Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ఇన్నింగ్స్‌లో 444 పరుగుల వెనుకంజ
- భారత్ తొలి ఇన్నింగ్స్ 36/0
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 480/10
- కామెరూన్ గ్రీన్ కెరీర్ తొలి సెంచరీ
- ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు ఆరు వికెట్లు
- భారత్,ఆసీస్ నాల్గో టెస్టు రెండో రోజు
మోతెరా మైదానంలో సంప్రదాయ టెస్టు క్రికెట్ జోరు నడుస్తుంది!. బ్యాటర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఉస్మాన్ ఖవాజ (180), కామెరూన్ గ్రీన్ (114) శతకాల మోత మోగించారు. టెయిలెండర్లు సైతం పరుగుల వేటలో కదం తొక్కగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 36/0తో ఆడుతుంది. చివరి టెస్టును రక్తి కట్టించటం ఇప్పుడు భారత బ్యాటర్ల చేతుల్లోనే ఉంది. నేడు మనోళ్లు మెరిస్తే.. అహ్మదాబాద్ టెస్టు ఆసక్తికరంగా మారనుంది!.
నవతెలంగాణ-అహ్మదాబాద్
జీవం లేని పిచ్‌పై ఆస్ట్రేలియా పరుగుల పండుగ చేసుకుంది. స్పిన్, సీమ్, పేస్‌కు ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై ఆసీస్ టెయిలెండర్లు సైతం రాణించారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (180, 422 బంతుల్లో 21 ఫోర్లు) మారథాన్ ఇన్నింగ్స్‌కు తోడు కామెరూన్ గ్రీన్ (114, 170 బంతుల్లో 18 ఫోర్లు) కెరీర్ తొలి సెంచరీతో చెలరేగటంతో తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐదో వికెట్‌కు ఖవాజ, కామెరూన్ 208 పరుగులు జోడించగా.. తొమ్మిదో వికెట్‌కు నాథన్ లయాన్ (34), టాడ్ మర్ఫీ (41) 70 పరుగులు జోడించారు. టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (6/91) ఆరు వికెట్ల ప్రదర్శనతో మాయ చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 36/0తో శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్ (18 బ్యాటింగ్) అజేయంగా ఆడుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 444 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.
తొలి సెషన్ : ఖవాజ, గ్రీన్ దూకుడు
రెండో రోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా ఏకపక్ష జోరు కనిపించింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజ, కామెరూన్ గ్రీన్ పరుగుల వేటలో దూకుడుగా ఆడారు. కామెరూన్ గ్రీన్ 8 బౌండరీలతో 67 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. మరో ఎండ్‌లో ఉస్మాన్ ఖవాజ చెక్కుచెదరని ఏకాగ్రత భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలువగా.. కామెరూన్ గ్రీన్ దూకుడు చూపించాడు. తొలి రోజు చివరి సెషన్ ఉత్సాహం కొనసాగించిన ఈ జోడీ ఉదయం సెషన్లో ఏకంగా 92 పరుగులు పిండుకుంది. ఉదయం సెషన్లో సీమ్‌తో వికెట్లపై గురిపెట్టిన రోహిత్‌సేనకు నిరాశ తప్పలేదు. ఉస్మాన్ ఖవాజ సైతం 20 బౌండరీల సాయంతో 346 బంతుల్లో 150 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. కామెరూన్ గ్రీన్, ఉస్మాన్ ఖవాజ దూకుడుతో తొలి సెషన్లో భారత్‌కు వికెట్ దక్కలేదు.
రెండో సెషన్ : అశ్విన్ మాయజాలం
లంచ్ విరామం అనంతరం టీమ్ ఇండియా మ్యాచ్‌లోకి వచ్చింది. ట్రంప్‌కార్డ్ అశ్విన్ మాయ చేయటం మొదలెట్టాడు. దీంతో ఈ సెషన్లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. 16 ఫోర్లతో 143 బంతుల్లోనే శతకం బాదిన కామెరూన్ గ్రీన్.. కెరీర్లో తొలిసారి మూడంకెల స్కోరు అందుకున్నాడు. 60 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఖవాజ, గ్రీన్ జోడి 208 పరుగులు పిండుకుంది. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోరు నుంచి భారీ స్కోరు సాధించింది. ఆసీస్‌ను ముందంజలో నిలిపిన ఈ జోడీని ఎట్టకేలకు అశ్విన్ విడదీశాడు. ఒకే ఓవర్లో కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (0)లను అవుట్ చేసి భారత్‌కు ఊరట కలిగించాడు. మిచెల్ స్టార్క్ (6) సైతం అశ్విన్ మాయలో పడ్డాడు. రెండో సెషన్లో భారత్ మూడు వికెట్లు పడగొట్టగా, ఆస్ట్రేలియా 62 పరుగులు ఖాతాలో వేసుకుంది.
