Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా కప్‌లో భారత్ మ్యాచ్‌ల ఆతిథ్య రేసులో మూడు దేశాలు
దుబాయ్ : భారత్, పాకిస్థాన్ ముఖాముఖి పోరు. ప్రపంచ క్రికెట్లో ఈ దాయాది జట్ల సమరానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ దిగ్గజ పోరాటానికి ఆతిథ్యం అందించేందుకు మూడు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. 2023 ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరుగనుండగా.. భారత జట్టు తలపడే మ్యాచులను పాకిస్థాన్‌కు ఆవల నిర్వహించేందుకు ఇటీవల దుబారులో జరిగిన ఏసీసీ సమావేశంలో నిర్ణయించారు. ఆసియా కప్‌ను పాకిస్థాన్ బయట నిర్వహిస్తే.. టోర్నీ నుంచి బారుకాట్ చేసేందుకు ఆతిథ్య పాకిస్థాన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను పాక్‌లోనే నిర్వహిస్తూ.. భారత జట్టు మ్యాచులను మాత్రం తటస్థ వేదికలకు మార్చనున్నారు. యుఏఈ, శ్రీలంక, ఇంగ్లాండ్‌లు ఆసియా కప్‌లో భారత జట్టు మ్యాచులకు వేదికగా నిలిచేందుకు పోటీపడుతున్నాయి. 2023 ఆసియా కప్‌లో ఆరు జట్లు పోటీపడనుండగా.. గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్ సహా ఓ క్వాలిఫయర్ జట్టు ఆడనున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ మరో గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4కు చేరుకుంటాయి. సూపర్-4లో టాప్-2 జట్లు ఫైనల్లో తలపడతాయి. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ కనీసం రెండు సార్లు తలపడనుండగా.. ఫైనల్స్‌కు చేరుకుంటే మూడోసారీ ఢకొీట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ జరుగనుంది. షెడ్యూల్, వేదికలు ఖరారు కోసం ఏసీసీ ఇటీవల ఓ కమిటీ నియమించింది. పాకిస్థాన్‌లో ఆసియా కప్ నిర్వహణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మొండి పట్టుదలకు వెళ్లింది. గత నెలలో బహ్రెయిన్‌లో జరిగిన సమావేశంలో పీసీబీ చైర్మెన్ టోర్నీ బహిష్కరణకు సిద్ధమంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల దుబారులో జరిగిన ఐసీసీ సమావేశానికి హాజరైన ఏసీసీ ప్రతినిధులు.. అక్కడే ఆసియా కప్ నిర్వహణపై భేటీ అయ్యారు. 2018 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ కలిగి ఉన్నా పాకిస్థాన్ జట్టు పర్యటించేందుకు ద్వైపాక్షిక సంబంధాలు అడ్డుగా నిలుస్తుండగా..ఆ టోర్నీని యుఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించింది. ఇదే తరహాలో పీసీబీ సైతం ఆలోచన చేయాలని బీసీసీఐ కార్యదర్శి జై షా సూచించారు. ఓ దశలో 2023 ఆసియా కప్ ఆతిథ్య హక్కులను శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకునేందుకు మొగ్గు చూపగా.. అందుకు పీసీబీ నిరాకరించింది. ఆసియా కప్ పాకిస్థాన్‌లో నిర్వహిస్తూ.. భారత్ ఆడే మ్యాచుల తటస్థ వేదికకు మార్చేందుకు పీసీబీ, బీసీసీఐ సహా ఏసీసీ సభ్య దేశాలు అంగీకరించాయి. యుఏఈలో సెప్టెంబర్ మాసంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. దీంతో శ్రీలంక, ఇంగ్లాండ్‌లో నిర్వహణపై దృష్టి పెట్టారు. ప్రసారదారు ఏర్పాట్లు, లాజిస్టికల్ ఇబ్బందులను సైతం గమనంలో ఉంచుకుని సరైన వేదికను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. భారత్ ఆసియా కప్ ఫైనల్స్‌కు చేరుకుంటే.. అప్పుడు టైటిల్ పోరును సైతం తటస్థ వేదికకు మార్చాల్సిందే.