Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా తెలంగాణ స్టార్
- ఫైనల్లో వియత్నాం బాక్సర్‌పై నిఖత్ పసిడి పంచ్
- లవ్లీనా బొర్గొహైన్‌కు తొలి వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం
తెలంగాణ తేజం, బాక్సింగ్ సూపర్‌స్టార్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండు పసిడి పతకాలు సాధించిన బాక్సర్‌గా ఎం.సీ మేరీకోమ్ తర్వాత స్థానంలో నిలిచింది. మహిళల 50 కేజీల పసిడి పోరులో రెండుసార్లు ఆసియా చాంపియన్‌ను మట్టికరిపించిన నిఖత్ జరీన్.. వరల్డ్ చాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ ఆసీస్ బాక్సర్‌ను చిత్తు చేసి వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో తొలి పసిడి పతకం ముద్దాడింది. నాలుగు స్వర్ణాలు సాధించిన భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ను ఘనంగా ముగించింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్ పవర్ చూపించింది. 2022 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో 52 కేజీల విభాగంలో పసిడి పతకం సాధించిన సూపర్‌స్టార్.. తాజాగా 2023 ఐబీఏ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 50 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెల్చుకుంది. రెండు సార్లు ఆసియా చాంపియన్‌షిప్స్ విజేత, వియత్నాం బాక్సర్ న్యుయెన్ తి టామ్‌ను 5-0తో ఓడించిన నిఖత్ జరీన్ ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ చాంపియన్‌గా అవతరించింది. భారత బాక్సింగ్ దిగ్గజం ఎం.సీ మేరీకోమ్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండు పసిడి పతకాలు నెగ్గిన భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ రికార్డు నెలకొల్పింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ సైతం బంగారు పతకం దక్కించుకుంది. మహిళల 75 కేజీల విభాగంలో ఆస్ట్రేలియా బాక్సర్ పార్కర్‌ను పాయింట్ల తేడాతో ఓడించిన లవ్లీనా బొర్గొహైన్ 5-2తో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కెరీర్ తొలి పసిడి పతకం ముద్దాడింది. నీతు గంగాస్ (48 కేజీలు), స్వీటీ బూర (81 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) పసిడి పోరులో పవర్ఫుల్ పంచ్‌లు సంధించగా 2023 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ నాలుగు స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. 2006 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో సైతం టీమ్ ఇండియా నాలుగు పసిడి పతకాలతో సత్తా చాటగా, ఇన్నేండ్ల అనంతరం భారత బాక్సర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావటం విశేషం.
ఎదురులేని నిఖత్
ఫైనల్లో పసిడి ఫేవరేట్‌గా బరిలో నిలిచిన నిఖత్ జరీన్.. అంచనాలకు తగినట్టు పోరాడింది. తొలుత వియత్నాం బాక్సర్ క్లీన్ పంచ్‌లు విసిరింది. ఎత్తు ప్రత్యర్థి బాక్సర్‌కు కలిసొచ్చింది. నిఖత్ ఓ జబ్ విసిరింది. నిఖత్‌ను టామ్ కిందపడేసినా.. ఇదేమీ రెజ్లింగ్ కాకపోవటంతో ఎటువంటి నష్టం జరుగలేదు. ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌కు పదేసి పాయింట్లు ఇవ్వగా.. టామ్‌కు తొమ్మిది చొప్పున పాయింట్లు ఇచ్చారు. 5-0తో తొలి రౌండ్లో నిఖత్ పైచేయి సాధించింది. ఇక రెండో రౌండ్లో నిఖత్ ఎల్లో కార్డ్ చవిచూసింది. ఎదురుదాడి చేసిన నిఖత్ లెఫ్ట్ హ్యాండ్ పంచ్‌లతో అదరగొట్టింది. వరుసగా మూడు క్లియర్ పంచులతో అదరగొట్టింది. రెండో రౌండ్లో ఇద్దరు జడ్జీలు నిఖత్‌కు ఆధిక్యం ఇవ్వగా.. ముగ్గురు జడ్జీలు ఇద్దరికీ సమానంగా పాయింట్లు ఇచ్చారు. కీలక మూడో రౌండ్లో ఇద్దరు బాక్సర్లు హోరాహోరీగా పోరాడారు. నిఖత్ రైట్‌హ్యాండ్ పంచ్‌లు విసరగా..టామ్ సైతం నిఖత్‌కు గట్టిగా ఓ పంచ్ ఇచ్చింది. మూడు రౌండ్ల అనంతరం ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌ను 5-0తో ఏకగ్రీవ విజేతగా ప్రకటించారు. 28-27, 28-27, 28-27, 29-26, 28-27తో నిఖత్ జరీన్ స్పష్టమైన విజేతగా అవతరించింది.
లవ్లీనా లవ్లీ పంచ్
ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి పసిడి పతకం సాధించింది. తొలిసారి 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న లవ్లీనా బొర్గొహైన్.. గట్టి పోటీని ఎదుర్కొని బంగారు విజేతగా నిలిచింది. పసిడి పోరులో ఆస్ట్రేలియా బాక్సర్ కైట్లిన్ పార్కర్ నుంచి లవ్లీనా తీవ్ర పోటీ చవిచూసింది. తొలి రౌండ్లో ఇద్దరు బాక్సర్లు పంచ్‌లు విసురుకున్నారు. తొలి రౌండ్లో లవ్లీనా వైపు ముగ్గురు జడ్జీలు ఉండగా, పార్కర్ వైపు ఇద్దరు జడ్జీలు నిలిచారు. రెండో రౌండ్లో పార్కర్ దూకుడు చూపించింది. క్లియర్ పంచ్‌లు లేకపోయినా.. జబ్లు విసిరింది. రౌండ్ చివర్లో లవ్లీనా క్లీన్ హుక్ పంచ్‌తో మెరిసింది. అయినా, రెండు రౌండ్ల అనంతరం పార్కర్ 2-1తో ముందంజ వేసింది. నిర్ణయాత్మక మూడో రౌండ్లో లవ్లీనా అప్పర్ కట్ పంచ్ కోసం ప్రయత్నించి మిస్ అయ్యింది. పార్కర్ సైతం క్లియర్ పంచ్‌లు విసిరేందుకు ప్రయత్నించి విఫలమైంది. సమవుజ్జీల ఫైట్‌గా జరిగిన రౌండ్లో ఇద్దరూ ఆకట్టుకున్నారు. బౌట్ అనంతరం ఇద్దరు బాక్సర్ సంబురాలు చేసుకున్నారు. ఐదుగురు న్యాయనిర్ణేతలు నిర్ణయాన్ని సమీక్షకు పంపించారు. సమీక్షలో లవ్లీనా బొర్గొహైన్ 5-2తో విజయం సాధించింది. 75 కేజీల విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.