Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ 16కూ దూరమైన పేసర్
- త్వరలోనే వెన్నునొప్పికి శస్త్రచికిత్స
ముంబయి : టీమ్ ఇండియా పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా మరో ఆరు నెలలు ఆటకు దూరం కానున్నాడు!. వెన్నుకు స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో పలుమార్లు జాతీయ జట్టుకు దూరంగా ఉండిపోయిన జశ్‌ప్రీత్ బుమ్రా.. త్వరలోనే వెన్నునొప్పి గాయానికి సర్జీరీ చేయించుకోనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ, జాతీయ క్రికెట్ అకాడమీ వర్గాలు వెల్లడించాయి. గాయం తీవ్రత నేపథ్యంలో బీసీసీఐ వైద్య బృందం బుమ్రాకు సర్జరీ ఆప్షన్ ఇవ్వగా.. అందుకు బుమ్రా అంగీకరించినట్టు సమాచారం. బుమ్రా శస్త్రచికిత్సకు వెళ్తే కనీసం ఆరు నెలలు ఆటకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16 సీజన్లో అతడు ఆడే అవకాశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్, అంతకముందు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు దూరమైన బుమ్రా.. జూన్ 7న లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు సైతం అందుబాటులో ఉండే అవకాశం కనిపించటం లేదు. జాతీయ క్రికెట్ అకాడమీ బృందం బుమ్రా అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. బీసీసీఐ సైతం బుమ్రాకు వీలైనంత త్వరగా సర్జరీ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో బుమ్రాను ఆ లోగా పూర్తి ఫిట్నెస్తో సిద్ధంగా ఉంచేందుకు బోర్డు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పలుమార్లు గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చినా.. మళ్లీ గాయం తిరగబెట్టడంతో బుమ్రా ఎన్సీఏకు వెళ్లిపోయాడు. ఇటీవల ఎన్సీఏలో బుమ్రాకు మ్యాచ్ సిములేషన్స్ నిర్వహించగా అతడు తీవ్రంగా అలసిపోయినట్టు తెలిసింది. దీంతో బుమ్రా గాయానికి శస్త్రచికిత్స సరైన మార్గమని వైద్య బృందం సూచించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరఫున జశ్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ జోడీ పేస్ దాడిని చూసేందుకు ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.