Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ నేటినుంచే..
- ముఖ్య అతిథులు ఇరుదేశాల ప్రధానులు
- ఉదయం 9.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
అహ్మదాబాద్: డబ్ల్యుటిసి ఫైనల్ బెర్త్ లక్ష్యంగా టీమిండియా.. ఆస్ట్రేలియాతో నాల్గో టెస్ట్‌కు సిద్ధమౌతోంది. ఇరుజట్ల మధ్య గురువారం నుంచి జరిగే టెస్ట్‌లో భారతజట్టు గెలిస్తే.. నేరుగా డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరుతుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ టెస్ట్‌కు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ హాజరుకానున్నారు. వీరిద్దరు కలిసి తొలిరోజు ఆటను వీక్షించనున్నారు. నూతనంగా నిర్మించిన ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఒక అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరిగిన దాఖాలాలు లేవు. దీంతో పిచ్ బౌలర్లకా, బ్యాటర్లకు సహకరిస్తుందనే విషయమై స్పష్టతలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో భారత్ రెండింటిలో, ఆస్ట్రేలియా ఒక టెస్ట్‌లో గెలిచిన సంగతి తెలిసిందే.
ముఖ్య అతిథులుగా మోడీ, ఆల్బనీస్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే టెస్టుకు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించనున్నారు. అత్యధిక సీట్ల సామర్థ్యం(1,32,000) గల ఈ మైదానంలో ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే ప్రథమం.
శ్రీకర్ భరత్‌కు ద్రావిడ్ మద్దతు..
వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ మద్దతు తెలిపాడు. గత మూడు టెస్టుల్లో బ్యాటింగ్‌లో నిరాశపరుస్తుండడంతో అతడిపై వేటు తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే మరో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అహ్మదాబాద్ టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అతడి శిక్షణను టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం. అయినా రాహుల్ ద్రావిడ్ మాత్రం భరత్‌కు మద్దతుగా నిలుస్తూ మీడియాతో మాట్లాడాడు. ''భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదు. అతడి దృక్పథంపై మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి. సవాళ్లు, పరిస్థితులను అర్థం చేసుకొని ఆడేందుకు ప్రయత్నిస్తాడు. మూడో టెస్టులో భరత్ గొప్పగా రాణించనప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో అతడు చేసిన 17 పరుగులు మాత్రం చాలా కీలకం. ఢిల్లీలోనూ చాలా పాజిటివ్‌గా ఆడాడు. కఠినమైన పిచ్‌లపై కాస్త అదృష్టం కలిసిరావాల్సి ఉంటుంది. కానీ, భరత్‌కు అదే కలిసిరాలేదు. అయితే, అతడు ఆడే విధానం బాగుంది. అందుకే భరత్ బ్యాటింగ్‌పై ఆందోళన చెందకుండా మరింత దృష్టిపెడతాం'' అనిద్రావిడ్ తెలిపాడు.
జట్ల(అంచనా)..
ఇండియా: రోహిత్(కెప్టెన్), శుభ్‌మన్/కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లి, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), శ్రేయస్, జడేజా, అక్షర్, అశ్విన్, షమీ, ఉనాద్కట్/సిరాజ్.
ఆస్ట్రేలియా: స్మిత్(కెప్టెన్), క్యారీ(వికెట్ కీపర్), హెడ్, ఖవాజా, లబూషేన్, హ్యాండ్‌కోంబ్, గ్రీన్, స్టార్క్, మర్ఫీ, కుహ్నెమన్, లియాన్.