Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు తేజం పి.వి సింధు ఫామ్‌లోకి వచ్చింది!. సీజన్లో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫిట్పై వరుస గేముల్లో అలవోక విజయం సాధించిన అగ్రశ్రేణి షట్లర్ నేడు సింగపూర్ అమ్మాయి జిన్ మిన్తో పోటీపడనుంది. కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
- క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం
- స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 30
మాడ్రిడ్ (స్పెయిన్) : ఇండియా ఓపెన్, మలేషియా ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్, స్విస్ ఓపెన్.. ఇలా ఈ ఏడాది ఆరంభం నుంచీ భారత స్టార్ షట్లర్‌కు ఎక్కడా కలిసిరాలేదు. అనామక షట్లర్ల చేతిలోనూ పరాజయాలు సింధు ఫిట్‌నెస్‌పై అనుమానాలు రేకెత్తించాయి. సుమారు ఆరు నెలల విరామం అనంతరం షటిల్ కోర్టులో రీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు తేజం పి.వి సింధు ఈ సీజన్లో తొలిసారి ఓ టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫిట్పై మెరుపు విజయం సాధించి స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో అదరగొట్టింది. 21-14, 21-17తో సింధు వరుస గేముల్లోనే సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ఫైనల్లో టాప్ సీడ్ కెంట నిషిమోట చేతిలో పరాజయం పాలయ్యాడు.
అలవోకగా.. : ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లో మియా బ్లిచ్ఫిట్ చేతిలో ఓటమి చెందిన పి.వి సింధు.. స్పెయిన్ మాస్టర్స్‌లో లెక్క సరి చేసింది. 40 నిమిషాల్లోనే డెన్మార్క్ షట్లర్ కథ ముగించిన పి.వి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సింధుకు ఆరంభంలో కలిసిరాలేదు. 4-6తో వెనుకంజ వేసింది. కానీ విరామ సమయానికి 11-10తో సింధు పుంజుకుంది. 12-12 వరకు పాయింట్లు, ఆధిక్యం కోసం సింధుతో డెన్మార్క్ షట్లర్ గట్టిగా పోటీపడింది. ద్వితీయార్థంలో జోరందుకున్న సింధు ఏకపక్షంగా పాయింట్లు కొల్లగొట్టింది. 21-14తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో డెన్మార్క్ అమ్మాయి పుంజుకునే ప్రయత్నం చేసింది. విరామ సమయానికి 11-6తో ముందంజ వేసిన మియా బ్లిచ్ఫిట్.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లేలా కనిపించింది. 16-16 వద్ద స్కోరు సమం చేసి, 18-17తో ఆధిక్యంలోకి వచ్చిన సింధు అక్కడ్నుంచి వరుస పాయింట్లతో మియా బ్లిచ్ఫిట్కు షాక్ ఇచ్చింది. 21-17తో రెండో గేమ్‌ను గెల్చుకుని నేరుగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు ఓటమి తప్పలేదు. టాప్ సీడ్ కెంట నిషిమోట 21-18, 21-15తో శ్రీకాంత్‌పై అలవోక విజయం సాధించాడు. 41 నిమిషాల ముగిసిన క్వార్టర్ఫైనల్లో జపాన్ స్టార్‌కు శ్రీకాంత్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. రెండు గేముల్లోనూ నిషిమోటను సమం చేసేందుకు ప్రయత్నించిన శ్రీకాంత్.. ఏ దశలోనూ జపాన్ స్టార్‌పై ఆధిపత్యం చెలాయించలేదు.
స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో నేడు పి.వి సింధు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. వరల్డ్ నం.33 సింగపూర్ షట్లర్ యో జిన్ మిన్తో నేడు సింధు తలపడనుంది. సింగపూర్ అమ్మాయితో గతంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ సింధు ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. ఏ మ్యాచ్‌లోనూ మూడో గేమ్ వరకు వెళ్లలేదు. కానీ ఇటీవల సింగపూర్ షట్లర్ గణనీయమైన పురోగతి సాధించింది. షటిల్ కోర్టులో అగ్రశ్రేణి ప్లేయర్లకు సవాల్ విసురుతోంది. దీంతో నేడు సెమీఫైనల్లో సింధుకు గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.