Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా రెండో ఏడాది నేషనల్ టైటిల్
- జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్
తెలంగాణ యువ కెరటం ఆకుల శ్రీజ రికార్డు సృష్టించింది. వరుసగా రెండో సారి టేబుల్ టెన్నిస్ జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 84వ జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో నాలుగు విభాగాల్లో పోటీపడిన ఆకుల శ్రీజ ఏకంగా మూడు స్వర్ణాలు, ఓ కాంస్య పతకంతో సత్తా చాటింది. మెన్స్ విభాగంలో జి. సతియన్ నేషనల్ టైటిల్ అందుకున్నాడు.
నవతెలంగాణ-జమ్ము
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్. తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ఆర్బిఐ తరఫున బరిలో నిలిచింది. జట్టు విభాగంలో సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లోనే ఓడిన శ్రీజ.. ఫైనల్లోనూ కీలక మ్యాచ్‌లో తడబడింది. దీంతో వ్యక్తిగత విభాగంలో శ్రీజ ప్రదర్శన ప్రశ్నార్థకమైంది. అంచనాలను తలకిందులు చేసిన 24 ఏండ్ల ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్ పసిడి పతకంతో పాటు మహిళల డబుల్స్ గోల్డ్, జట్టు విభాగం స్వర్ణం సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా నాలుగు విభాగాల్లో బరిలో నిలిచిన శ్రీజ.. మూడు స్వర్ణాలు, ఓ కాంస్యంతో నాలుగు పతకాలు కొల్లగొట్టి సరికొత్త చరిత్ర లిఖించింది. పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన జి. సతియన్తో సమానంగా రూ.2.75 లక్షల నగదు బహుమానం ఆకుల శ్రీజ సొంతం చేసుకుంది.
శ్రీజ సూపర్
మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ టైటిల్‌ను నిలబెట్టుకుంది. మౌమ దాస్ (2005, 06) తర్వాత జాతీయ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండు సార్లు టైటిల్ నెగ్గిన ఏకైక ప్యాడ్లర్‌గా శ్రీజ నిలిచింది. పసిడి పోరులో 9-11, 14-12, 11-7, 13-11, 6-11, 12-10తో సీనియర్ క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీపై ఆకుల శ్రీజ అద్భుత విజయం నమోదు చేసింది. ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ తొలి సెట్‌ను గెల్చుకుని శ్రీజపై ఒత్తిడి పెంచింది. కానీ వరుసగా మూడు సెట్లు నెగ్గిన ఆకుల శ్రీజ పసిడి దిశగా తిరుగులేని ఆధిక్యం సొంతం చేసుకుంది. ఐదో సెట్లో సుతీర్థ పైచేయి సాధించి పసిడి ఆశలు నిలుపుకున్నా.. ఆరో సెట్‌ను గెల్చుకున్న ఆకుల శ్రీజ 4-2తో ఘన విజయం సాధించింది. ' మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రణాళిక ప్రకారం ఆడాను. టైటిల్ నెగ్గటం సంతోషంగా ఉంది. జట్టు విభాగంలో ఓటములు విలువైన అనుభవాన్ని అందించాయి' అని ఆకుల శ్రీజ తెలిపింది.
ఇక పురుషుల సింగిల్స్‌లో జి. సతియన్ (పిఎస్‌పిబి) చాంపియన్‌గా నిలిచాడు. టైటిల్ పోరులో హర్మీత్ దేశారు (పిఎస్‌పిబి)పై 11-9, 11-7, 11-8, 11-5తో వరుస సెట్లలో ఏకపక్ష విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో ఆకుల శ్రీజ, దియ చితల (ఆర్బిఐ) 11-7, 11-7, 8-11, 14-12తో స్వస్థిక ఘోష్, అమృత (మహారాష్ట్ర)లను ఓడించి పసిడి పతకం అందుకున్నారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మానవ్, ఆర్చన జోడీ 11-5, 14-12, 11-3తో పశ్చిమ బెంగాల్ జంటపై గెలుపొందింది.