Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్, ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు హాజరయ్యారు. భారత ప్రధాని నరెంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోని ఆల్బనిస్లు అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో సందడి చేశారు. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ స్నేహ బంధానికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా.. 75 ఏండ్ల క్రికెట్ మైత్రిని ఇద్దరు ప్రధానులు సెలబ్రేట్ చేశారు. బాహుబలి స్టేడియంలో ల్యాప్ ఆఫ్ హానర్ తీసుకున్న మోడీ, ఆంటోనిలు.. టాస్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లను క్యాప్‌లు అందజేశారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రధాని మోడీ టోపీ అందివ్వగా.. తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఆ దేశ ప్రధాని ఆంటోని బ్యాగీ గ్రీన్ టోపీ అందించారు. అనంతరం ఇరువురు ప్రధానులు ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రుల రాకతో నాల్గో టెస్టు మ్యాచ్ టాస్ కాస్త ఆలస్యమైంది. గ్రామీ అవార్డు గ్రహీత ఇండో అమెరికన్ గాయకుడు ఫాల్గుణి షా పలు పాపులర్ గీతాలను ఆలపించగా, స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనిని సత్కరించగా, భారత ప్రధాన మంత్రి నరెంద్ర మోడిని బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షా సన్మానించారు. కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, గుజరాత్ క్రికెట్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.