Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2019 నుంచి ఆరుగురు పేసర్లు టీమ్ ఇండియాపై వైట్‌బాల్ క్రికెట్లో ఐదు వికెట్లు పడగొట్టారు. 2020 నుంచి ప్రతి ఏడాది భారత్ వైట్‌బాల్ ఫార్మాట్లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆధునిక క్రికెట్లో అగ్ర జట్టుగా కొనసాగుతున్న టీమ్ ఇండియా ఎందుకు ఏకపక్షంగా మ్యాచ్‌ను కోల్పోతుంది? లెఫ్ట్ ఆర్మ్ సీమర్లను ఎదుర్కొవటంలో తరచుగా ఎందుకు వైఫల్యం చెందుతుంది? 2023 వన్డే వరల్డ్‌కప్ ముంగిట భారత జట్టును ఇది ఆందోళనకు గురి చేస్తుంది!.
- లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌కు బ్యాటర్లు విలవిల
- ఆందోళన కలిగిస్తోన్న వైఫల్యం
నవతెలంగాణ క్రీడావిభాగం
విశాఖ తీరంలో భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే పోరు. ఆదివారం కుండపోత వర్షంతో ఆరంభం కావటంతో 100 ఓవర్ల మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. రోజంతా వర్ష సూచనలు ఉండటంతో కుదించిన ఓవర్ల మ్యాచ్‌పై అంచనాలు నెలకొన్నాయి. వరుణుడు అడ్డుతగిలినా.. కనీసం టీ20 మ్యాచ్ తరహా పోరాటమైనా చూడవచ్చని అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి స్టేడియానికి తరలివచ్చారు. టాస్ అనంతరం వరుణుడు రాలేదు. అయినా, మ్యాచ్ 100 ఓవర్ల పాటు సాగలేదు. కనీసం 40 ఓవర్ల ఆటనైనా అభిమానులు చూడలేకపోయారు. మిచెల్ స్టార్క్, సీన్ అబాట్ విజృంభణతో భారత ఇన్నింగ్స్ 26 ఓవర్లకే ముగియగా.. మిచెల్ మార్ష్, ట్రావిశ్ హెడ్ దంచికొట్టడంతో ఆస్ట్రేలియా ఛేదనను 11 ఓవర్లలోనే తేల్చేసింది. 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు పరాజయం పాలవగా.. మిగిలిన బంతుల (234) పరంగా వన్డేల్లో ఇండియాకు ఇదే భారీ ఓటమి. ఆటలో గెలుపోటమలు సహజం. కానీ అగ్రజట్టుగా కొనసాగుతూ కనీస పోటీ ఇవ్వకుండా ఓటమి పాలవటం, నిలకడగా లెఫ్ట్ ఆర్మ్ సీమర్లకు దాసోహం కావటం అత్యంత ఆందోళనకరం.
ఈనాటి బలహీనత కాదు!
ఎడమ చేతి వాటం పేసర్లను ఎదుర్కొవటంలో టీమ్ ఇండియా బలహీనత ఇప్పటిది కాదు. భారత జట్టు ఏండ్లుగా లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌ను ఆడేందుకు ఇబ్బంది పడుతోంది. గతంలో చాలా మంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు భారత బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఎడతెగని వర్షంతో రెండు రోజులుగా కవర్లతో కప్పి ఉంచిన పిచ్‌పై దాగి ఉన్న తేమను ఆసీస్ గొప్పగా సద్వినియోగం చేసుకుంది. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై కవర్లను తీసేయగా.. తొలుత ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఫుల్ లెంగ్త్ బంతులతో, బంతిని వికెట్ల మీదకు స్వింగ్ చేసిన మిచెల్ స్టార్క్ భారత ఇన్నింగ్స్‌ను శాసించాడు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్‌లను పవర్‌ప్లే లోపే పెవలియన్‌కు చేర్చి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌ను ఎదుర్కొనేందుకు రైట్ ఆర్మ్ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ప్రణాళికలకు పదును పెట్టలేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లలో ఒకరిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించి ఉంటే భారత్ ఇన్నింగ్స్ భిన్నంగా సాగేది. కుడి చేతి బ్యాటర్లు తడబడిన చోట.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అక్షర్ పటేల్ అలవోకగా పరుగులు పిండుకున్నాడు. ఓ ఎండ్‌లో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ విషయంలో పొరపాటు చేశారు. మిచెల్ స్టార్క్‌కు సీన్ అబాట్ తోడవగా భారత్ 117 పరుగులకే కుప్పకూలింది. స్వదేశంలో భారత్‌కు ఇది నాల్గో అత్యల్ప స్కోరు. అయితే, లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఆడటంలో భారత బ్యాటర్ల బలహీనత కొత్త కాదు. గతంలోనూ (2019 నుంచి) ఆరుగురు సీమర్లు భారత్‌పై 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగారు. అందులో నలుగురు ఎడమ చేతి వాటం పేసర్లు రీసీ టాప్లే, ట్రెంట్ బౌల్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, మిచెల్ స్టార్క్ ఉన్నారు.
వ్యూహం మారితేనే!
2020లో ఆసీస్ వన్డేలో 10 వికెట్లతో, 2021 పాకిస్థాన్ టీ20లో పది వికెట్లతో, 2022లో ఇంగ్లాండ్ 10 వికెట్లతో, 2023లో ఆస్ట్రేలియా వన్డేలో పది వికెట్ల తేడాతో భారత్‌పై ఏకపక్ష విజయాలు సాధించాయి. 2023 ప్రపంచకప్ కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచకప్ పోరులో టాప్లీ, ట్రెంట్‌బౌల్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, మిచెల్ స్టార్క్ సహా షహీన్ షా ఆఫ్రిది, మార్కో జాన్సెన్లను సైతం భారత్ ఎదుర్కొవాల్సి ఉంది. గతంలో షహీన్ షా, జాన్సెన్లు భారత్‌పై రాణించారు. ప్రపంచకప్ సమయంలో వర్షం ప్రభావిత మ్యాచుల్లోనైనా లెఫ్ట్ ఆర్మ్ సీమర్లు భారత్‌కు ప్రమాదకరంగా మారనున్నారు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్లను ఎదుర్కొనేందుకు జట్టు మేనేజ్మెంట్ మెరుగైన కౌంటర్ ప్రణాళిక సిద్ధం చేయాలి. కనీసం లెఫ్ట్ ఆర్మ్ సీమర్ల దూకుడుకు ముకుతాడు వేసేందుకు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ముందుకు పంపించాలి. లేదంటే, లెఫ్ట్ ఆర్మ్ సీమర్ల స్వింగ్‌కు భారత్ రానున్న వరల్డ్‌కప్‌లో భారీ మూల్యం చెల్లించటం తప్పదేమో!.