Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పిన్ వ్యూహం బెడిసికొట్టింది!. జామ్తా, కోట్లలో మూడు రోజుల్లో ఆసీస్‌పై గెలుపొందిన టీమ్ ఇండియా.. హోల్కర్లో మూడు రోజుల్లో ఆసీస్‌కు మ్యాచ్‌ను అప్పజెప్పింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారూలు అలవోకగా ఛేదించారు. 9 వికెట్ల తేడాతో ఇండోర్ టెస్టులో విజయం సాధించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-2తో ఆసీస్ బోణీ కొట్టింది. ఈ విజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా బెర్త్ ఖరారు చేసుకుంది.
- మూడో టెస్టులో ఆసీస్ విజయం
- స్పిన్ పిచ్‌పై భారత్‌కు ఎదురుదెబ్బ
- సిరీస్‌లో 2-1తో తగ్గిన ఆధిక్యం
నవతెలంగాణ-ఇండోర్
మాయ లేదు. మ్యాజిక్ లేదు. రవీంద్రజాలం జాడలేదు. అశ్విన్ అద్భుతాలు అసలే లేవు. 76 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (49 నాటౌట్, 53 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్, 58 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 78 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియాకు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని కట్టబెట్టారు. భారత బౌలర్లలో అశ్విన్ (1/44) ఒక్కడే వికెట్ పడగొట్టాడు. స్పిన్ ట్రాక్‌పై భారత్‌ను 3/35, 8/64 ప్రదర్శనతో వణికించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకు న్నాడు. ఇండోర్ టెస్టులో విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 1-2తో భారత్ ఆధిక్యాన్ని కుదించింది. సిరీస్‌ను సొంతం చేసుకునే అవకాశం చేజారినా.. కనీసం సమం చేసుకునే ఆశలు సజీవంగా నిలుపుకుంది. భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు అహ్మదాబాద్‌లో మార్చి 9 నుంచి ఆరంభం కానుంది.
ఆసీస్ అలవోకగా
ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా ముందున్న లక్ష్యం 76 పరుగులే. అయినా.. భారత శిబిరంలో ఏదో ఆశ. అందుకు కారణం, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఆరు వికెట్లను భారత్ 11 పరుగులకే పడగొట్టింది. 34 బంతుల వ్యవధిలో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌ను మడతపెట్టింది. ఇదే తరహా ప్రదర్శన మూడో రోజు ఆటలో పునరావృతం చేయగలిగితే.. 76 పరుగులనూ కాపాడుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్టే ఇన్నింగ్స్ రెండో బంతికే ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్రేక్ సాధించాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (0)ను సున్నా పరుగులకే పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. మరో ఎండ్ నుంచి జడేజా తోడైతే కంగారూలపై ఒత్తిడి పెంచటం పెద్ద కష్టం కాబోదని అనిపించింది.
నం.3 బ్యాటర్ మార్నస్ లబుషేన్ (28 నాటౌట్)తో జతకట్టిన మరో ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (49 నాటౌట్) ప్రణాళికలు భిన్నంగా సాగాయి. అతడు భారత బౌలర్లపై ఆత్మరక్షణ ధోరణిలో ఆడేందుకు నిరాకరించాడు. అశ్విన్, జడేజా, ఉమేశ్ యాదవ్‌లపై ఎదురుదాడి చేశాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో మార్నస్ లబుషేన్ సైతం ఆరు బౌండరీల సాయంతో 28 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరు క్రీజులో సులువుగా పరుగులు పిండుకోవటంతో చిన్న లక్ష్యం చిటికెలో కరిగిపోయింది. 18.5 ఓవర్లలోనే మరో వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది. క్లీన్‌స్వీప్ అవమానం తప్పదనే భావనలో ఉన్న కంగారూ శిబిరం.. ఇండోర్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్ ట్రాక్‌పై స్పిన్‌తోనే భారత్‌కు దీటైన జవాబు ఇచ్చింది!.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 109/10
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 197/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 163/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : ఉస్మాన్ ఖవాజ (సి) శ్రీకర్ భరత్ (బి) అశ్విన్ 0, ట్రావిశ్ హెడ్ నాటౌట్ 49, మార్నస్ లబుషేన్ నాటౌట్ 28, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 78.
వికెట్ల పతనం : 1-0.
బౌలింగ్ : రవిచంద్రన్ అశ్విన్ 9.5-3-44-1, రవీంద్ర జడేజా 7-1-23-0, ఉమేశ్ యాదవ్ 2-0-10-0.
ఫైనల్లో ఆసీస్ అడుగు
ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌తో మూడో టెస్టులో గెలుపొందిన ఆస్ట్రేలియా.. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో నేరుగా బెర్త్ ఖాయం చేసుకుంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది. ఫైనల్స్ రేసులో ముందున్న టీమ్ ఇండియా.. ఇండోర్ పరాజయంతో ఒత్తిడిలో పడింది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధిస్తేనే భారత్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోకి నేరుగా చేరనుంది. లేదంటే, ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక టెస్టు సిరీస్‌లో లంకేయులు 2-0తో సిరీస్‌ను స్వీప్చేస్తే.. అప్పుడు ఆస్ట్రేలియాతో శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడుతుంది. అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఓడినా.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ ఒక్క టెస్టులో గెలుపొందిన అప్పుడు టీమ్ ఇండియా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సమీకరణాలతో పని లేకుండా దర్జాగా ఫైనల్లో అడుగు పెట్టాలంటే మాత్రం అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియాపై విజయం సాధించటం ఒక్కటే మార్గం.
పిచ్ 'పేలవం'
భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు పిచ్‌కు ఐసీసీ మ్యాచ్ రిఫరీ 'పేలవం' అంటూ రేటింగ్ ఇచ్చారు. ఇండోర్ హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మూడో రోజు తొలి సెషన్ మధ్యలోనే ముగిసింది. టెస్టు మ్యాచ్ ఆరంభం నుంచీ పిచ్ స్పిన్‌కు సహకరించింది, బంతికి బ్యాట్‌కు సమతూకం అందించలేదని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తన నివేదికలో పేర్కొన్నాడు. పిచ్ పేలవం అని తేల్చిన రిఫరీ.. మూడు డీమెరిట్ పాయింట్లను సైతం జరిమానాగా విధించాడు. ఐదు డీ మెరిట్ పాయింట్లు అయితే, ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం చేజారుతుంది. ' పిచ్ పొడిగా ఉంది. బంతికి, బ్యాట్‌కు సమతూకం లేదు. ఆరంభం నుంచీ స్పిన్‌కు అనుకూలించింది. మ్యాచ్‌లో పడిన ఐదో బంతికే పిచ్ ఉపరితలం పగుళ్లు వచ్చేసింది. సీమ్ లేదు, అనూహ్య బౌన్స్ కనిపించింది' అని క్రిస్ బ్రాడ్ నివేదికలో రాశాడు. రిఫరీ నివేదికపై బీసీసీఐ 14 రోజుల్లో సవాల్ చేయవచ్చు. లేదంటే, 3 డీ మెరిట్ పాయింట్లను అంగీకరించాల్సి ఉంటుంది. తొలి రెండు టెస్టులు సైతం మూడు రోజుల్లోనే ముగిసినా.. ఆ పిచ్‌లను సాధారణం అని రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ రేటింగ్ ఇచ్చారు.