Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియా మేనేజ్మెంట్ కలవరం
నవతెలంగాణ క్రీడా ప్రతినిధి
ఈ ఏడాది ఆఖర్లో భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనున్నది. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ పటిష్ట జట్టును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా.. మరోవైపు ఆటగాళ్ల బెడద మేనేజ్మెంట్కు కలవరపాటుకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిన వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నాల్గో టెస్ట్‌లో గాయపడ్డాడు. ఈ టోర్నమెంట్‌కు ముందు భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. నాల్గో టెస్ట్ సందర్భంగా శ్రేయస్‌కు గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఆ టెస్ట్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. అదే క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. గాయంతో వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ నెలాఖరులో ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) కూడా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అతడు బెంగళూరులోని నేషనల్ అకాడమీలో కోలుకుంటున్న ఫిట్‌నెస్‌కు కసరత్తులు చేస్తున్నా.. ఫిట్నెస్ సాధిస్తేనే ఐపిఎల్ బరిలోకి దిగనున్నాడు. లేని పక్షంలో ఈ సీజన్ ఐపీఎల్‌కూ అతడు దూరమైనట్లే..
జస్ప్రీత్ బుమ్రా..
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఏడాదిగా జాతీయ జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అందుకు ప్రధాన కారణం.. భుజానికి శస్త్ర చికిత్స చేసుకొని అతడూ ఎన్సీఏలోనే ఫిట్నెస్కోసం చెమటోడ్చుతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు ఫిట్నెస్ సాధించినా.. టీమిండియా మేనేజ్మెంట్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడ్ని ఆ సిరీస్‌కు దూరంగా ఉంచింది. గత ఏడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా బుమ్రా భుజానికి తీవ్ర గాయం కావడంతో ఆ తర్వాత మైదానంలోకి దిగలేదు. అలాగే దీపక్ చాహర్ కూడా ఎన్సీఏలోనే ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా వన్డే ప్రపంచకప్ జట్టు రేసులో ఉన్నా.. అతడూ గాయం పడ్డట్లు తెలిసింది. వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా జట్టులో చోటు సాధించాలంటే ఓ ఆటగాడు కనీసం 30అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలన్న నిబంధనను టీమిండియా మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ప్రసిధ్ కృష్ణకు చోటు దక్కడం కష్టమే. ప్రసిధ్ కృష్ణ గత ఏడాది ఆగస్టులో జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో చివరిసారిగా ఆడాడు. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా మేనేజ్మెంట్ సుమారు 18 నుంచి 20మంది ఆటగాళ్ల షార్ట్ లిస్ట్‌ను సిద్ధం చేస్తోంది. ఇక ఆవేశ్ ఖాన్ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియాకప్ టోర్నీ అనంతరం మళ్లీ జాతీయజట్టు చోటు దక్కించుకున్న దాఖలాలు లేవు.
జడేజా పునరాగమనం..
శస్త్ర చికిత్స కారణంగా ఏడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుంచి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అతడు కూడా భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని చాలాకాలం జట్టుకు దూరంగా ఉండి, ఎన్సీఏలో ఫిట్నెస్ సాధించి జాతీయ జట్టులో చోటు దక్కించుకన్నాడు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు ఫిట్నెస్ సాధిస్తుంటే జాతీయ జట్టులోకి తిరిగి వచ్చి చేరుతుంటే.. మరోవైపు ఆటగాళ్లు గాయాలబారినపడి జట్టుకు దూరమౌతున్న పరిస్థితి ఎదురవుతోంది. గాయాలబారిన పడి జట్టుకు దూరమౌతున్న ఆటగాళ్లలో ఎక్కువమంది పేస్ బౌలర్లు ఉండడం టీమిండియా మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేస్తోంది.