంతితో, ఇటు బ్యాట్‌తో ఆదుకున్నది స్పిన్ ఆల్‌రౌండర్లే. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లు, మాయజాలంతో చెలరేగుతున్నారు. ఆస్ట్రేలియాకు మరోసారి ఈ ఇద్దరితో పాటు రవిచంద్రన్ అశ్విన్ సవాల్‌గా మారనున్నాడు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి పేసర్లుగా జట్టులో కొనసాగనున్నారు.
ఆసీస్ పుంజుకునేనా?
ఇప్పటికే సిరీస్‌పై ఆశలు ఆవిరి చేసుకున్న కంగారూలు... ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ బెర్త్ అయినా నేరుగా దక్కించుకోవాలని భావిస్తోంది. భారత్‌తో చివరి రెండు టెస్టుల్లో ఓడి, న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0తో నెగ్గితే ఆస్ట్రేలియా కథ ముగిసినట్టే. అందుకే, ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు చివరి రెండు టెస్టుల్లో ఒకటైనా నెగ్గేందుకు ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ పాట్ కమిన్స్, పేసర్ హాజెల్‌వుడ్, ఓపెనర్ డెవిడ్ వార్నర్ సేవలు దూరమయ్యాయి. 100 శాతం ఫిట్‌గా లేని మిచెల్ స్టార్క్ నేడు ఆసీస్ పేస్ దాడికి నాయకత్వం వహించనున్నాడు. అతడికి కామెరూన్ గ్రీన్, స్కాట్ బొలాండ్‌లు సహకరించే అవకాశం కనిపిస్తోంది. తుది జట్టు ఎంపికలోనూ ఆసీస్ కొన్ని తప్పిదాలు చేసింది. ఫామ్‌లో ఉన్న ట్రావిశ్ హెడ్‌ను తొలి టెస్టులో పక్కనపెట్టింది. టాప్ ఆర్డర్లో ట్రావిశ్ హెడ్, ఉస్మాన్ ఖవాజకు తోడు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, పీటర్ హ్యాండ్స్కాంబ్లు నేడు బ్యాట్‌తో ఆసీస్‌కు కీలకం కానున్నారు. ఈ ఐదుగురు బ్యాటర్లలో ఏ ముగ్గురు మెరిసినా..ఆసీస్ మెరుగైన స్కోరు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. కామెరూన్ గ్రీన్ సైతం తుది జట్టులోకి రానుండటంతో చివర్లో వేగంగా పరుగులు పిండుకునేందుకు అవకాశం ఏర్పడింది. స్పిన్నర్లు నాథన్ లయాన్, టాడ్ మర్ఫీలు తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు. దీంతో స్మిత్ మరోసారి ఈ జోడీపైనే విశ్వాసం నిలుపనున్నాడు.
ఉపఖండ పిచ్‌లపై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఫుట్‌వర్క్ ప్రధానం. జామ్తా పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌తో ఆడేందుకు ప్రయత్నించారు. ఫలితంగా ఫ్రంట్‌ఫుట్ వద్ద ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించారు. స్పిన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు స్వీప్ షాట్ ఆడటం ఉత్తమం. అందుకు కోట్ల పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లను విరివిగా వాడారు. ఫలితంగా ఏకంగా 9 మంది ఆటగాళ్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్ ఆడుతూ వికెట్ చేజార్చుకున్నారు. స్వీప్ షాట్, బ్యాక్‌ఫుట్ టెక్నిక్ పొరపాట్లను సరిదిద్దుకుని నేడు ఆస్ట్రేలియా పుంజుకునేందుకు సిద్ధమవుతుంది.
పిచ్, పరిస్థితులు
ఇండోర్‌లో జరిగిన రెండు టెస్టుల్లో (న్యూజిలాండ్ 2016, బంగ్లాదేశ్ 2019) తొలి రెండు రోజుల్లో సీమర్లకు పిచ్ నుంచి సహకారం లభించింది. బుధవారం ఉదయం పిచ్ నుంచి అటువంటి అనుకూలత ఆశించే పరిస్థితులు కనిపించటం లేదు. ర్యాంక్ టర్నర్ కాకపోయినా.. తొలి రోజు నుంచి టర్న్‌కు అనుకూలించే పిచ్‌నే ఇక్కడ సిద్ధం చేశారు. పిచ్ మధ్యలో పచ్చిక ఉండగా.. వికెట్‌కు ఇరు వైపులా పచ్చిక పూర్తిగా తొలగించారు. టెస్టు మ్యాచ్‌కు పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు ఉండనుండగా.. ఉదయం, సాయంత్రం సెషన్లు ఆహ్లాదకరంగా ఉండనున్నాయి.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కె.ఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా : ట్రావిశ్ హెడ్, ఉస్మాన్ ఖవాజ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్కాంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లయాన్, మాథ్యూ కునేమాన్/స్కాట్ బొలాండ్/లాన్స్ మోరీస్.