Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌పై శ్రీలంక టెస్ట్ సిరీస్‌ను నెగ్గడం కష్టమే!
అహ్మదాబాద్: ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు చేరే ఛాన్స్ ఎక్కువశాతం భారత్‌వైపే ఉన్నాయి. ఆస్ట్రేలియాజట్టు ఇండోర్ టెస్ట్‌లో భారత్‌ను ఓడించి డబ్ల్యుటిసి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా.. మరో స్థానం కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా.. మూడో టెస్ట్‌లో అనూహ్యంగా ఓటమిపాలై డబ్ల్యుటిసి ఫైనల్ బెర్త్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం(9నుంచి) ఆస్ట్రేలియాతో జరిగే నాల్గో టెస్ట్‌లో భారతజట్టు గెలిస్తే సమీకరణాలతో నిమిత్తం లేకుండా నేరుగా ఫైనల్‌కు చేరనుంది. ఒకవేళ ఆ టెస్ట్‌లో భారత్ ఓడినా, కనీసం డ్రా చేసుకున్నా.. శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ఫలితం కోసం వేచిచూడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌తో శ్రీలంక రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది. ఆ పర్యటనలో శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. ఇరుజట్ల మధ్య ఈనెల 9నుంచే క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టెస్ట్, 17నుంచి వెల్లింగ్టన్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. న్యూజిలాండ్ గడ్డపై ఆ జట్టును శ్రీలంక ఓడించడం కత్తిమీద సాము వంటిదే. ఒకవేళ ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులోనూ భారత్ ఓటమిపాలై, న్యూజిలాండ్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే శ్రీలంక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి భారత్, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుండగా.. అదేరోజు క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక తొలి టెస్టూ జరగనుంది. ఇక జూన్ 7-11 మధ్య లండన్‌లోని ఓవెల్ మైదానంలో డబ్ల్యుటిసి ఫైనల్ జరగనుండగా.. జూన్ 12ను రిజర్వ్ డేగా ఐసిసి ప్రకటించింది.
సమీకరణలు..
1. నాల్గో టెస్ట్‌లో భారత్ గెలిస్తే నేరుగా డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరుతుంది. దీంతో భారత్(60.29%) విజయ శాతాలతో రెండో స్థానంలో నిలుస్తుంది.
మరోవైపు శ్రీలంక(53.33%)తో న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గినా.. మూడోస్థానానికే పరిమితమౌతుంది.
2. నాల్గో టెస్ట్‌ను భారత్ ఓడినా.. డ్రా చేసుకున్నా.. శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలిస్తే.. భారత్ మూడో స్థానానికి పడిపోయి, శ్రీలంక జట్టు రెండోస్థానానికి ఎగబాకి డబ్ల్యుటిసి ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది.
3. భారత్ నాల్గో టెస్ట్‌లో ఓడి.. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక సిరీస్‌ను చేజార్చుకున్నా.. టీమిండియాకే ఫైనల్స్ బెర్త్ దక్కనుంది.
4. శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసుకుంటేను డబ్ల్యుటిసి బెర్త్ దక్కనుంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1, 0-0తో డ్రా చేసుకున్నా.. 0-2తో పరాజయాన్ని చవిచూసినా భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లనుంది.