Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ఎఫ్‌సీతో మూడేండ్ల బంధానికి తెర
- కొత్త కోచ్ అన్వేషణలో హెచ్ఎఫ్సీ
నవతెలంగాణ-హైదరాబాద్
భారత ఫుట్‌బాల్ కేంద్రంగా స్వర్ణ యుగం చూసిన హైదరాబాద్‌కు.. సాకర్‌లో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రాంఛైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ కృషి ఎనలేనిది!. ఇక మూడేండ్లుగా హైదరాబాద్ ఎఫ్‌సీ చీఫ్ కోచ్‌గా మనోలో మార్క్వెజ్ (స్పెయిన్) దక్కన్ టైగర్స్‌ను ఐఎస్ఎల్లో బలమైన జట్టుగా నిలిపారు. 2021-22 సీజన్ ఐఎస్ఎల్ చాంపియన్‌ను హైదరాబాద్ ఎఫ్‌సీ నిలిచింది. ఈ ఏడాది ఐఎస్ఎల్ సీజన్లో సెమీఫైనల్స్‌కు చేరుకుని నిలకడ చూపించింది. మనోలో మార్క్వెజ్ శిక్షణ సారథ్యంలో హైదరాబాద్ ఎఫ్‌సీ అగ్రజట్టుగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో.. ప్రాంఛైజీతో బంధానికి మనోలో మార్క్వెజ్ తెరదించారు. ఈ సీజన్లో సూపర్ కప్ అనంతరం హైదరాబాద్ ఎఫ్‌సీ డ్రెస్సింగ్‌రూమ్‌ను వీడనున్నట్టు మనోలో మార్క్వెజ్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎఫ్‌సీ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఏడాది సీజన్ ఆఖరులో సూపర్ కప్‌లో పోటీపడే హైదరాబాద్ ఎఫ్సీకి మనోలో చీఫ్ కోచ్‌గా కొనసాగనున్నారు. ఏప్రిల్ 8-25 వరకు కేరళలో జరిగే సూపర్ కప్‌లో విజయం సాధిస్తే.. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య కాంటినెంటల్ టోర్నీకి అర్హత సాధించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ సహా ఇతర ఐఎస్ఎల్, ఐ-లీగ్ జట్లు సూపర్ కప్‌పై ఇప్పుడు దృష్టి నిలిపాయి.
ఫిబ్రవరిలోనే నిర్ణయం
2022-23 ఐఎస్ఎల్ సీజన్లో హైదరాబాద్ రాణించింది. లీగ్ దశలో అగ్రస్థానం కోసం చివరి వరకు పోటీలో నిలిచింది. క్వాలిఫయర్స్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అయినా, మనోలో మార్క్వెజ్ హైదరాబాద్ ఎఫ్‌సీ వీడాలనే నిర్ణయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తీసుకున్నారు. ' హెచ్ఎఫ్సీ తరఫున మనోలో మార్క్వెజ్ మూడు సీజన్లు అద్భుతంగా పని చేశారు. హెచ్‌ఎఫ్‌సీలో ప్రతి ఒక్కరి తరఫున మనోలోకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హెచ్ఎఫ్సీని ఐఎస్ఎల్లోనే అగ్రజట్టుగా నిలిపాడు మనోలో' అని హెచ్ఎఫ్సీ యాజమాని వరుణ్ త్రిపురనేని అన్నారు. రాజీనామా నిర్ణయాన్ని మనోలో మాకు ఫిబ్రవరి ఆరంభంలోనే తెలియజేశారు. క్లబ్ పట్ల మనోలో అంకితభావం ఎనలేనిది. ముందుగా తెలియజేయటంతో కోత్త కోచ్ అన్వేషణకు తగిన సమయం ఉండేలా జాగ్రత్త వహించారు. క్లబ్ పట్ల మనోలోకు ఉన్న గౌరవం అదని వరుణ్ తెలిపారు. ' హైదరాబాద్ తరఫున మూడు అద్భుత సీజన్లు పని చేయటం గొప్పగా ఉంది. క్లబ్లో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అయినా, ఈ ఏడాది సీజన్ ఇంకా ముగియలేదు. సూపర్ కప్‌లో హెచ్ఎఫ్సీ టైటిల్ కొట్టేలా ప్రణాళిక చేస్తున్నామని' మనోలో మార్క్వెజ్ పేర్కొన్నారు.
గోవా ఎఫ్సీకి మనోలో?
స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్వెజ్ యూరోప్‌లో పలు ఫుట్‌బాల్ క్లబ్‌లకు పని చేశారు. మూడేండ్ల క్రితం హైదరాబాద్ ఎఫ్‌సీ చీఫ్ కోచ్‌గా పని చేసేందుకు భారత్‌కు వచ్చారు. తొలి సీజన్లో అంచనాలు అందుకోకపోయినా.. కోచ్‌గా రెండో సీజన్లోనే టైటిల్ పట్టారు. ప్రాంఛైజీ, కోచ్ ఇద్దరూ విడిపోయేందుకు అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. హెచ్ఎఫ్సీ చీఫ్ కోచ్‌గా యువ ఆటగాళ్లను మేటి ప్లేయర్లుగా తీర్చిదిద్దిన మనోలో మార్క్వెజ్ కోసం ఐఎస్ఎల్ ప్రాంఛైజీ గోవా ఎఫ్‌సీ మంచి ఆఫర్ సిద్ధం చేసినట్టు సమాచారం. గోవా ఎఫ్‌సీతో పాటు ఇతర క్లబ్‌లు సైతం మనోలోకు ఆకర్షణీయ కాంట్రాక్టు ఆఫర్ చేయగా.. సూపర్ కప్ అనంతరం మనోలో కొత్త ఇన్నింగ్స్ వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.