Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐబీఏ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్స్
- నీతు, స్వీటీలకు బంగారు పతకాలు
- ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన బాక్సర్లు
మన పంచ్ అదిరింది. ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు రెండు పసిడి పతకాలు దక్కాయి. యువ బాక్సర్ నీతు గంగాస్ (48 కేజీలు), స్వీటీ బూర (81 కేజీలు) ప్రపంచ చాంపియన్లుగా అవతరించారు. మంగోలియా బాక్సర్‌ను నీతు చిత్తు చేయగా.. చైనా బాక్సర్‌ను స్వీటీ మట్టికరిపించింది. నేడు పసిడి పోరులో తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్, ఒలింపిక్ స్టార్ లవ్లీనా బొర్గొహైన్‌లు బరిలోకి దిగనున్నారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత బాక్సర్లు బంగారు పతకాలు సాధించారు. ఏకంగా నలుగురు బాక్సర్లు పసిడి పోరుకు అర్హత సాధించి ఔరా అనిపించిగా.. తొలి రోజు ఫైనల్స్‌లో ఇద్దరు బాక్సర్లు పసిడి పతకాలు కొల్లగొట్టారు. మహిళల 48 కేజీల విభాగంలో యువ బాక్సర్ నీతు గంగాస్ ప్రపంచ చాంపియన్‌గా నిలువగా.. మహిళల 81 కేజీల విభాగంలో స్వీటీ బూర వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. మంగోలియా బాక్సర్ లట్సైకమ్పై 5-0తో నీతు గంగాస్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. చైనా బాక్సర్ లియా వాంగ్‌పై స్వీటీ బూర పాయింట్ల ప్రకారం పైచేయి సాధించి పసిడి పతకం దక్కించుకుంది. నేడు ఐబీఏ ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ పోటీలలో చివరి రోజు. బాక్సింగ్ సూపర్‌స్టార్, డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ మహిళల 50 కేజీల విభాగంలో నేడు ఫైనల్లో పంచ్ విసరనుంది. మహిళల 75 కేజీల విభాగంలో ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు బరిలోకి దిగుతుంది. 2006 ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ అనంతరం భారత్ తొలిసారి ఒకే ఈవెంట్లో రెండు పసిడి పతకాలు సాధించింది.
నీతు అదిరెన్
మహిళల 48 కేజీల విభాగంలో నీతు గంగాస్ మెరుపు ప్రదర్శన చేసింది. సెమీఫైనల్స్ మినహా ప్రతి బౌట్ ఆర్ఎస్సీ (రిఫరీ జోక్యం)తో గెలుపొందిన నీతు గంగాస్.. పసిడి పోరును దూకుడుగా మొదలెట్టింది. తొలి రౌండ్లో ఊహించినట్టుగానే ఎదురుదాడితో ఆరంభించింది. మంగోలియా బాక్సర్ ఆరంభంలో ఆచితూచి పంచ్‌లు విసిరింది. నీతుపై సైతం పంచ్‌లు పడినా.. తొలి రౌండ్లో భారత బాక్సర్ పైచేయి సాధించింది. రెండో రౌండ్లో నీతు కాస్త సమతూకం కోల్పోయింది. అయినా, రౌండ్ ముగిసే వరకు నీతు లయ అందుకుంది. తొలి రెండు రౌండ్లలో ముందంజ వేసింది. ఇక కీలక మూడో రౌండ్ అమీతుమీ అన్నట్టు సాగింది. 28 ఏండ్ల మంగోలియా బాక్సర్‌ను 22 ఏండ్ల నీతు గంగాస్ అద్భుతంగా నిలువరించింది. వేగం, కచ్చితత్వం, టెక్నిక్‌ను నమ్ముకున్న నీతు గంగాస్.. చివరి 30 సెకండ్లలో పిడి గుద్దుల వర్షం కురిపించింది. ఐదుగురు న్యాయమూర్తులు 5-0తో నీతు గంగాస్‌ను విజే తగా ఏకగ్రీవంగా ప్రకటిం చారు. యువ బాక్సర్ నీతు గంగాస్ 48 కేజీల విభా గంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.
స్వీటీ స్వీట్
మహిళల 81 కేజీల విభాగం ఫైనల్లో స్వీటీ బూర మెప్పించింది. చైనా బాక్సర్ వాంగ్ లినాపై 4-3 పాయింట్ల తేడాతో గెలుపొం దింది. పసిడి పోరు తొలి రౌండ్లో స్వీటీ, వాంగ్ లినా ఆచితూచి అడుగేశారు. ఇద్దరిలో ఎవరూ దూకుడు చూపించలేదు. స్వీటీ కొన్ని మెరుపు పంచ్‌లు విసిరినా.. వాంగ్ లినా బ్లాక్ చేసింది. రౌండ్ ముగియనుండగా వాంగ్ లీ కొన్ని స్పష్టమైన పంచ్‌లు సంధించింది.
సమవుజ్జీల సమరంగా జరిగిన తొలి రౌండ్లో స్వీటీ బూర 3-2తో ముందంజ వేసింది. రెండో రౌండ్లో స్వీటీ బూర ఎదురుదాడి చేయటంపై దృష్టి పెట్టింది. వాంగ్ లినాపై స్వీటీ స్పష్టమైన పంచ్‌లు సంధించకపోయినా.. ఈ రౌండ్లోనూ భారత బాక్సర్ ఆధిక్యం దక్కించుకుంది. 3-2తో రెండో రౌండ్లో ముందంజ వేసింది. కీలక మూడో రౌండ్లో చైనా బాక్సర్ వాంగ్ లినా అద్భుతం చేస్తే గానీ స్వీటీ నుంచి పసిడి చేజారదు. ఈ సమయంలో స్వీటీ డిఫెన్స్ మెరిస్తే చాలు. అయినా, స్వీటీ బూర మెరిసింది. చివరి రౌండ్లో చైనా బాక్సర్‌పై పంచ్‌లు సంధించింది. మూడు రౌండ్ల బౌట్ అనంతరం స్వీటీ బూర పసిడి పట్టేసినట్టు అనిపించింది. కానీ న్యాయ నిర్ణేతలు ఫలితాన్ని సమీక్షకు పంపించారు. జడ్జిమెంట్ రివ్యూలో స్వీటీ బూర పాయింట్ల ప్రకారం 4-3తో చైనా బాక్సర్ వాంగ్ లినాపై విజయం సాధించింది. 81 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.
ప్రపంచ చాంపియన్‌గా నిలువటం పట్ల ఎంతో గర్వపడుతున్నాను. చీఫ్ కోచ్ భాస్కర్ భట్‌కు ఇంతకంటే గొప్పగా కృతజ్ఞతలు చెప్పలేను. పసిడి పోరులో దూకుడుగా ఫైట్ చేయాలని ప్రణాళిక చేసుకున్నాను. కానీ బౌట్లో కౌంటర్ ఎటాక్ చేయాలని నా కోచ్‌లు సూచించారు. ఈ విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది
- నీతు గంగాస్