Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి.వి సింధు సైతం ముందంజ..స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ
మాడ్రిడ్ (స్పెయిన్) : భారత అగ్ర షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, పి.వి సింధు గెలుపు బాట పట్టారు. ఈ సీజన్లో వరుస టోర్నీల్లో నిరాశపరిచిన తెలుగు తేజాలు స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నారు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ సహచర షట్లర్ సాయిప్రణీత్‌పై గెలుపొందగా.. రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు ఇండోనేషియా అమ్మాయిని చిత్తు చేసింది. పురుషుల, మహిళల సింగిల్స్‌లో అటు శ్రీకాంత్, ఇటు పి.వి సింధు ఈ ఏడాది తొలిసారి క్వార్టర్‌ఫైనల్ ఆడనున్నారు. సెమీస్‌పై కన్నేసిన సింధు నేడు డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫిట్తో పోటీపడనుండగా, టాప్ సీడ్ కెంటా నిషిమోటతో కిదాంబి శ్రీకాంత్ ఆడనున్నాడు.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 21-12తో బి. సాయిప్రణీత్‌పై గెలుపొందాడు. 36 నిమిషాల్లోనే సహచర షట్లర్‌ను చిత్తు చేసిన శ్రీకాంత్ వరుస గేముల్లో క్వార్టర్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. రెండు గేముల్లోనూ సాయిప్రణీత్ నుంచి శ్రీకాంత్‌కు చెప్పుకోదగిన పోటీ ఎదురు కాలేదు. యువ ఆటగాడు కిరణ్ జార్జ్ ప్రీ క్వార్టర్ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ మాగస్ చేతిలో ఓటమి చెందాడు. 17-21, 12-21తో వరుస గేముల్లో పోరాడి ఓడాడు. సమీర్ వర్మ సైతం రెండో సీడ్ జపాన్ ఆటగాడు కెంట సునెయమకు 12-21 14-21తో క్వార్టర్స్ స్థానం కోల్పోయాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ పి.వి సింధు 21-14, 21-16తో అలవోక విజయం సాధించింది. స్విస్ ఓపెన్‌లో ఇండోనేషియా అమ్మాయి కుసుమ చేతిలో కంగుతిన్న సింధు.. మాడ్రిడ్‌లో లెక్క సరి చేసింది. 36 నిమిషాల ప్రీ క్వార్టర్స్ పోరులో సింధు సులువుగా క్వార్టర్స్‌కు చేరింది. మాళవిక బాన్సోద్ వాకోవర్‌తో టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్పెయిన్ స్టార్ కరొలినా మారిన్‌తో మ్యాచ్‌కు ముందే మాళవిక బాన్సోద్ ఫిట్నెస్ కారణంతో పోటీ నుంచి వైదొలిగింది. యువ షట్లర్లు అష్మిత చాలిహ 15-21, 15-21తో, ఆకర్షి కశ్యప్ 13-21, 8-21తో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి, ఆరతి సునీల్ జంట పోరాడి ఓడింది. జపాన్ జోడీ 21-12, 21-13తో వరుస గేముల్లో సిక్కి రెడ్డి జంటపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్, ధ్రువ్ కపిల జోడీ 16-21, 20-22తో జపాన్ జోడీ చేతిలో ఉత్కంఠ మ్యాచ్‌లో తడబాటుకు లోనైంది.