Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఆసీస్ అమీతుమీ నేడు
- చెపాక్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే
- సిరీస్ విజయంపై ఇరు జట్ల గురి
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
2019 నుంచి స్వదేశంలో టీమ్ ఇండియా వన్డే సిరీస్‌ను కోల్పోలేదు. చివరగా అరోన్ ఫించ్‌సేన ఐదు వన్డేల సిరీస్‌ను 0-2 వెనుకంజ నుంచి పుంజుకుని గెల్చుకుంది. 2023లో 2019 ఫలితం పునరావృతం చేసేందుకు కంగారూలు సిద్ధమవు తుండగా.. చెన్నై చెపాక్‌లో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టి వన్డే సిరీస్‌ను సాధించేందుకు రోహిత్‌సేన సిద్ధమవుతోంది. ఇరు జట్లు సిరీస్ విజయంపై కన్నేయటంతో నేడు నిర్ణయాత్మక మూడో వన్డే రసవత్తరంగా సాగనుంది.
నవతెలంగాణ-చెన్నై
స్వింగ్, సీమ్.. వాంఖడే, విశాఖ వన్డేల్లో హల్చల్ చేశాయి. భారత్‌లో ఓ వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో 200 ప్లస్ పరుగులు చేయకపోవటం బహుశా ఇదే తొలిసారి కాబోలు!. పేసర్లు విజృంభించిన సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో బ్యాటర్లకు, స్పిన్నర్లకు పెద్దగా పని లేకుండా పోయింది. కానీ ఎం.ఏ చిదంబరం స్టేడియం స్పిన్ మలుపులు తిరిగేందుకు ముస్తాబైంది. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించనున్న నిర్ణయాత్మక వన్డేలో నెగ్గి భారత్ సిరీస్ సాధిస్తుందా?లేదంటే మరోసారి భారత్‌పై వన్డే సిరీస్‌ను ఆసీస్ సొంతం చేసుకుంటుందా? ఆసక్తికరం.
మెరుస్తారా?
సొంతగడ్డపై మన బ్యాటర్లు పవర్‌ప్లేలోనే చేతులెత్తేయటం చాలా అరుదు. మిచెల్ స్టార్క్ సీమ్ అనుకూల పరిస్థితుల్లో గొప్ప ప్రభావం చూపించాడు. కానీ చెపాక్‌లో పరిస్థితులు భిన్నం. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలు మంచి ఫామ్‌లో ఉన్నారు. పరుగుల పిచ్‌పై ఈ ముగ్గురిని నిలువరించటం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. టీ20ల్లో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో తేలిపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేని వేళ సూర్యకుమార్‌కు అవకాశాలు సులువుగా దక్కుతున్నా.. ఈ ఫార్మాట్లో సూర్య తనదైన ఇన్నింగ్స్ నమోదు చేయాల్సి ఉంది. అక్షర్‌పటేల్ బ్యాట్‌తో గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. అక్షర్ బ్యాటింగ్ సామర్థ్యం వాడుకోవటంతో పాటు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ స్టార్క్‌కు చెక్ పెట్టేందుకు అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించాలి. రవీంద్ర జడేజాకు తోడు వాషింగ్టన్ సుందర్ నేడు తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
వార్నర్ రాక
లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ రెండు వన్డేల్లో భారత్‌ను వణికించాడు. వాంఖడేలో 3, విశాఖలో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. సీన్ అబాట్, నాథన్ ఎలిస్ సైతం సీమ్ అనుకూల పరిస్థితుల్లో మెరిశారు. తొలి పది ఓవర్ల అనంతరం వాంఖడెలో 39/4, విశాఖలో 5/49తో భారత్ నిలిచింది. భారత పిచ్‌లపై వన్డేల్లో టీమ్ఇండియాను ఇంతలా మరో జట్టు ఇబ్బంది పెట్టలేదు. స్పిన్ పిచ్ సైతం స్టార్క్ భారత్‌కు సవాల్ విసరనున్నాడు. ఇక ఢిల్లీ టెస్టు అనంతరం గాయంతో జట్టుకు దూరమైన డెవిడ్ వార్నర్.. చివరి వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. వార్నర్ రాకతో ఆసీస్ తుది జట్టు కూర్పు మారనుంది. ట్రావిశ్ హెడ్‌తో కలిసి దంచికొట్టిన మిచెల్ మార్ష్ మిడిల్ ఆర్డర్‌కు వెళ్లనున్నాడు. మార్నస్ లబుషేన్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. గ్లెన్ మాక్స్వెల్ సైతం తుది జట్టులో నిలువనున్నాడు. స్పిన్ పిచ్‌పై ఓ సీమర్ స్థానంలో ఆష్టన్ ఆగర్‌ను తీసుకునే అవకాశం ఉంది.
పిచ్, వాతావరణం
చెపాక్ సహజసిద్ధంగా స్పిన్ అనుకూల పిచ్. ఐపీఎల్లో సూపర్‌కింగ్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పిచ్‌ను తయారు చేశారు. ఇప్పుడే అదే పిచ్‌పై భారత్, ఆసీస్ మూడో వన్డే ఆడనున్నాయి. సోమవారం ఇక్కడ వర్షం కురిసింది. అయినా, పిచ్ నుంచి సీమర్లు తొలి రెండు వన్డేల తరహా సహకారం ఆశించలేరు. టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, ట్రావిశ్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, ఆష్టన్ ఆగర్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.