మూడో సెషన్ : అశ్విన్‌కు ఆరు వికెట్లు
టీ విరామం అనంతరం ఉస్మాన్ ఖవాజ (180) మారథాన్ ఇన్నింగ్స్‌కు తెర పడింది. అక్షర్ పటేల్ ఓవర్లో ఖవాజ ఎల్బీ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించాడు. సమీక్షకు వెళ్లిన భారత్ ఖవాజను డిఆర్ఎస్ సాయంతో పెవిలియన్‌కు చేర్చింది. ఖవాజ నిష్క్రమణతో ఆసీస్ కథ ముగిసిందని అనుకుంటే.. టెయిలెండర్లు తలనొప్పిగా మారారు. నాథన్ లయాన్ (34, 96 బంతుల్లో 6 ఫోర్లు), టాడ్ మర్ఫీ (41, 61 బంతుల్లో 5 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. లయాన్ క్రీజులో సౌకర్యవంతంగా కనిపించాడు. మర్ఫీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ ఇద్దరి కథకు తెరదించిన అశ్విన్.. ఆరు వికెట్ల ప్రదర్శన పూర్తి చేశాడు. 167.2 ఓవర్లలో 480 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.
ఓపెనర్ల శుభారంభం : రెండో రోజు చివరి సెషన్లో సైతం పిచ్ నుంచి బౌలర్లకు ఎటువంటి అనుకూలత కనిపించలేదు. టీమ్ ఇండియా ఓపెనర్లు సహజంగానే స్వేచ్ఛగా, దూకుడుగా ఆడారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (18 బ్యాటింగ్, 27 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) దూకుడు ప్రదర్శించాడు. నాథన్ లయాన్పై క్రీజు బయటకు వచ్చి భారీ సిక్సర్ బాదాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (17 బ్యాటింగ్, 33 బంతుల్లో 2 ఫోర్లు) సాధికారిక ప్రదర్శన చేశాడు. ఓపెనర్లు నిలకడగా రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో భారత్ 36 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : హెడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 32, ఖవాజ (ఎల్బీ) అక్షర్ 180, లబుషేన్ (బి) షమి 3, స్మిత్ (బి) జడేజా 38, హ్యాండ్స్కాంబ్ (బి) షమి 17, కామెరూన్ (సి) భరత్ (బి) అశ్విన్ 114, అలెక్స్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 0, స్టార్క్ (సి) అయ్యర్ (బి) అశ్విన్ 6, లయాన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 34, మర్ఫీ (ఎల్బీ) అశ్విన్ 41, కునేమాన్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలటు : 15, మొత్తం : (167.2 ఓవర్లలో ఆలౌట్) 480.
వికెట్ల పతనం : 1-61, 2-72, 3-151, 4-170, 5-378, 6-378, 7-387, 8-409, 9-479, 10-480.
బౌలింగ్ : షమి 31-3-134-2, ఉమేశ్ 25-2-105-0, అశ్విన్ 47.2-15-91-6, జడేజా 35-5-89-1, అక్షర్ 28-8-47-1, అయ్యర్ 1-0-2-0.
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ బ్యాటింగ్ 17, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ 18, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (10 ఓవర్లలో) 36.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 3-1-7-0, కామెరూన్ గ్రీన్ 2-0-11-0, నాథన్ లయాన్ 3-0-14-0, మాథ్యూ కునేమాన్ 2-0-3-0.
వికెట్ల వేటలో మాయగాడు
టీమ్ ఇండియా ట్రంప్‌కార్డ్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శనతో అశ్విన్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ 28.10 సగటు, 2.71 ఎకానమీతో 113 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రోఫీలో అశ్విన్ అత్యుత్తమ గణాంకాలు 7/103. అహ్మదాబాద్ టెస్టులో అశ్విన్ 91 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి మరో ఉత్తమ ప్రదర్శన చేశాడు. ట్రావిశ్ హెడ్ (32), కామెరూన్ గ్రీన్ (114), అలెక్స్ కేరీ (0), మిచెల్ స్టార్క్ (6), నాథన్ లయాన్ (34), టాడ్ మర్ఫీ (41) వికెట్లను అశ్విన్ ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ సైతం 113 వికెట్లు పడగొట్టినా.. అతడు 26 మ్యాచుల్లో 31.92 సగటు, 3.09 ఎకానమీతో సాధించటంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. భారత స్పిన్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే (111), హర్బజన్ సింగ్ (95), రవీంద్ర జడేజా (85) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాడ్ మర్ఫీ వికెట్‌తో ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేసిన అశ్విన్.. ఆ ఘనతను కెరీర్లో 32వ సారి సాధించాడు. స్వదేశంలో 26వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అనిల్ కుంబ్లే (25) రికార్డును అధిగమించాడు. తాజా సిరీస్‌లో 24 వికెట్లు కూల్చిన అశ్విన్.. వికెట్ల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.