Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెరపైకి హైబ్రిడ్ మోడల్
- ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్
భారత్, పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల చర్చ ఇప్పుడు ఐసీసీకి చేరింది!. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో అడుగుపెట్టమని బీసీసీఐ స్పష్టం చేయగా.. ఇటీవల ఏసీసీ సమావేశంలో తటస్థ వేదికపై భారత జట్టు మ్యాచుల ప్రతిపాదనతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు రాజీకి వచ్చాయి. అయితే, ఆసియా కప్‌లో భారత్ మ్యాచులు తటస్థ వేదికపై నిర్వహిస్తున్నట్టే.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ మ్యాచులనూ తటస్థ వేదికపై ఆడించాలనే కొత్త ప్రతిపాదన తెరపైకి వస్తోంది.
న్యూఢిల్లీ : 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ మ్యాచులను బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది!. ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నా.. ఇరు దేశాల మధ్య ఇటీవల కాలం ద్వైపాక్షిక, రాజకీయ సంబంధాలు క్షీణ దశకు చేరుకోవటంతో పాకిస్థాన్ మ్యాచులను తటస్థ వేదికపై నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందుతుంది. గత వారం దుబారులో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలోనే 'ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్' గురించి చర్చించినట్టు తెలుస్తుంది.
బంగ్లాదేశ్‌లో పాక్ మ్యాచులు? : దుబాయ్ లో జరిగిన ఐసీసీ సమావేశానికి సమాంతరంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సైతం భేటీ అయ్యింది. అందులో ఆసియా కప్‌లో భారత్ ప్రాతినిథ్యంపై ఓ రాజీ ఫార్ములా రూపొందించారు. ఆసియా కప్ పాకిస్థాన్‌లోనే జరుగుతుంది, కానీ భారత జట్టు ఆడాల్సిన మ్యాచులు తటస్థ వేదికపై నిర్వహిస్తారు. యుఏఈ, ఓమన్, శ్రీలంక సహా ఇంగ్లాండ్‌లను భారత మ్యాచుల వేదిక కోసం పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్‌లో భారత్ వేదికగా నిర్వహించే వన్డే వరల్డ్‌కప్‌కు సైతం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించేందుకు నిరాకరిస్తుంది. ఆసియా కప్‌లో అనుసరిస్తున్న తరహాలోనే హైబ్రిడ్ మోడల్‌ను వన్డే వరల్డ్‌కప్‌కు సైతం వర్తింపచేయాలని పీసీబీ వాదించింది. దీంతో ఈ అంశాన్ని సైతం తాజా సమావేశంలోనే చర్చించినట్టు తెలుస్తోంది. ప్రసారదారు, ఇతర లాజిస్టికల్ సమస్యలను గమనంలో ఉంచుకుని బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ మ్యాచులు నిర్వహించటం మేలని ఐసీసీ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇక తాజా హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనపై ఐసీసీ సమావేశానికి హాజరైన బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనిపై బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందన లేదు.
పాక్ ఆడదేమో! : ఓవైపు పాకిస్థాన్ వరల్డ్‌కప్ మ్యాచులను తటస్థ వేదికలో నిర్వహిస్తారనే వార్తలకు బలం చేకూర్చుతూ.. ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీం ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ' భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచులను ఆడేందుకు పాకిస్థాన్ అక్కడికి వెళ్తుందని అనుకోవటం లేదు. ఆసియా కప్‌లో భారత జట్టు మ్యాచుల తరహాలోనే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ఆడాల్సిన మ్యాచులను వేరే దేశంలో, తటస్థ వేదికపై జరుగవచ్చు' అని పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ చానల్‌తో వసీం ఖాన్ అన్నారు. వసీం ఖాన్ గతంలో పీసీబీ సీఈవోగా సైతం పని చేశారు.