Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ 0, ఎటికె మోహన్ బగాన్ 0
- ఇండియన్ సూపర్ లీగ్ 2023
నవతెలంగాణ, హైదరాబాద్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2023 రెండో సెమీఫైనల్ తొలి అంచె పోరు డ్రాగా ముగిసింది. డిఫెన్స్‌లో అగ్ర జట్లు హైదరాబాద్ ఎఫ్‌సీ, ఎటికె మోహన్ బగాన్లు ప్రత్యర్థులకు గోల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తొలి అంచె సెమీఫైనల్ పోరులో గోల్ నమోదు కాకపోవటంతో 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో 51 శాతం బంతిని నియంత్రించిన హైదరాబాద్ ఎఫ్‌సీ.. ఎదురుదాడిలో రెచ్చిపోయింది. ఏకంగా 14 సార్లు ఎటికె మోహన్ బగాన్ గోల్ పోస్ట్‌పై దాడి చేసింది. ప్రథమార్థంలో స్టార్ ఆటగాడు ఒగ్బాచే లేకపోయినా హైదరాబాద్ గోల్ దిశగా దూసుకెళ్లింది. ద్వితీయార్థం ఆట 60వ నిమిషంలో ఒగ్బాచే మైదానంలోకి రావటంతో హైదరాబాద్ ఎఫ్‌సీ గోల్ ఆశలు చిగురించాయి. కానీ బాక్స్ లోపల బంతిని అందుకునేందుకు ఒగ్చాచే ఇబ్బంది పడ్డాడు. అతడికి సరైన పాస్ ఇవ్వటంలో సహచరులు సైతం విఫలమయ్యారు. దీంతో 90 నిమిషాల పూర్తి ఆటకు తోడు ఐదు నిమిషాల అదనపు సమయంలోనూ ఇరు జట్లు గోల్ చేయటంలో విఫలమయ్యాయి. దీంతో మార్చి 13న కోల్‌కతలో జరుగనున్న రెండో అంచె సెమీఫైనల్ పోరు ఇరు జట్లకు నాకౌట్‌గా మారనుంది. ఇండియన్ సూపర్ లీగ్‌లో సెమీఫైనల్లో రెండు సార్లు తలపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచుల అనంతరం గోల్స్ వ్యత్యాసంతో మెరుగైన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. తొలి అంచె సెమీఫైనల్లో ఏ జట్టుకూ ఆధిక్యం లభించలేదు. దీంతో రెండో సెమీఫైనల్లోనే ఫైనల్స్ బెర్త్ ఖరారు కానుంది.